మడమ ఎత్తి నడుస్తోందేం?

మా పాపకు 15 నెలలు. సహజ కాన్పు ద్వారా పుట్టింది. చనుబాలు 4 నెలలు మాత్రమే తాగింది. పాప ఇప్పుడిప్పుడే నడుస్తోంది. అయితే ఎత్తు కాళ్ల మీద నడుస్తోంది. మిగతా అన్ని విషయాల్లో చురుగ్గా ఉంటుంది. ఇటీవల ఆసుపత్రికి తీసుకెళ్తే స్కానింగ్‌ చేశారు. అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి,

Updated : 02 Aug 2022 11:06 IST

సమస్యసలహా

సమస్య: మా పాపకు 15 నెలలు. సహజ కాన్పు ద్వారా పుట్టింది. చనుబాలు 4 నెలలు మాత్రమే తాగింది. పాప ఇప్పుడిప్పుడే నడుస్తోంది. అయితే ఎత్తు కాళ్ల మీద నడుస్తోంది. మిగతా అన్ని విషయాల్లో చురుగ్గా ఉంటుంది. ఇటీవల ఆసుపత్రికి తీసుకెళ్తే స్కానింగ్‌ చేశారు. అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి, ఏమీ కాదు, నడుస్తుందని చెప్పారు. ఇంట్లో పెద్దవాళ్లేమో తల్లిపాలు తాగనందుకు నడుములో బలం లేదు, అందుకే ఇలా నడుస్తోందని అంటున్నారు. పెరుగుతున్నకొద్దీ పాప మామూలుగా నడుస్తుందా? లేదా? ఇలాగే కొనసాగితే ఏం చేయాలో చెప్పండి?

- జ్యోత్స్న

సలహా: బుడిబుడి అడుగులేసే సమయంలో నడక కాస్త తేడాగా కనిపించటం సహజమే. ఎందుకంటే శరీరం బరువు అప్పుడప్పుడే కాళ్ల మీద పడటం మొదలవుతుంటుంది. దీంతో బరువును సమన్వయం చేసుకోవటానికి పిల్లలు వివిధ భంగిమల్లో నడుస్తుంటారు. కొందరు కాళ్లు వంచి నడవచ్చు. కొందరు మడమలను ఎత్తి నడవచ్చు. ఇవన్నీ మామూలే. వయసు పెరుగుతున్నకొద్దీ వాటంతటవే సరి అవుతాయి. సాధారణంగా ఐదేళ్లు వచ్చేసరికి మామూలుగా నడిచేస్తారు. ఎత్తు కాళ్ల మీద నడవటానికీ చనుబాలకూ సంబంధమేమీ లేదు. చనుబాలు ఎక్కువకాలం తాగిన పిల్లలైనా కూడా తొలిసారి కాళ్ల మీద శరీరం బరువును మోపే సమయంలో పాదాలు అటూఇటూ వేస్తుంటారు. దీనికి భయపడాల్సిన పనేమీ లేదు. కాకపోతే అదనంగా విటమిన్‌ డి ఇవ్వాల్సి ఉంటుంది. పూర్తిగా నెలలు నిండి, మామూలు బరువుతో (3 కిలోలు) పాప పుట్టినట్టయితే రోజుకు 400 ఐయూ మోతాదు వరకు విటమిన్‌ డి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ నెలలు నిండకముందే, తక్కువ బరువుతో పుట్టినట్టయితే రోజుకు 600-800 ఐయూ మోతాదు అవసరమవుతుంది. నెలలు నిండకముందే పుడితే క్యాల్షియం, ఫాస్ఫరస్‌ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎముకలు బలంగా ఉండటానికి ఈ మూడూ కావాలి. ఒకవేళ పాప నిల్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు మోకాళ్లు మరీ దూరంగా గానీ దగ్గరకు గానీ ఉంటున్నా (యాంగ్యులేషన్‌).. ఒక కాలే బలహీనంగా ఉన్నా, పాదాలు ఈడుస్తూ నడుస్తున్నా, పాదంలో వాపు వస్తున్నా నిర్లక్ష్యం చేయొద్దు. ఇవి కండరాలను క్షీణింపజేసే సమస్యలకు సంకేతాలు కావొచ్చు.

డా।। ఎ. నరేంద్రకుమార్‌, పీడియాట్రిక్‌ సర్జన్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు