డెంగీ కాటు!

వానలతో పాటే దోమలూ పెరిగాయి. ఇవి మోసుకొచ్చే జబ్బుల భయమూ మొదలైంది. ముఖ్యంగా డెంగీ జ్వరం కలవర పెడుతోంది.

Published : 08 Aug 2023 00:13 IST

వానలతో పాటే దోమలూ పెరిగాయి. ఇవి మోసుకొచ్చే జబ్బుల భయమూ మొదలైంది. ముఖ్యంగా డెంగీ జ్వరం కలవర పెడుతోంది. చాలావరకు మామూలుగా తగ్గేదే అయినా కొందరికిది ప్రాణాంతకంగానూ పరిణమించొచ్చు. ప్రస్తుతం డెంగీ 2 రకం వైరస్‌ ఎక్కువగా ప్రబలుతోంది. దీంతో త్వరగా ప్లేట్‌లెట్లు పడిపోవటం ఆందోళన కలిగిస్తోంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.

డెంగీకి మూలం ఫ్లేవీవైరస్‌లు. వీటిల్లో డెంగీ1, డెంగీ2, డెంగీ3, డెంగీ4.. ఇలా నాలుగు ఉపజాతులున్నాయి. ఇవి ఆడ ఈజిప్టై దోమ కుట్టటం ద్వారా వ్యాపిస్తాయి. ఒక ఉపజాతి వైరస్‌తో ఇన్‌ఫెక్షన్‌ వస్తే జీవితంలో మరెన్నడూ తిరిగి దాంతో జ్వరం రాదు. అయితే ఇతర ఉపజాతులతో రావొచ్చు. అంటే ఎవరికైనా జీవితంలో గరిష్ఠంగా నాలుగు సార్లు డెంగీ వచ్చే అవకాశముంటుందన్నమాట. రెండోసారి, మూడోసారి మరో ఉపజాతి వైరస్‌తో జ్వరం వస్తే చాలా తీవ్రంగా ఉండటం గమనార్హం.

దోమ కుట్టగానే వచ్చేస్తుందా?

కుట్టిన దోమలో డెంగీ కారక వైరస్‌ ఉంటనే సమస్య. దోమలో వైరస్‌ ఉన్నా తప్పకుండా జ్వరం రావాలనీ లేదు. కొందరికి తెలియకుండానే ఎప్పుడో అప్పుడు డెంగీ ఇన్‌ఫెక్షన్‌ వచ్చి ఉండొచ్చు. దీంతో వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు అప్పటికే శరీరంలో ఉండొచ్చు. ఇక డెంగీ వైరస్‌ శరీరంలోకి ప్రవేశించినా అందరికీ లక్షణాలు ఉండకపోవచ్చు. చాలామందికి ఒకట్రెండు లక్షణాలతోనే ఆగిపోవచ్చు. కొందరికే తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు వేధిస్తాయి.

నిర్ధరణకు యాంటీజెన్‌ పరీక్ష

జ్వరం మొదలైన 1-5 రోజుల్లో ఎన్‌ఎస్‌1 యాంటీజెన్‌ పరీక్ష పాజిటివ్‌గా ఉంటే డెంగీ ఉన్నట్టే. జ్వరం మొదలైన 5 రోజుల తర్వాత అయితే ఐజీఎం యాంటీబాడీ పరీక్ష అవసరం. సత్వరం ఫలితాలనిచ్చే ర్యాపిడ్‌ డయాగ్నస్టిక్‌ పరీక్షల్లో డెంగీ ఉన్నట్టు తేలినా ప్రామాణిక పరీక్షలతోనే నిర్ధారించుకోవటం ముఖ్యం. అవసరమైతే ఐజీజీ యాంటీబాడీ పరీక్ష చేయాల్సి ఉంటుంది. గతంలో డెంగీ వస్తే ఇందులో తేలుతుంది. ఇది పాజిటివ్‌గా ఉంటే రెండో సారో, మూడో సారో డెంగీ వచ్చిందని అర్థం. ఇలాంటి డెంగీ తీవ్రంగా పరిణమించొచ్చు.

నిర్లక్ష్యం చేయొద్దు

కడుపు నొప్పి, విడవకుండా వాంతులు, పొట్టలో, ఛాతీలో ద్రవం పోగుపడటం, నిస్సత్తువ, కాలేయం పెద్దగా అవటం వంటివి ఉన్నప్పుడు వెంటనే ఆసుపత్రిలో చేర్చాలి. రక్తపోటు పడిపోవటం, విడవకుండా రక్తస్రావం అవటం, ఏదైనా అవయవం విఫలమవుతోందనే సూచనలు (ఛాతీలో నొప్పి, ఆయాసం, ఫిట్స్‌ వంటివి) కనిపిస్తే అసలే తాత్సారం చేయరాదు.

మధుమేహం, అధిక రక్తపోటు, పొట్టలో అల్సర్లు, రక్తహీనత గలవారితో పాటు గర్భిణులు, ఊబకాయులు, ఏడాది లోపు పిల్లలు, వృద్ధులకు డెంగీ ప్రమాదకరంగా పరిణమించొచ్చు. లక్షణాలు అంత స్పష్టంగా లేకపోయినా వీరికి ఆసుపత్రిలో చికిత్స అవసరం.

పరిస్థితిని బట్టి చికిత్స

ఒక మాదిరి డెంగీ జ్వరానికి పారాసిటమాల్‌ మాత్రలు ఇస్తే సరిపోతుంది. వాంతులు లేకపోతే ఓఆర్‌ఎస్‌ ద్రావణాన్ని తాగించాలి. వాంతులు అవుతుంటే వాటిని తగ్గించే మందులతో పాటు ఓఆర్‌ఎస్‌ ద్రావణాన్ని ఇవ్వాలి. అప్పటికీ తగ్గకపోతే.. ముఖ్యంగా పిల్లలను ఆసుపత్రిలో చేర్చి, చికిత్స చేయాలి. ప్లేట్‌లెట్లు బాగా తగ్గటం, రక్తం చిక్కబడటం వంటివి గలవారికి తరచూ రక్తం చిక్కదనాన్ని తెలిపే హిమటోక్రిట్‌/ప్యాక్డ్‌ సెల్‌ వాల్యూమ్‌, ప్లేట్‌లెట్ల సంఖ్య తెలుసుకోవటానికి రక్తపరీక్షల వంటివి చేస్తూ జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. నోటి ద్వారా ద్రవాలు తీసుకోలేని స్థితిలో ఉన్నా, రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం ఎక్కువున్నా, రక్తపోటు బాగా పడిపోయినా సెలైన్‌ ఎక్కించాల్సి ఉంటుంది. ఊపిరితిత్తుల్లోకి ప్లాస్మా ద్రవం లీకవటం వల్ల ఆయాసం వస్తున్నట్టయితే కొందరికి వెంటిలేటర్‌ అమర్చి చికిత్స చేయాల్సి ఉంటుంది. పొట్టలో, ఊపిరితిత్తుల్లో పోగుపడిన ద్రవాన్ని బయటకు తీసే ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే రక్తస్రావమయ్యే ప్రమాదముంది. కాలేయం, గుండె వంటి అవయవాలు దెబ్బతిన్నప్పుడు వాటికి తగిన చికిత్సలు అవసరమవుతాయి.

  • గర్భిణుల్లోనైతే కాన్పు సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వీరికి రక్తస్రావమయ్యే ప్రమాదముంది కాబట్టి తప్పనిసరైతేనే సిజేరియన్‌కు ప్రయత్నించాలి. సాధ్యమైనంతవరకు సహజ కాన్పు అయ్యేలా చూసుకోవాలి.

ప్లేట్‌లెట్లు పడిపోతే?

ప్లేట్‌లెట్ల సంఖ్య లక్ష కన్నా తగ్గినప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలి. ప్లేట్‌లెట్లు 50వేల కన్నా పడిపోతే ఆసుపత్రిలో చేర్చి, నిశితంగా పరిశీలిస్తుండాలి. ఒకవేళ ప్లేట్‌లెట్లు 20 వేల కన్నా తగ్గి, రక్తస్రావ లక్షణాలు కనిపిస్తుంటే బయటి నుంచి ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. అదే 10 వేలకు పడిపోతే.. రక్తస్రావం ఉన్నా లేకున్నా ప్లేట్‌లెట్లు ఎక్కించాలి.

ఆసుపత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జి?

  • పారాసిటమాల్‌ మాత్రలు ఇవ్వకపోయినా రెండ్రోజుల వరకు జ్వరం లేనప్పుడు.
  • ఆకలి మామూలుగా అవుతున్నప్పుడు
  • నాడి, శ్వాస వేగం, రక్తపోటు నార్మల్‌గా ఉన్నప్పుడు.
  • మూత్రం సాఫీగా వస్తున్నప్పుడు
  • ప్లేట్‌లెట్లు కనీసం 50వేల కన్నా ఎక్కువైనప్పుడు. లక్ష కన్నా ఎక్కువుంటే ఉత్తమం.
  • సెలైన్‌ ఇవ్వకపోయినా హిమటోక్రిట్‌ స్థిరంగా ఉన్నప్పుడు.

నివారణ మన చేతుల్లో

డెంగీ వచ్చాక ఇబ్బందులు పడటం కన్నా రాకుండా చూసుకోవటమే ఉత్తమం. దోమలు కుట్టకుండా చూసుకుంటే డెంగీని పూర్తిగా నివారించుకోవచ్చు.

  • డెంగీ దోమలు నిల్వ ఉన్న నీటిలో పెరుగుతాయి. కాబట్టి ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, పాత డబ్బాల వంటివి ఉంటే వెంటనే తొలగించేయాలి.
  • డెంగీ దోమలు సాధారణంగా పగటి పూటే చురుకుగా ఉంటాయి. కాబట్టి పగటి పూట నిద్రించేటప్పుడు మంచానికి దోమతెరలు వాడుకోవాలి.
  • ఇంటి తలుపులు, కిటికీల్లోంచి దోమలు రాకుండా మెష్‌ బిగించుకోవాలి. గది చల్లదనం కోసం వీలైతే కిటికీలు తెరవకుండా ఏసీ వాడుకోవాలి.
  • బయటకు వెళ్లినప్పుడు పొడుగు చేతుల చొక్కాలు, ప్యాంట్లు, సాక్స్‌, వీలైతే పాదాలకు షూ ధరించాలి.
  • కాళ్లూ చేతులకు దోమలను తరిమేసే క్రీములు రాసుకోవాలి.

ఏం చేయాలి? ఏం చేయకూడదు?

  • జ్వరం తగ్గటానికి పారాసిటమాల్‌ మాత్రలు వేసుకోవచ్చు. అయితే నొప్పి మందులు (ఐబూప్రొఫెన్‌, అనాల్జిన్‌, డైక్లోఫెనాక్‌, ఆస్ప్రిన్‌ వంటివి) వేసుకోకూడదు. కండరానికి ఇంజెక్షన్లు తీసుకోకూడదు యాంటీబయాటిక్‌, యాంటీవైరల్‌ మందులు వేసుకోకూడదు
  • అనవసరంగా రక్తం, ప్లేట్‌లెట్లు, సెలైన్‌ ఎక్కించుకోవద్దు. ద్రవాలు తగినంత తీసుకోవాలి. విశ్రాంతి తీసుకోవాలి.
  • బొప్పాయి ఆకు, పండ్ల రసాలతో కొంతవరకు ప్లేట్‌లెట్లు పెరగొచ్చు గానీ వాటితోనే డెంగీ, డెంగీ మూలంగా సంభవించే మరణాలు తగ్గుతాయని కచ్చితంగా చెప్పలేం. అందువల్ల వీటి మీదే ఆధారపడటం తగదు.

ఇదే తీవ్ర సమస్య

డెంగీలో ప్లేట్‌లెట్లు తగ్గటం కన్నా రక్తం చిక్కబడటమే ప్రమాదకరం. డెంగీ దాడిచేసినప్పుడు ఒంట్లో విడుదలయ్యే ఇంటర్‌ల్యూకీన్‌-6 అనే రసాయనం రక్తనాళల గోడల కణాల మధ్య అతిసూక్ష్మ రంధ్రాలు పడేలా చేస్తుంది. వాటిల్లోంచి ద్రవం బయటకు రావటం వల్ల రక్తం చిక్కపడుతుంది. హిమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుంది. దీంతో రక్తపోటు పడిపోయి, అవయవాలన్నీ దెబ్బతిని, షాక్‌లోకి వెళ్లిపోవచ్చు. మరణమూ సంభవించొచ్చు.

జ్వరం తగ్గాకే అసలు ప్రమాదం

డెంగీలో అసలు ప్రమాదం జ్వరం తగ్గుతున్నప్పుడే మొదలవుతుంది. రక్తపోటు, ప్లేట్‌లెట్లు పడిపోయేది ఈ సమయంలోనే. అందువల్ల ‘హమ్మయ్య జ్వరం తగ్గింది’ అని అనుకోవటానికి లేదు. అప్పుడే మరింత అప్రమత్తంగా ఉండాలి.


 

లక్షణాలు- రకరకాలు

డెంగీలో తొలి, విషమ దశలను బట్టి లక్షణాలు కనిపిస్తాయి.

తొలిదశలో..

  • ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం
  • తీవ్రమైన.. తల పగిలిపోతోందేమో అన్నంత తలనొప్పి
  • కళ్ల వెనక నుంచి నొప్పి
  • వాంతి, వికారం
  • ఒళ్లు నొప్పులు
  • కీళ్ల నొప్పులు
  • ఆకలి మందగించటం

విషమదశలో..

  • కడుపు నొప్పి, ఆయాసం
  • పొట్టలో లేదా ఛాతీలో నీరు పోగుపడటం
  • విడవకుండా వాంతులు
  • చిగుళ్ల వంటి భాగాల నుంచి రక్తం రావటం
  • చర్మం మీద ఎర్రటి చుక్కల్లాంటి మచ్చలు
  • రక్తపోటు పడిపోవటం, అపస్మారం
  • కాళ్లు చేతులు చల్లబడటం
  • నిస్సత్తువ, అస్థిమితం
  • చికాకు
  • మగత
  • కాలేయం పెద్దగా అవటం
  • రక్తంలో హిమటోక్రిట్‌ (హిమోగ్లోబిన్‌) ఎక్కువవటం. అదే సమయంలో ప్లేట్‌లెట్లు వేగంగా పడిపోవటం.

ఎప్పుడు కోలుకున్నట్టు?

జ్వరం పూర్తిగా తగ్గిపోయి.. నాడీ వేగం, రక్తపోటు, శ్వాస తీసుకోవటం మామూలు స్థాయికి వచ్చినప్పుడు డెంగీ నయమైనట్టు. వాంతులు, కడుపునొప్పి లేకపోవటం.. ఆకలి పెరగటం, మూత్రం సాఫీగా రావటం, హిమోగ్లోబిన్‌ స్థాయులు స్థిరంగా ఉండటం వంటివన్నీ జ్వరం తగ్గిందనటానికి సూచికలే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని