అధిక రక్తపోటుకు కొత్తమందు

అధిక రక్తపోటును తగ్గించే కొత్త మందును శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు. దీని పేరు లోరుండ్రోస్టాట్‌. ఇది ఆల్డోస్టిరాన్‌ ఉత్పత్తిని తగ్గించటం ద్వారా రక్తపోటును అదుపులో పెడుతుంది.

Updated : 17 Oct 2023 08:52 IST

అధిక రక్తపోటును తగ్గించే కొత్త మందును శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు. దీని పేరు లోరుండ్రోస్టాట్‌. ఇది ఆల్డోస్టిరాన్‌ ఉత్పత్తిని తగ్గించటం ద్వారా రక్తపోటును అదుపులో పెడుతుంది. ఈ కొత్త మందు సురక్షితంగా, సమర్థంగా పనిచేస్తున్నట్టు ప్రయోగ పరీక్షల్లో బయటపడింది. అధిక రక్తపోటు నియంత్రణలోకి రానివారికి, చికిత్స కష్టమైనవారికిది ఉపయోగపడగలదని భావిస్తున్నారు. ఊబకాయులు, జీవక్రియ రుగ్మత గలవారు, నిద్రలో కాసేపు శ్వాస ఆగిపోయేవారిలో ఆల్డోస్టిరాన్‌ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది రక్తపోటు పెరిగేలా చేస్తుంది. వీరిలో అధిక రక్తపోటు తగ్గటానికి సాధారణంగా మూత్రం ఎక్కువగా వచ్చేలా చేసే థియాజైడ్‌, క్యాల్షియం ఛానెల్‌ బ్లాకర్‌, యాంజియోటెన్సిన్‌-కన్వర్టింగ్‌ ఎంజైమ్‌ ఇన్‌హిబిటార్‌ లేదా యాంజియోటెన్సిన్‌ రిసెప్టర్‌ బ్లాకర్‌.. ఇలా మూడు మందులతో చికిత్స చేస్తుంటారు. వీటితో రక్తపోటు అదుపులోకి రాకపోతే మినరల్‌ కార్టికాయిడ్‌ రిసెప్టర్‌ యాంటొగోనిస్ట్‌ మందునూ జతచేస్తారు. ఇది కణాల్లోని ఆల్డోస్టిరాన్‌ గ్రాహకాలకు అంటుకొని, రక్తపోటు తగ్గేలా చేస్తుంది. కానీ కొన్ని దుష్ప్రభావాలు తలెత్తుతాయి. పైగా గ్రాహకాలకు అంటుకోవటం వల్ల రక్తంలో ఆల్డోస్టిరాన్‌ మోతాదులూ పెరుగుతాయి. ఈ నేపథ్యంలో ఊబకాయుల వంటివారికి రక్తపోటు నియంత్రణలో కొత్త మందు ఆశలు కల్పిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని