క్యాన్సర్‌ మందుతో హెచ్‌ఐవీ నయం!

ఎయిడ్స్‌కు దారితీసే హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్‌ను నయం చేయటం ఇంకెంతో దూరంలో లేదా? అదీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందుతోనే నయమవుతుందా?

Published : 26 Sep 2023 01:14 IST

యిడ్స్‌కు దారితీసే హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్‌ను నయం చేయటం ఇంకెంతో దూరంలో లేదా? అదీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందుతోనే నయమవుతుందా? ఆస్ట్రేలియాలోని వాల్టర్‌ అండ్‌ ఎలీజా హాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (డబ్ల్యూఈహెచ్‌ఐ), డోహర్టీ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకుల అధ్యయన ఫలితాలు ఇది సాధ్యమేనని చెబుతున్నాయి. రక్తక్యాన్సర్‌ చికిత్సకు వాడే వెనెటోక్లాక్స్‌ అనే మందు ‘అదృశ్య’ హెచ్‌ఐవీ కణాలను సమర్థంగా చంపుతున్నట్టు, ఇన్‌ఫెక్షన్‌ తిరగబెట్టటాన్ని ఆలస్యం చేస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు మరి. హెచ్‌ఐవీ ప్రధానంగా రోగనిరోధక కణాల మీద దాడి చేస్తుంది. వీటితో దూషితమైన కొన్ని కణాలు ఒంట్లో నిద్రాణంగా ఉండిపోతుంటాయి. యాంటీరెట్రోవియల్‌ చికిత్సతో రక్తంలోని హెచ్‌ఐవీ గుర్తించలేనంత స్థాయికి పడిపోయినప్పటికీ ఈ కణాలు అలాగే ఉండిపోతుంటాయి. చికిత్స ఆపేయగానే పుంజుకుంటాయి. ఇన్‌ఫెక్షన్‌ తిరగబెట్టేలా చేస్తాయి. ఒకరకంగా హెచ్‌ఐవీ శాశ్వతంగా శరీరంలో ఉండటానికి కారణం ఇవేనని చెప్పుకోవచ్చు. అందుకే జీవితాంతం మందులు వేసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 4 కోట్ల మంది హెచ్‌ఐవీ బాధితులు ఉన్నారని అంచనా. వీరికి హెచ్‌ఐవీని అణచిపెట్టే యాంటీరెట్రోవియల్‌ చికిత్స ఇస్తుంటారు. ఇది సమర్థంగా పనిచేస్తుంది. కానీ శరీరంలో దాక్కునే హెచ్‌ఐవీ దూషిత కణాలను ఏమీ చేయలేదు. వీటిని కట్టడి చేయటంలో వెనెటోక్లాక్స్‌ మందు సమర్థంగా పనిచేస్తున్నట్టు తేలటం కొత్త ఆశలు రేపుతోంది. దీని ఆధారంగా డెన్మార్క్‌, ఆస్ట్రేలియాలో ప్రయోగ పరీక్షలు నిర్వహించటానికి సన్నాహాలు చేస్తున్నారు.  హెచ్‌ఐవీని నయం చేసే దిశగా ఇది గొప్ప ముందడుగు కాగలదని భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని