చుండ్రు దిగులు

ప్రమాదకరమైన సమస్యేమీ కాదు. కానీ చికాకు పెడుతుంది. ముఖ్యంగా యువతీ యువకులకు చాలా ఆందోళన కలిగిస్తుంది. అవును. ఒకసారి తలలోంచి చుండ్రు రాలటం మొదలైతే అనుక్షణం కలవరపెడుతూనే వస్తుంది.

Updated : 24 Jan 2023 12:51 IST

ప్రమాదకరమైన సమస్యేమీ కాదు. కానీ చికాకు పెడుతుంది. ముఖ్యంగా యువతీ యువకులకు చాలా ఆందోళన కలిగిస్తుంది. అవును. ఒకసారి తలలోంచి చుండ్రు రాలటం మొదలైతే అనుక్షణం కలవరపెడుతూనే వస్తుంది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారోననే దిగులుతో వేధిస్తుంది. నలుగురిలోకి రాలేక నామోషీ పడేవారూ లేకపోలేదు. ఎన్నెన్నో చిట్కాలను ప్రయోగిస్తూ తగ్గించుకునే ప్రయత్నాలకూ కొదవ లేదు. ఇంతకీ ఇదేం సమస్య?

చుండ్రు తరచూ చూసేదే. మనలో సుమారు 50% మంది జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు దీని బారినపడ్డవారే. చిన్న పిల్లల దగ్గర్నుంచి యుక్తవయసువారు, యువతీ యువకులు, మధ్య వయసువారు ఎవరూ దీనికి మినహాయింపు కాదు. వయసు పైబడినవారిలోనూ.. ముఖ్యంగా పార్కిన్సన్స్‌ వంటి ఇతర సమస్యలు గలవారిలోనూ దీన్ని చూస్తుంటాం. చుండ్రు వెంట్రుకల మీద తెల్లటి పొలుసుల మాదిరిగా కనిపిస్తుంది. దుస్తుల మీదా రాలి పడుతుంది.

చుండ్రు అంటే?

మన చర్మకణాల్లో పాతవి రాలిపోతూ, కొత్తవి పుట్టుకొస్తుంటాయి. ఇది నిరంతర ప్రక్రియ. తల మీదా కొత్త చర్మకణాలు వస్తూ, పాతవి పోతుంటాయి. సాధారణంగా పాత కణాలు పోయి, కొత్తవి రావటానికి 3-4 వారాలు పడుతుంది. స్నానం చేసినప్పుడు పాత కణాలు రాలిపోతుంటాయి. ఇవేమీ మనకు కనిపించవు. అంతగా పట్టించుకోం కూడా. అయితే కొన్నిసార్లు రకరకాల సమస్యలతో తల మీది కణాలు త్వరత్వరగా పాతబడిపోతూ, కొత్తవి పుట్టుకొస్తుంటాయి. అక్కడ మృతకణాలు పేరుకుపోయి తెల్లటి పొట్టు మాదిరిగా ఊడివస్తుంటాయి. చుండ్రు అంటే ఇదే. తలపై వెంట్రుకలు, నూనె గ్రంథులు ఎక్కువగా ఉండటం వల్ల ఈ పొట్టుకు చమురు కూడా తోడవుతుంది. జిడ్డుగా మారి తలంతా చికాకు పెడుతుంది. దురద పెడుతుంది.

ఎందుకొస్తుంది?

తల మీద నూనె గ్రంథులు చికాకుకు గురికావటం.. వాటి నుంచి చమురు (సీబం) ఎక్కువగా ఉత్పత్తి కావటం ప్రధాన కారణం. ఇది యుక్తవయసులో ఎక్కువ. వీరిలో హార్మోన్ల ప్రభావం వల్ల తల మీది చమురు గ్రంథులు చురుకుగా పనిచేసి, ఎక్కువ నూనెను ఉత్పత్తి చేస్తాయి. తల చర్మం మీదుండే ఒకరకం ఫంగస్‌ దీన్ని విడగొట్టి ‘ఓలియక్‌ ఆమ్లం’గా మారుస్తుంది. ఇది తలపై చర్మాన్ని చికాకు పరచటం వల్ల కొత్త కణాలు ఎక్కువెక్కువగా పుట్టుకొస్తాయి. మరోవైపు మృతకణాల సంఖ్యా పెరుగుతుంది. ఇవన్నీ పేరుకొని, చుండ్రు మొదలవుతుంది. దురద కూడా ఆరంభమవుతుంది. చేతులతో గీరితే పొట్టు రాలి భుజాల మీద, దుస్తుల మీద పడుతుంది. మొటిమలు గలవారిలోనూ చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటుంది.

* మానసిక ఒత్తిడి, ఆందోళన ఎక్కువైనా చుండ్రు రావొచ్చు. ఒత్తిడి పెరిగితే నూనె గ్రంథులు ఎక్కువగా పనిచేస్తాయి మరి. 

* చాలామంది చుండ్రు అపరిశుభ్రతతో వస్తుందని భావిస్తుంటారు. షాంపూలు ఎక్కువగా రుద్దుతూ తల స్నానం చేస్తుంటారు. దీంతో మాడు పొడిబారి చుండ్రు మరింత ఎక్కువవుతుంది. షాంపూ పూర్తిగా పోయేలా కడుక్కోకపోయినా వాటిలోని రసాయనాలు తల మీది చర్మాన్ని చికాకు పరచొచ్చు. దీంతో కణాల ఉత్పత్తి పెరిగి, చుండ్రును ప్రేరేపించొచ్చు.

* జుట్టును బలంగా అదిమి దువ్వటం, వెంట్రుకలను వంకర్లు తిప్పటం, చక్కగా చేయటం, డ్రయ్యర్లతో వేడి చేయటం, జుట్టుకు రంగు వేయటం వంటివీ చర్మకణాలు ఎక్కువగా ఉత్పత్తయ్యేలా చేయొచ్చు.

శిశువుల్లోనూ..

శిశువుల్లో కొందరిలో మాడు మీద పొలుసుల పొర ఏర్పడుతుంటుంది. ఇదీ ఒకరకం చుండ్రే. దీన్ని సెబోరిక్‌ డెర్మటైటిస్‌ లేదా క్రాడిల్‌ క్యాప్‌ అనీ పిలుచుకుంటారు. ఇది కొన్నిసార్లు చెవుల వెనక వరకూ విస్తరించొచ్చు. ఇలాంటి పిల్లలకు తల మీద మృదువుగా కొబ్బరి నూనె రాసి, కొద్దిసేపు ఆగాలి. తర్వాత బేబీ హెయిర్‌ బ్రష్‌తో నెమ్మదిగా దువ్వాలి. అనంతరం బేబీ షాంపూతో తల స్నానం చేయించాలి. రోజూ తల స్నానం చేయించటం మంచిది.

చికిత్స ఏంటి?

శారీరక సహజ ప్రక్రియల్లో భాగంగా చుండ్రు వస్తుంటుంది కాబట్టి అందరిలోనూ ఇది తగ్గుతుందని చెప్పలేం. అయితే మానసిక ఒత్తిడి, షాంపూలు అధికంగా వాడటం వంటి కారణాలతో వస్తుంటే మాత్రం వీటిని తగ్గించుకుంటే పూర్తిగా తగ్గిపోవచ్చు. ఇప్పుడు చుండ్రు పోవటానికి మందులతో కూడిన మంచి యాంటీ-డాండ్రఫ్‌ షాంపూలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి షాంపూలతో రోజు విడిచి రోజు తల స్నానం చేయటం ముఖ్యం. రూపాయి బిళ్లంత షాంపూను తీసుకొని, దానికి కాస్త నీటిని కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. వెంటనే కడక్కూడదు. రెండు మూడు నిమిషాల సేపు అలాగే ఉంచాలి. తర్వాత పూర్తిగా పోయేలా శుభ్రంగా కడుక్కోవాలి. తల మీద షాంపూ ఆనవాళ్లేవీ లేకుండా చూసుకోవాలి. లేకపోతే చికాకు పరచొచ్చు. వారానికి మూడు సార్లు యాంటీ-డాండ్రఫ్‌ షాంపూతో స్నానం చేయాలి. మిగతా రోజుల్లో మామూలు అమోనియా రహిత, సల్ఫర్‌ రహిత, పారాబెన్‌ రహిత షాంపూలను వాడుకోవాలి. ఇవి తల జిడ్డుగా లేకుండా చూస్తాయి. తల మీది సహజ నూనెల్లో, మృత చర్మకణాల్లో మాలసెజియా అనే ఫంగస్‌ పెరుగుతుంది మరి. ఇది చుండ్రును మరింత ఎక్కువ చేస్తుంది.

* చుండ్రు ఒక మాదిరిగా ఉంటే ఇలాంటి సాధారణ పద్ధతులతోనే నయమవుతుంది. ఒకసారి చుండ్రు తగ్గుముఖం పట్టాక తిరిగి తీవ్రం కాకుండా చూసుకోవాలి. వారానికి రెండు సార్లు యాంటీ- డాండ్రఫ్‌ షాంపూను వాడుకోవటం కొనసాగించాలి. రోజూ తల స్నానం చేయాలి. షాంపూతో తల స్నానం చేసే ముందు మాడు మీద కొబ్బరి లేదా ఆలివ్‌ నూనెతో నెమ్మదిగా మర్దన చేసుకోవాలి. నూనెలో పావు చెంచా బేకింగ్‌ సోడా, కొన్ని నిమ్మరసం చుక్కలను కలిపి మర్దన చేసుకుంటే మంచిది. పది నిమిషాల సేపు అలాగే ఉండి, తర్వాత షాంపూతో స్నానం చేయాలి.

* ఇలాంటి ఇంటి చికిత్సతో 2-3 నెలలైనా ఏమాత్రం ఫలితం కనిపించకపోతే అది చుండ్రు కాకపోవచ్చు. సెబోరిక్‌ డెర్మటైటిస్‌, సోరియాసిస్‌, ఎండుగజ్జి వంటివి కారణం కావొచ్చు. చర్మ నిపుణులను సంప్రదిస్తే తగు చికిత్స సూచిస్తారు. మాత్రలు వేసుకోవాల్సి రావొచ్చు. పైపూత మలాములు అవసరపడొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని