మూర్ఛకు యోగా సాంత్వన

మూర్ఛతో బాధపడేవారికి యోగా మేలు చేస్తున్నట్టు ఎయిమ్స్‌ అధ్యయనంలో బయటపడింది. ఇది తరచూ మూర్ఛ రావటాన్నే కాదు.. ఆందోళన, అపరాధ భావాన్నీ తగ్గిస్తున్నట్టు వెల్లడైంది

Updated : 21 Nov 2023 03:38 IST

మూర్ఛతో బాధపడేవారికి యోగా మేలు చేస్తున్నట్టు ఎయిమ్స్‌ అధ్యయనంలో బయటపడింది. ఇది తరచూ మూర్ఛ రావటాన్నే కాదు.. ఆందోళన, అపరాధ భావాన్నీ తగ్గిస్తున్నట్టు వెల్లడైంది. సగటున వారానికి ఒకసారి మూర్ఛ వస్తూ.. కనీసం రెండు రకాల మూర్ఛ మందులు వాడేవారిని, అపరాధ భావంతో కుమిలిపోయేవారిని ఎంచుకొని ఈ అధ్యయనం నిర్వహించారు. వీరికి కండరాలను వదులుగా చేసే ఆసనాలు, శ్వాస మీద ధ్యాస, ధ్యానం, సానుకూల దృక్పథంతో ఆలోచించటం వంటి వాటితో కూడిన యోగా పద్ధతులను నేర్పించారు. ఆరు నెలల తర్వాత వీరిలో మూర్ఛల సంఖ్య 50 శాతానికి పైగా తగ్గింది. ఆందోళన కూడా బాగా తగ్గింది. ఎక్కువసార్లు యోగా చేసేవారికి మరింత ప్రయోజనమూ కనిపించింది. అపరాధ భావన జీవితాన్ని రకరకాలుగా ప్రభావితం చేస్తుంది. మందులు సరిగా వేసుకోకపోవటం, జబ్బు అదుపులో లేకపోవటం వల్ల తరచూ అత్యవసర చికిత్స కోసం రావటం, మానసిక ఆరోగ్యం దెబ్బతినటం వంటివి కనిపిస్తుంటాయి. అపరాధన భావన తగ్గితే జీవితాన్ని హాయిగా ఆస్వాదించటానికి వీలవుతుంది. ఇందుకు యోగా ఉపయోగపడుతుండటం విశేషం. అపరాధ భావన గల మూర్ఛ బాధితులకు ప్రత్యామ్నాయ చికిత్సల అవసరముందని అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని