కంటికి కలక భయం!

కాలం మారింది. ఉష్ణోగ్రత మారింది. ఎడతెరపి లేని వానలు. పోటెత్తుతున్న వరదలు. వైరస్‌ వృద్ధి చెందటానికి ఇంతకన్నా ఏం కావాలి? ఇదే ఇప్పుడు ‘కలక’లం సృష్టిస్తోంది

Updated : 01 Aug 2023 04:22 IST

కాలం మారింది. ఉష్ణోగ్రత మారింది. ఎడతెరపి లేని వానలు. పోటెత్తుతున్న వరదలు. వైరస్‌ వృద్ధి చెందటానికి ఇంతకన్నా ఏం కావాలి? ఇదే ఇప్పుడు ‘కలక’లం సృష్టిస్తోంది. అవును అడినో వైరస్‌లతో తలెత్తే కళ్లకలక (కన్‌జన్‌క్టివైటిస్‌) ఇప్పుడు దేశమంతా విస్తరిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి తేలికగా వ్యాపించే ఇది మహమ్మారిలా విజృంభిస్తోంది. నిజానికిది మామూలు సమస్యే. పెద్దగా ఇబ్బంది పెట్టకుండా ఒకట్రెండు వారాల్లో దానంతటదే తగ్గిపోతుంది. అలాగని నిర్లక్ష్యం తగదు. అరుదుగానే అయినా కొందరిలో దీర్ఘకాల సమస్యలకూ దారితీయొచ్చు. కాబట్టి ఎవరి జాగ్రత్తలో వారుండటం మంచిది. ఇది ఇతరులకు అంటుకోకుండా చూడటమూ మన బాధ్యతేనని గుర్తించాలి.

కన్ను తెరవాలంటే భయం. లోపలేదో వాడిముల్లు గుచ్చుకుంటున్న భావన. కంట్లోంచి ఒకటే నీరు. ఏ పని చేయలేం. పడుకున్నా నిద్ర పట్టదు. కళ్లకలక ఇలాగే ఇబ్బంది పెడుతుంది. చిన్న సమస్యే అయినా ఉన్నంతసేపు బాగా వేధిస్తుంది. మన కంట్లో రెప్పల లోపల, తెల్లగుడ్డు మీద పారదర్శక పొర (కన్‌జన్‌క్టైవా) పరచుకొని ఉంటుంది. ఇది కంటిని రక్షణ కవచంలా కాపాడుతుంది. కన్నీరు, జిగురుద్రవం ఉత్పత్తయ్యేలా చేసి, కన్ను తడిగా ఉండటానికీ తోడ్పడుతుంది. చూపు బాగుండటానికి తడి చాలా కీలకం. ఎందుకంటే నల్లగుడ్డు (కార్నియా) పొడిబారితే చూపు పోతుంది మరి. కన్నీటిలోని లైసోజోమ్‌ అనే ఎంజైమ్‌ బ్యాక్టీరియా, వైరస్‌లను నిలువరిస్తుంటుంది. దీన్ని కంటి నిండా విస్తరించేలా చేసేది కన్‌జన్‌క్టైవానే. ఈ పొర ఉబ్బటమే కళ్లకలకకు దారితీస్తుంది. దీనికి బ్యాక్టీరియా, వైరస్‌, అలర్జీల వంటివేవైనా కారణం కావొచ్చు. ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తున్న కళ్లకలకకు కారణం అడినో వైరస్‌లే.

మూడు రకాలు

అడినో వైరస్‌లతో తలెత్తే కళ్లకలక మూడు రకాలు. 1. ఎపిడమిక్‌ కెరటోకన్‌జన్‌క్టివైటిస్‌ (ఈకేసీ). ఇది మహమ్మారిలా విజృంభించే రకం. తీవ్రమైన సమస్య ఇదే. ఇందులో జ్వరమేమీ ఉండదు. కళ్లు ఎరుపెక్కటం, నీరు కారటం ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఒక కన్నుకే వస్తుంది. వారం తర్వాతే రెండో కంటికి అంటుకుంటుంది. ఒకరి నుంచి మరొకరికి తేలికగా అంటుకుంటుంది. ఆఫీసులో, ఇంట్లో, బడిలో ఒకే సమయంలో ఎక్కువ మందికి వస్తుండటం దీని ప్రత్యేకత. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది.       2.ఫెరింగోకన్‌జన్‌క్టైవల్‌ ఫీవర్‌. ఇందులో కాస్త జ్వరం, కొద్దిగా గొంతునొప్పి, ఒక మాదిరిగా కళ్లకలక ఉంటాయి. 3. ఫాలిక్యులర్‌ కన్‌జన్‌క్టివైటిస్‌. ఇది మామూలు సమస్య. ఇందులో కళ్లు ఎర్రబడటం, నీరు కారటం వంటివి కనిపిస్తాయి.

ఇతర కారణాలతోనూ

కళ్లకలక బ్యాక్టీరియా మూలంగానూ రావొచ్చు. ముఖ్యంగా స్టాఫిలోకాకల్‌ లేదా స్ట్రెప్టోకాకల్‌ బ్యాక్టీరియాతో వస్తుంది. హెర్పిస్‌ సింప్లెక్స్‌, హెర్పిస్‌ జోస్టర్‌ వైరస్‌లతో వచ్చేది హెర్పిటిక్‌ కన్‌జన్‌క్టివైటిస్‌. ఇందులో కార్నియా దెబ్బతినే ప్రమాదముంది. కళ్ల చుట్టుపక్కల చర్మం మీద పొక్కులు (వెసైకిల్స్‌) ఏర్పడతాయి. కనుపాప వాపుతో తలెత్తేది ఐరిటిస్‌.

ముదిరితే ఇబ్బందే

కళ్లకలక చాలావరకు తేలికైన సమస్యే. దానంతటదే తగ్గిపోయేదే. కానీ కొందరిలో తీవ్ర దుష్ప్రభావాలకు దారితీయొచ్చు. కళ్లకలక ముదిరితే కనురెప్పలు, కంటిపొర వాపు తలెత్తుతుంది. ఇంకా తీవ్రమైతే కంటి లోపల పొర(మెంబ్రేన్‌)లాంటిది ఏర్పడుతుంది. దీంతో కళ్లు ఎరుపెక్కటం, నీరు కారటం, నొప్పి, లోపల గుచ్చుకోవటం వంటి లక్షణాలు చాలా ఉద్ధృతంగా ఉంటాయి. మెంబ్రేన్‌ను తొలగిస్తే తప్ప ఉపశమనం కలగదు. ఈ పొరతో చిక్కేంటంటే- మున్ముందు కళ్లు పొడిబారటం (డ్రై ఐస్‌), నల్లగుడ్డు ముందుభాగం (కార్నియా) వాపు వంటి సమస్యలు తలెత్తటం. కార్నియా వాపు (కెరటైటిస్‌) ఒక పట్టాన తగ్గదు. మూడు నాలుగు వారాల వరకూ వేధించొచ్చు. కార్నియా మీద మచ్చలూ ఏర్పడొచ్చు. కొందరికివి ఏడాది వరకూ ఉండొచ్చు. కొందరిలో శాశ్వతంగానూ ఉండిపోవచ్చు. అందువల్ల కళ్లకలక తగ్గకుండా వేధిస్తుంటే వెంటనే కంటి డాక్టర్‌ను సంప్రదించాలి.

నివారణే కీలకం

కళ్ల కలక ఒకరి నుంచి మరొకరికి తేలికగా, త్వరగా వ్యాపిస్తుంది. కుటుంబంలో ఒకరికి వస్తే అందరికీ అంటుకోవచ్చు. కాబట్టి కళ్ల కలక వచ్చినవారు విడిగా ఉండటం చాలా చాలా ముఖ్యం. ఉద్యోగులు ఆఫీసులకు, విద్యార్థులు బడులకు వెళ్లొద్దు. ముఖ్యంగా తొలి 5 నుంచి 10 రోజుల వరకు ఇంట్లోనే ఉండాలి. ఇంట్లోనూ వేరే గదిలో ఉండాలి. కలక తగ్గుతున్న దశలో ఇతరులతో కలిసినా ఇబ్బందేమీ ఉండదు.

  •  నల్ల కళ్లద్దాలు ధరించాలి. దీంతో కళ్లకు ఎక్కువ వెలుతురు తగలదు. చేతులతో కళ్లను నులమటమూ తగ్గుతుంది. ఇది సమస్య తీవ్రం కాకుండా కాపాడటానికే కాదు.. ఇతరులకు అంటుకోకుండానూ నిలువరిస్తుంది.
  •  చేతులను తరచూ సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. కళ్ల కలకకు కారణమయ్యే వైరస్‌, బ్యాక్టీరియా ఆయా ఉపరితలాల మీద ఎక్కువసేపు జీవించి ఉంటుంది. వాటిని తాకిన చేతులతో కళ్లను రుద్దుకుంటే వెంటనే అంటుకుంటుంది.
  •  కళ్లకలక వచ్చినవారు తమ దుప్పటి, తువ్వాలు వంటివి విడిగా పెట్టుకోవాలి. ఇతరులు వాడుకునే వాటితో కలవనీయొద్దు. ఫోన్‌ వంటి పరికరాలు షేర్‌ చేసుకోవద్దు.
  • సాధారణంగా వైరల్‌ కళ్లకలక ఒక కంటికే వస్తుంటుంది. దీన్ని తాకిన చేతిని మరో కంటికి తగలకుండా చూసుకుంటే రెండో కంటికి అంటుకోకుండా కాపాడుకోవచ్చు. సమస్యను ఒక కంటికే పరిమితం చేసుకోవచ్చు.
  •  కళ్లకలక గలవారి కళ్లను చూస్తే తమకూ అంటుకుంటుందని కొందరు భావిస్తుంటారు. ఇది నిజం కాదు. చేతులతో లేదా నీటితో వైరస్‌ కళ్లకు అంటుకుంటే తప్ప కళ్లకలక సోకదు.

లక్షణాలేంటి?

  •  కళ్లు ఎరుపెక్కటం
  •  నీరు కారటం
  •  లోపలేదో గుచ్చుకుంటున్నట్టు అనిపించటం
  •  దురద
  •  నొప్పి
  •  వెలుతురు చూడలేకపోవటం 

చికిత్స

నిజానికి వైరల్‌ కళ్లకలకకు యాంటీవైరల్‌ మందులేవీ లేవు. కాబట్టి తరచూ శుభ్రం చేసుకోవటం ముఖ్యం. తాత్కాలిక ఉపశమనానికి కృత్రిమ కన్నీరు (లూబ్రికెంట్‌) చుక్కల మందు, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ తలెత్తకుండా యాంటీబయాటిక్‌ చుక్కల మందు ఉపయోగపడతాయి. దురద, వాపు ఉన్నట్టయితే యాంటీహిస్టమిన్‌, పారాసిటమాల్‌ మాత్రలు మేలు చేస్తాయి. వీటితో ఇబ్బందులు తగ్గి, నిద్ర బాగా పడుతుంది. సమస్య మరీ తీవ్రమైతే పొవొడిన్‌ అయోడిన్‌ చుక్కల మందు ఉపయోగపడుతుంది.

  •  బ్యాక్టీరియా కళ్లకలకకు చికిత్స తేలిక. యాంటీబయాటిక్‌ మలాములు, చుక్కల మందులతో వారంలోనే తగ్గిపోతుంది.  
  •  హెర్పిటిక్‌ కళ్లకలకకు ఎసైక్లోవిర్‌ అనే యాంటీ వైరల్‌ మందు ఉపయోగపడుతుంది.
  •  ఐరిటిస్‌ కళ్లకలకకు స్టిరాయిడ్స్‌ ఉపయోగపడతాయి.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని