Fever: జ్వరాల కాలం

జ్వరం వణికిస్తోంది! ఏ ఇంట చూసినా ఇదే. పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకూ అందరినీ కలవర పెడుతోంది. అసలే వానాకాలం.

Updated : 26 Sep 2023 20:49 IST

జ్వరం వణికిస్తోంది! ఏ ఇంట చూసినా ఇదే. పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకూ అందరినీ కలవర పెడుతోంది. అసలే వానాకాలం. పైగా విచిత్రమైన పరిస్థితి. కురిస్తే భారీ వర్షం. కాస్తే మహా ఎండ. తేమ, వేడితో కూడిన ఇలాంటి వాతావరణం. వైరస్‌ వృద్ధి చెందటానికి ఇంతకన్నా ఇంకేం కావాలి? మరోవైపు ఇబ్బడి ముబ్బడిగా దోమల సంత. వీటి మూలంగా జలుబు, ఫ్లూ, డెంగీ, మలేరియా తెగ విజృంభించేస్తున్నాయి. నిజానికివన్నీ మామూలుగా తగ్గేవే. కానీ పరిస్థితి విషమిస్తే కొన్నిసార్లు ప్రాణాంతకంగానూ పరిణమించొచ్చు. కాబట్టి ఈ జ్వరాల కాలంలో చేయాల్సిన, చేయకూడని పనులేంటో తెలుసుకుందాం.


డెంగీ జ్వరం తగ్గాకే ప్రమాదం

ప్రస్తుతం పిల్లలను, పెద్దలను వణికిస్తున్న జ్వరమిది. దీనికి మూలం డెంగీ వైరస్‌లు. ఇవి ఈడిస్‌ జాతి దోమలు కుట్టటంతో వ్యాపిస్తాయి. వైరస్‌ శరీరంలోకి ప్రవేశించినా 10% మందిలోనే లక్షణాలు కనిపిస్తాయి. చాలామందికి ఒకట్రెండు లక్షణాలతోనూ ఆగిపోవచ్చు. కొందరికి తీవ్రం కావొచ్చు. డెంగీలో తొలి ఐదురోజుల్లో- ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం, తల పగిలిపోతోందేమో అన్నంత తలనొప్పి, కళ్ల వెనకాల నొప్పి వేధిస్తాయి. వాంతి, వికారం, ఒళ్లు నొప్పులు, నడుం నొప్పి, కీళ్ల నొప్పులూ ఉండొచ్చు. ఆకలీ తగ్గుతుంది. సమస్య తీవ్రమైతే-  కడుపునొప్పి, ఆయాసం, పొట్టలో లేదా ఛాతీలో నీరు చేరటం, చిగుళ్ల వంటి జిగురు పొరల నుంచి రక్తం రావటం, చర్మం మీద ఎర్రటి చుక్కల్లాంటి మచ్చలు కనిపిస్తాయి. డెంగీ జ్వరం చాలావరకు పారాసిటమాల్‌ మాత్రలతోనే తగ్గుతుంది. ఒంట్లో నీటిశాతం తగ్గకుండా ఓఆర్‌ఎస్‌ పొడిని కలిపిన నీళ్లు తాగుతూ ఉండాలి. డెంగీలో జ్వరం తగ్గాకే అసలు ప్రమాదం మొదల వుతుంది. అందువల్ల ‘హమ్మయ్య జ్వరం తగ్గింది’ అని అనుకోకుండా అప్పుడే అప్రమత్తంగా ఉండాలి.

ఒంటిపై రక్తపు దద్దుర్లు వస్తే చికిత్సకు ఆలస్యం చేయొద్దు

ప్లేట్‌లెట్ల సంఖ్య అంత ముఖ్యం కాదు

డెంగీ అనగానే అంతా ప్లేట్‌లెట్ల గురించే ఆలోచిస్తుంటారు. నిజానికివి తగ్గటం వల్ల మరణించటం అరుదు. కాబట్టి ప్లేట్‌లెట్ల సంఖ్య అంత ముఖ్యం కాదు. వీటి సంఖ్య 20 వేల కన్నా తగ్గిపోయి, రక్తస్రావ లక్షణాలు కనిపిస్తే ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సి వస్తుంది. అదే 10వేల కన్నా తగ్గితే రక్తస్రావం అయినా, కాకపోయినా ఎక్కించాలి. ప్లేట్‌లెట్లను ఇతర రక్త పదార్థాల మాదిరిగా ఫ్రిజ్‌లో నిల్వ చేయలేం. అందువల్ల దూర ప్రాంతాల నుంచి సరఫరా చేసి, ఎక్కించే క్రమంలో కొన్నిసార్లు బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు తలెత్తొచ్చు. కొందరికి రక్తంలోకి ఇన్‌ఫెక్షన్‌ విస్తరించి, ప్రాణాపాయమూ సంభవించొచ్చు. కాబట్టి అనవసరంగా ప్లేట్‌లెట్లు ఎక్కించొద్దని గుర్తించాలి. ఇవి 40 వేలకు, 30 వేలకు పడిపోయాయని గాబరా పడొద్దు. భయపడొద్దు. ప్లేట్‌లెట్లు తగ్గుతున్నప్పుడు మన శరీరంలో ఎముక మజ్జ వాటిని నిరంతరం తయారు చేస్తూనే ఉంటుంది. 10వేల సంఖ్య అలాగే కొనసాగుతూ వస్తుంది. శరీరానికివి సరిపోతాయి. పైగా కొత్త ప్లేట్‌లెట్లు పెద్దగా ఉంటాయి. సమర్థంగా పనిచేస్తాయి. రక్తస్రావమయ్యే అవకాశం తక్కువ.

  •  ప్లేట్‌లెట్లు పెరగటానికి కొందరు బొప్పాయి ఆకుల రసం తాగిస్తుంటారు. ఇదేమంత మంచి పద్ధతి కాదు. ఇది దుష్ప్రభావాలకు దారితీయొచ్చు. కొందరు అదేపనిగా పండ్లు, పండ్ల రసాలు తాగిస్తుంటారు. ఇదీ తగదు. అతిగా పండ్ల రసాలు తాగితే ఒంట్లో పొటాషియం మోతాదు ఎక్కువై గుండెలయ అస్తవ్యస్తం కావటం వంటి ఇతరత్రా సమస్యలు తలెత్తే ప్రమాదముంది. డెంగీకి ప్రత్యేకమైన ఆహారమేదీ అవసరం లేదు. వీలైనంతవరకు ద్రవాహారం తీసుకుంటే చాలు.

అసలు ప్రమాదమిదే

డెంగీలో చాలావరకు ప్రమాదం ప్లాస్మా ద్రవం బయటకు వచ్చి రక్తం చిక్కబడటంతోనే సంభవిస్తుంది. డెంగీతో పుట్టుకొచ్చిన విషతుల్యాలు రక్తనాళాలను దెబ్బతీసి, వాటిల్లోంచి ప్లాస్మా ద్రవం లీకయ్యేలా చేస్తాయి. దీంతో రక్తంలో ద్రవం మోతాదు తగ్గుతుంది. ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్ల వంటి ఘన పదార్థాల (హిమటోక్రిట్‌/ప్యాక్డ్‌ సెల్‌ వాల్యూమ్‌) మోతాదులు పెరిగి రక్తం చిక్కబడుతుంది. హిమటోక్రిట్‌ పరిమాణం పెరిగితే రక్తపోటు పడిపోయి, డెంగీ షాక్‌ సిండ్రోమ్‌ తలెత్తొచ్చు. ప్రాణాపాయం సంభవించొచ్చు. కొన్నిసార్లు మెదడు, ఊపిరితిత్తులు, కాలేయం, గుండె వంటి కీలక అవయవాలు దెబ్బతినొచ్చు. సాధారణంగా ఈ రక్తం చిక్కబడే స్థితి రెండు రోజుల వరకు ఉంటుంది. తర్వాత దానంతటదే కుదురుకుంటుంది. అయితే పరిస్థితి విషమిస్తున్నట్టు అనిపిస్తే వెంటనే రక్తనాళం ద్వారా సెలైన్‌ ద్రావణాన్ని ఎక్కించాల్సి ఉంటుంది. దీంతో సమస్య తీవ్రం కాకుండా, ప్రాణాపాయం సంభవించకుండా కాపాడుకోవచ్చు.


మలేరియా నిర్ధరణ అయితేనే మందులు

మలేరియా జ్వరానికి మూలం ‘ప్లాస్మోడియం’ పరాన్నజీవి. దీనిలో ఫాల్సిఫారమ్‌, వైవాక్స్‌, ఒవేల్‌, మలేరియే అని నాలుగు రకాలున్నాయి. ఇవి ఆడ ఎనాఫిలెస్‌ దోమల ద్వారా వ్యాపిస్తాయి. ప్రస్తుతం ఫాల్సిఫారమ్‌తో వచ్చే జ్వరాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. విపరీతమైన చలి, వణుకుతో తీవ్రమైన జ్వరం ముంచుకురావటం దీని ప్రధాన లక్షణం. కొందరికి తలనొప్పి, ఒళ్లునొప్పులు, వాంతులూ ఉండొచ్చు. చిన్నపిల్లల్లో కొందరికి నీళ్ల విరేచనాలు కావొచ్చు. మలేరియా ముదురుతున్నకొద్దీ రక్తహీనత, కామెర్ల వంటి సమస్యలూ వేధించొచ్చు. ఎర్ర రక్తకణాలు విచ్ఛిన్నం కావటం వల్ల హిమోగ్లోబిన్‌ కిడ్నీల ద్వారా బయటకు రావొచ్చు. దీంతో మూత్రం నల్లగా రావొచ్చు.


చికిత్స సరిగా..

ఒకప్పుడు చలిజ్వరం అనగానే మలేరియా మందులు ఇచ్చేవారు. ఇది మంచిది కాదు. ఇప్పుడు మలేరియాను వెంటనే నిర్ధరించే పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి మలేరియా నిర్ధరణ అయితేనే చికిత్స చేయాలి. మందులను సరైన మోతాదులో, తగినన్ని రోజులు వాడుకోవాలి. లేకపోతే పరాన్నజీవులు మొండిగా తయారవుతాయి. ఇప్పటికే ఇలాంటి పరిస్థితిని గమనిస్తున్నాం. మలేరియాకు ఆర్టీమినిసిన్‌ మందు బాగా పనిచేస్తుంది. లూమిఫాంటిన్‌, మెఫ్లోక్విన్‌, సల్ఫాడాక్సిన్‌/పైరిమెథమైన్‌ వంటి మందులూ అవసరమవుతాయి. వైవాక్స్‌ రకంతో వచ్చే మలేరియా మళ్లీ తిరగబెట్టకుండా రెండు వారాల పాటు ప్రైమాక్విన్‌ మందునూ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే దీని వాడకంలో కాస్త జాగ్రత్త అవసరం.


జలుబు ఎప్పుడూ కొత్తే

ఇది రైనోవైరస్‌ తరగతి వైరస్‌లతో వస్తుంది. ఈ వైరస్‌లు ఎప్పటికప్పుడు రూపం మార్చు కుంటుంటాయి. కొత్తవీ పుట్టుకొస్తుంటాయి. కాబట్టి రోగనిరోధక వ్యవస్థకివి ఎప్పుడూ కొత్తే. తరచూ జలుబు వస్తుండటానికి ఇదీ ఒక కారణమే. ఇందులో ముక్కు కారటం, ముక్కు బిగుసుకుపోవటం, గొంతునొప్పి, తుమ్ములు, దగ్గు, కళ్ల వెంట నీరు రావటం, ఒళ్లునొప్పులు, అలసట, బడలిక, కొద్దిగా జ్వరం వంటివి బాగా వేధిస్తాయి. జలుబు సాధారణంగా వారం వరకు ఉంటుంది. చాలావరకు దానంతటదే తగ్గిపోతుంది. తగినంత నీరు తాగటం, పోషకాహారం తినటం మంచిది. లక్షణాలు మరీ ఎక్కువగా వేధిస్తుంటే యాంటీహిస్టమిన్‌, దగ్గు మందులు వాడుకోవచ్చు. జ్వరం తగ్గటానికి పారాసిటమాల్‌ మాత్రలు వేసుకోవచ్చు.


ఫ్లూ కొందరికి తీవ్రం

దీనికి మూలం ఫ్లూ వైరస్‌లు. ఇవి ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల మీద దాడి చేసి ఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తాయి. ఇది చాలావరకు దానంతటదే తగ్గుతుంది. కానీ పిల్లలకు, వృద్ధులకు, గర్భిణులకు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉండేవారికి.. ఆస్థమా, గుండెజబ్బు, కిడ్నీజబ్బు, కాలేయ జబ్బు, మధుమేహం వంటి దీర్ఘకాలిక జబ్బులు గలవారికి తీవ్రంగా పరిణమిస్తుంది. ఇందులో జ్వరం 101 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉంటుంది. ఒళ్లునొప్పులూ ఎక్కువే. వీటిని బట్టే ఫ్లూనా? జలుబా? అనేది గుర్తించొచ్చు. తలనొప్పి, గొంతునొప్పి కూడా ఉండొచ్చు. పొడి దగ్గు, శ్వాస సరిగా తీసుకోలేకపోవటం, అలసట, నీరసం, ముక్కు కారటం, ముక్కు దిబ్బడ, కంటి నొప్పి వంటివి వేధిస్తాయి. జ్వరం, ఒళ్లు నొప్పుల వంటివి మూడు, నాలుగు రోజుల్లో వాటంతటవే తగ్గుతాయి. అందువల్ల మొదట్లో పెద్దగా చికిత్సల అవసరమేమీ ఉండదు. ద్రవాలు ఎక్కువగా తాగటం, విశ్రాంతి తీసుకోవటం మంచిది. అవసరమైతే జ్వరం తగ్గటానికి పారాసిటమాల్‌ వేసుకోవచ్చు. మూడు రోజులైనా ఇబ్బందులు విడవకుండా వేధిస్తుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. యాంటీఫ్లూ మందులతో చాలావరకు నయమవుతుంది. కొందరిలో పై శ్వాసకోశకు పరిమితమైన సమస్య కిందికీ విస్తరించి వైరల్‌ న్యుమోనియాగా మారొచ్చు. శ్వాస తీసుకోవటం కష్టమవుతున్నా, దగ్గు, ఆయాసం వేధిస్తున్నా, జ్వరం తగ్గకుండా కొనసాగుతూ వస్తున్నా, కళ్లెతో పాటు రక్తం పడుతున్నా నిర్లక్ష్యం చేయొద్దు.


ఏం చేయాలి? ఏం చేయొద్దు?

  •  జ్వరంతో పాటు ఒళ్లునొప్పులు ఉన్నప్పుడు కొందరు ఐబూప్రొఫెన్‌, డైక్లోఫెనాక్‌ వంటి ఎన్‌ఎస్‌ఏఐడీ రకం నొప్పి మందులు వేసుకుంటుంటారు. ఇది ప్రమాదకరం. వైరల్‌ జ్వరాల్లో రక్తంతో ముడిపడిన దుష్ప్రభావాలు ఎక్కువగా వచ్చే అవకాశముంది. కాబట్టి నొప్పి మాత్రలు వేసుకోవటం తగదు.
  •  జలుబు, దగ్గు మొదలవగానే సొంతంగా యాంటీబయాటిక్‌ మందులు కొనుక్కొని వేసుకోవటం పెద్ద పొరపాటు. జలుబు, ఫ్లూ వైరల్‌ జబ్బులు. వీటికి యాంటీబయాటిక్‌ మందులు పనిచేయవు. అనవసరంగా వీటిని వేసుకుంటే పేగుల్లో మంచి బ్యాక్టీరియా చనిపోతుంది. దీంతో రోగనిరోధకశక్తి దెబ్బతింటుంది. విచ్చలవిడిగా యాంటీబయాటిక్‌ మందులు వాడితే బ్యాక్టీరియా వాటిని తట్టుకునే శక్తిని సంతరించుకుంటుంది. నిజంగా బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ వచ్చినప్పుడు ఈ మందులు సరిగా పనిచేయవు. శక్తిమంతమైన యాంటీబయాటిక్‌ మందులు వాడాల్సిన పరిస్థితి వస్తుంది. కొందరు మొండి బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లతో మరణిస్తుండటం గమనార్హం. అందువల్ల బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ ఉంటేనే యాంటీబయాటిక్‌ మందులు వాడుకోవాలి. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ తగ్గే క్రమంలో కొందరికి బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ (సెకండరీ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌) తలెత్తొచ్చు. ఇది న్యుమోనియా, సైనసైటిస్‌కు దారితీయొచ్చు. ఇలాంటివారిలో కఫం ఆకుపచ్చ లేదా పసుపు రంగులోకి మారొచ్చు. కొందరికి కఫంలో రక్తం కూడా పడొచ్చు. ఇలాంటి సమయంలోనే యాంటీబయాటిక్‌ మందులు అవసరమవుతాయి. వీటిని డాక్టర్‌ సలహా మేరకు.. సరైన మోతాదులో, తగినన్ని రోజులు వాడుకోవాలి.
  •  మనదేశంలో ఫ్లూ టీకా వేసుకోవటం తక్కువ. దీంతో ఫ్లూ సులభంగా వ్యాపించే అవకాశముంది. దీని లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ సలహా మేరకు యాంటీ ఫ్లూ మందులు వేసుకోవాలి.
  •  ఆస్థమా వంటి దీర్ఘకాల శ్వాసకోశ సమస్యలు వైరల్‌ ఇన్‌ఫెక్షన్లతో మరింత ఉద్ధృతమవ్వచ్చు. కాబట్టి ఇలాంటి సమస్యలు గలవారు డాక్టర్‌ను సంప్రదించి మందుల మోతాదు సవరించుకోవాలి. ఆస్థమా, అలర్జీ గలవారు ఉన్నట్టుండి చల్లటి వాతావరణంలో బయటికి వెళ్లొద్దు.
  •  పెద్దవారు, మధుమేహం వంటి దీర్ఘకాల సమస్యలు గలవారు బయటికి వెళ్లినప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు, జనం గుమిగూడే చోట్ల మాస్కు ధరించాలి. జలుబు, దగ్గు, తుమ్ములు గలవారంతా వయసుతో నిమిత్తం లేకుండా ఇంట్లోనూ, బయటా మాస్కు ధరించాలి. ఇలా జబ్బులు వ్యాపించకుండా అడ్డుకోవచ్చు. తరచూ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. ఇతరులకు కాస్త దూరంగా మెలగాలి.  
  •  దోమకాటు బారినపడకుండా కాపాడుకోవాలి. మలేరియా పరాన్నజీవిని మోసుకొచ్చే ఎనాఫిలస్‌ దోమలు మురికినీటిలో పెరుగుతాయి. డెంగీని తెచ్చిపెట్టే ఈడిస్‌ ఈజిప్టై దోమలు మంచి నీటిలో వృద్ధి చెందుతాయి. ఇవి ఇంట్లోనే ఎక్కువగా ఉంటాయి. అంటే డెంగీ శత్రువులు ఇంట్లోనే ఎక్కువన్నమాట. కాబట్టి ఇల్లు, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. నీరు నిల్వ చేసుకునే పాత్రలు, నీళ్ల ట్యాంకుల మీద విధిగా మూత పెట్టుకోవాలి. ఇంటి పరిసరాల్లో పాత టైర్లు, కొబ్బరి చిప్పల వంటివేమీ ఉండనీయొద్దు. ఈడిస్‌ దోమలు మరీ ఎక్కువ దూరం వెళ్లలేవు. అందువల్ల కాలనీల్లో ఎక్కడికక్కడ శుభ్రత పాటిస్తే దోమల వృద్ధిని, వ్యాప్తిని అక్కడి కక్కడే కట్టడి చేయొచ్చు. డెంగీ వైరస్‌ను మోసుకొచ్చే దోమలు పగటిపూట ఎక్కువగా కుడతాయి కాబట్టి బడికి వెళ్లే పిల్లలు పొడుగు చేతుల చొక్కాలు, ప్యాంట్లు, సాక్సు ధరించాలి. అవసరమైతే దోమలను తరిమే లేపనాలు చేతులు, కాళ్లకు రాసుకోవచ్చు. పడుకునేటప్పుడు మంచానికి దోమతెరలు కట్టుకోవాలి.

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు