అలసట ఎందుకు?

శరీరం హుషారుగా ఉండదు. అలసిపోయినట్టే అనిపిస్తుంటుంది. నిస్సత్తువ ఆవహించేస్తుంటుంది. ఎప్పుడో అప్పుడు ఇలాంటి పరిస్థితి అంతా ఎదుర్కొనేదే.

Published : 22 Aug 2023 00:28 IST

శరీరం హుషారుగా ఉండదు. అలసిపోయినట్టే అనిపిస్తుంటుంది. నిస్సత్తువ ఆవహించేస్తుంటుంది. ఎప్పుడో అప్పుడు ఇలాంటి పరిస్థితి అంతా ఎదుర్కొనేదే. సరిగా తిననప్పుడో, రాత్రి నిద్ర పట్టనప్పుడో అలసట మామూలే. కానీ అదేపనిగా నిస్సత్తువకు గురవుతుంటే కారణమేంటో తెలుసుకోవాల్సిందే.

రక్తహీనత

మహిళల్లో నిస్సత్తువకు ప్రధాన కారణం రక్తహీనత (అనీమియా). నెలసరి సమయంలో రుతుస్రావం మూలంగా ఐరన్‌ లోపించొచ్చు. ఇది రక్తహీనత ముప్పు పెంచుతుంది. అన్ని అవయవాలకు, కణజాలాలకు ఆక్సిజన్‌ను చేరవేసేవి ఎర్ర రక్తకణాలే. రక్తహీనతలో ఎర్ర రక్తకణాల సంఖ్య తగ్గుతుంది. ఫలితంగా తగినంత ఆక్సిజన్‌ అందక అవయవాలు చతికిల పడతాయి. దీంతో అలసట, నీరసం, నిస్సత్తువ వేధిస్తాయి. విటమిన్‌ బి12 లోపంతోనూ రక్తహీనత తలెత్తొచ్చు.

  • ఐరన్‌, విటమిన్‌ బి12 లభించే ఆహారం తినటం.. అవసరమైతే మాత్రలు వేసుకోవటం ద్వారా రక్తహీనత తగ్గుతుంది.

కుంగుబాటు
ఇది మానసిక సమస్యే అయినా శారీరకంగానూ నిస్సత్తువ, తలనొప్పి, ఆకలి లేకపోవటం వంటి చాలా లక్షణాలకు కారణమవుతుంది. వారాలు గడిచినా అలసట, నిరుత్సాహం తొలగకపోతే మానసిక వైద్యులను సంప్రదించి, కుంగుబాటు ఉందేమో పరీక్షించుకోవటం మంచిది.

  • కౌన్సెలింగ్‌, మందులతో కుంగుబాటు చాలావరకు నయమవుతుంది.

థైరాయిడ్‌ జబ్బు

మెడ ముందుభాగాన ఉండే థైరాయిడ్‌ గ్రంథి మనం తిన్న ఆహారం శక్తిగా మారే వేగాన్ని (జీవక్రియ) నియంత్రిస్తుంది. థైరాయిడ్‌ గ్రంథి సరిగా పనిచేయకపోతే (హైపోథైరాయిడిజమ్‌) జీవక్రియ వేగం మందగిస్తుంది. దీంతో అలసట ఆవహిస్తుంది. బరువూ పెరుగుతుంది.

  • తేలికైన రక్త పరీక్షతో థైరాయిడ్‌ పనితీరును తెలుసుకోవచ్చు. థైరాయిడ్‌ హార్మోన్‌ మాత్రలతో లోపాన్ని భర్తీ చేసుకోవచ్చు.
  • అతిగా కెఫీన్‌

కెఫీన్‌తో హుషారు, చురుకుదనం, ఏకాగ్రత పెరిగే మాట నిజమే. కానీ ఒక మాదిరిగా తీసుకుంటేనే. కెఫీన్‌ అతిగా తీసుకుంటే గుండె వేగం, రక్తపోటు, చిరాకు పెరుగుతాయి. కొందరిలో అలసటకూ దారితీయొచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.

  • క్రమంగా కాఫీ, టీ, చాక్లెట్లు, కూల్‌డ్రింకులు తగ్గించుకోవాలి. కెఫీన్‌తో కూడిన మందులు వాడుతున్నా తగ్గించుకోవాలి. వీటిని హఠాత్తుగా ఆపేస్తే చిరాకు వంటివి పెరిగి మరింత నిస్సత్తువకు దారితీయొచ్చు.
  • మూత్ర ఇన్‌ఫెక్షన్‌

మూత్ర ఇన్‌ఫెక్షన్‌లో మంట పుట్టటం, వెంటనే మూత్రానికి వెళ్లాల్సి రావటం వంటి లక్షణాలు మామూలే. కానీ కొందరిలో అలసట, నిస్సత్తువ కూడా కలగొచ్చు.

  • తేలికైన మూత్ర పరీక్షతో ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించొచ్చు. తగు యాంటీబయాటిక్‌ మందులతో ఇన్‌ఫెక్షన్‌ తగ్గుతుంది. నిస్సత్తువ కూడా వారంలో తగ్గుముఖం పడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని