అక్కడా ఆరోగ్యం ఆనవాళ్లు!

ఏదైనా సమస్యతో ఆసుపత్రికి వెళ్లినప్పుడు డాక్టర్లు నాలుక, కళ్లు, గోళ్లు, చర్మం వంటివి చూడటం తెలిసిందే. ఇవి ఆయా జబ్బులకు సంబంధించిన ఆనవాళ్లను చూపిస్తాయి.

Published : 25 Jul 2023 01:10 IST

ఏదైనా సమస్యతో ఆసుపత్రికి వెళ్లినప్పుడు డాక్టర్లు నాలుక, కళ్లు, గోళ్లు, చర్మం వంటివి చూడటం తెలిసిందే. ఇవి ఆయా జబ్బులకు సంబంధించిన ఆనవాళ్లను చూపిస్తాయి. ఆశ్చర్యంగా అనిపించినా మగవారిలో అంగం సామర్థ్యం, ఆకృతిలో తలెత్తే మార్పులు సైతం కొన్ని పెద్ద జబ్బులకు సంకేతాలు కావొచ్చు. మూత్ర విసర్జనతో పాటు శృంగార ఆస్వాదన, సంతానోత్పత్తికీ తోడ్పడే ఇది లోపల శారీరకంగా, మానసికంగా జరుగుతున్నదేంటో తెలియజేస్తుంది కూడా!

గుండె తీరు

అప్పుడప్పుడు అంగం గట్టిపడకపోవటం, గట్టిపడినా ఎక్కువసేపు అలాగే ఉండకపోవటం తరచూ చూసేదే. దీనికి చుట్టుపక్కల పరిసరాలు, పరిస్థితుల వంటి కారణాలు చాలానే ఉండొచ్చు. ఇవేమీ పెద్ద సమస్యలు కావు. కానీ తరచూ స్తంభన లోపంతో సతమతమవుతుంటే గుండె జబ్బుకు, రక్త ప్రసరణ సమస్యలకు సంకేతం కావొచ్చు. స్తంభన లోపం మూలంగా గుండె పోటు, గుండె ఆగిపోవటం, పక్షవాతం ముప్పులు పెరుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. గుండె పోటు బారినపడుతున్న మగవారిలో మూడింట రెండొంతుల మంది స్తంభన లోపంతో బాధపడుతుండటం విశేషం. ముఖ్యంగా చిన్న వయసులో అంగం గట్టిపడకపోవటాన్ని గమనిస్తే ఒకసారి గుండె డాక్టర్‌ను సంప్రదించటం మంచిది.

మధుమేహం

అంగం సరిగా స్తంభించకపోవటం మధుమేహం ముంచుకొస్తోందనటానికి సంకేతం కావొచ్చు. ఎందుకంటే రక్తంలో గ్లూకోజు ఎక్కువగా ఉండటం వల్ల అంగం గట్టిపడటానికి తోడ్పడే నాడులు, రక్తనాళాలు, కండరాలు దెబ్బతినొచ్చు. మధుమేహం గలవారికి స్తంభన లోపం వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువని పరిశోధనలు సూచిస్తున్నాయి. వీరికి స్తంభన లోపం 10 నుంచి 15 ఏళ్ల ముందుగానే వస్తుండటం, అదీ తీవ్రంగా ఉంటుండటం గమనార్హం.

మానసిక సమస్యలు

అంగస్తంభనలో మనసు చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. కుంగుబాటు, ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు శృంగారం మీద కోరికను తగ్గిస్తాయి. అంగ సామర్థ్యాన్నీ దెబ్బతీస్తాయి. భాగస్వాముల మధ్య పొరపొచ్చాలు, తగవుల వంటివీ ఇబ్బందులు సృష్టిస్తాయి. మద్యం, పొగ తాగటం, మాదకద్రవ్యాల వాడకమూ ఇలాంటి ప్రభావాన్నే చూపిస్తాయి.

కణజాలం మందం

అంగం అంతగా గట్టిపడనప్పుడు శృంగారంలో పాల్గొంటే లోపల కణజాలం దెబ్బతినొచ్చు. దీంతో అక్కడ మచ్చ ఏర్పడి, అంగం వంగి పోవచ్చు (పీరోనీస్‌ డిసీజ్‌). ఇది 30 డిగ్రీల కన్నా ఎక్కువ వంగిపోతే సమస్య తీవ్రంగా ఉందనే అర్థం. పొడవు, చుట్టుకొలత కూడా తగ్గొచ్చు. స్తంభన లోపం గురించి డాక్టర్‌తో చర్చించి, తగు చికిత్స తీసుకుంటే కణజాలం దెబ్బతినకుండా చూసుకోవచ్చు.

ఇన్‌ఫెక్షన్‌

అంగం మీద చిన్న చిన్న బుడిపెలు, రక్తనాళాలు ఉబ్బటం పెద్ద విషయమేమీ కాదు. చాలాసార్లు వీటి గురించి పెద్దగా బాధపడాల్సిన పనిలేదు కానీ పొక్కులు నొప్పి పుడుతున్నా, పగిలినా, రసి కారుతున్నా నిర్లక్ష్యం చేయొద్దు. వీటికి హెర్పిస్‌, సిఫిలిస్‌ వంటి సుఖవ్యాధులు కారణం కావొచ్చు. నొప్పి తక్కువగా ఉండి, దురద ఎక్కువగా పుడుతున్నా జననాంగ పులిపిర్లకు సంకేతం కావొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని