నేర్చుకుంటూ.. నేర్పిస్తూ..!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ‘ఎనిమిదేళ్ల వయసు పిల్లలు ఏం చేస్తారు?’..  అల్లరి పనులతో మారాం చేస్తూ.. అతికష్టమ్మీద బడికి వెళ్లివస్తుంటారు. కొందరు సంగీతమో, డ్యాన్సో, ఆత్మరక్షణ విద్యలో నేర్చుకుంటుంటారు.

Published : 10 Jan 2023 00:12 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ‘ఎనిమిదేళ్ల వయసు పిల్లలు ఏం చేస్తారు?’..  అల్లరి పనులతో మారాం చేస్తూ.. అతికష్టమ్మీద బడికి వెళ్లివస్తుంటారు. కొందరు సంగీతమో, డ్యాన్సో, ఆత్మరక్షణ విద్యలో నేర్చుకుంటుంటారు. ఓ చిన్నారి మాత్రం వాటికి భిన్నంగా యోగా సాధన చేస్తోంది. రికార్డులు సాధిస్తూ.. అందరితో శెభాష్‌ అనిపించుకుంటోంది. ఆ వివరాలే ఇవీ..

ర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన నిఖితకు ప్రస్తుతం ఎనిమిది సంవత్సరాలు. కఠినమైన యోగాసనాలను సైతం అలవోకగా సాధన చేస్తూ.. తన వయసు పిల్లలందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల నగరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ‘యోగరత్న’ అవార్డును సైతం అందుకుంది.

మూడేళ్ల నుంచే సాధన

నిఖిత వాళ్ల అమ్మానాన్నలు రోజూ ఉదయాన్నే యోగా సాధన చేసేవారు. చిన్నప్పటి నుంచి వారిని చూస్తూ పెరిగిన తను కూడా మూడేళ్ల వయసు నుంచే యోగా సాధన చేయడం ప్రారంభించింది. రోజూ తెల్లవారుజామునే మూడు గంటలకు నిద్రలేస్తుందట. గంటసేపు ధ్యానం చేశాక, తర్వాత రెండు గంటలపాటు యోగాసనాల సాధనలో నిమగ్నమవుతుంది. తండ్రి సహాయంతో అత్యంత కష్టమైన ఆసనాలను కూడా సునాయాసంగా నేర్చేసుకుంది. అలా ప్రస్తుతం దాదాపు 1000 ఆసనాలను ఈ నేస్తం వేయగలదట. ‘నౌళి క్రియ’ అనే ప్రక్రియలో తనకు బాగా పట్టుందని చెబుతోంది నిఖిత. 2020లో ‘ద్వి మధ్యమ నౌళి’ని ప్రదర్శించిన అత్యంత పిన్న వయస్కురాలిగా ‘నోబెల్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో తన పేరు నమోదు చేసుకుంది.  

తరగతులూ చెబుతోంది..

కరోనా రెండో దశ వ్యాప్తి సమయంలో ఆన్‌లైన్‌లో ఉచితంగా యోగా తరగతులు నిర్వహించిందీ చిన్నారి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయుష్‌ శాఖ నిఖితను అధికారిక శిక్షకురాలిగానూ ధ్రువీకరించింది. పెద్దవాళ్లు చెప్పడం కంటే తమ వయసు వాళ్లు చేసేది చూడటం వల్ల పిల్లలు త్వరగా నేర్చుకుంటారనే ఉద్దేశంతో.. లాక్‌డౌన్‌ తర్వాత కూడా చిన్నారులకు యోగా తరగతులు నిర్వహిస్తోంది. డబ్బులు చెల్లించి క్లాసులకు వెళ్లలని పేద పిల్లలకు యోగాను పరిచయం చేసే దిశగా సాగుతుందీ నేస్తం. అలాగని చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయడం లేదు. తరగతులకు, పరీక్షలకు ఇబ్బంది కాకుండానే.. తన దినచర్యను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తోంది. భవిష్యత్తులో ఐఏఎస్‌ అవుతానని, అప్పటికీ యోగా సాధన మాత్రం ఆపేది లేదని తన లక్ష్యాన్ని పంచుకుంటోంది నిఖిత. ఇంత చిన్న వయసులోనే యోగాలో ఎంత ప్రతిభ చూపుతుందో కదూ.!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని