Published : 28 Aug 2022 00:23 IST

సాహసమే శ్వాసగా...!

పర్వతమేదైనా ఫర్వాలేదు... అదరక బెదరక ఎక్కేస్తాడు... ఎంచక్కా... నింగికి నిచ్చెన వేసేస్తాడు... చకచకా రికార్డులు సాధిస్తాడు.. తోటివారిలో స్ఫూర్తి నింపుతాడు... సాహసమే శ్వాసగా సాగిపోతాడు... ధైర్యమే ఊపిరిగా దూసుకుపోతాడు... మరి ఆ చిరుత గురించి తెలుసుకుందామా!!

హైదరాబాద్‌ బాలానగర్‌కు చెందిన కార్తికేయ వయసు కేవలం పదమూడేళ్లు. చదివేది తొమ్మిదో తరగతి. ఇంత చిన్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యున్నత పర్వతాలను అధిరోహిస్తానని సవాల్‌ విసురుతున్నాడు. ఈ ఏడాదిలోనే పర్వతారోహణ ప్రారంభించిన కార్తికేయ ఇప్పటికే రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు.

ఇటీవల మన స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15న ఐరోపాలోనే అత్యంత ఎత్తైన ఎల్‌బ్రస్‌ పర్వత శిఖరంపై త్రివర్ణపతాకాన్ని ఎగుర వేసి దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటాడు. ట్రెక్కింగ్‌పై ఉన్న ఆసక్తితో 2020లో తన అక్కయ్యతో కలిసి సరదాగా డెహ్రాడూన్‌లో పర్వతారోహణకు వెళ్లాడు. ఈ క్రమంలో ట్రెక్కింగ్‌పై మరింత ఇష్టం ఏర్పడింది.

అమ్మానాన్న చేయూత
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు రాజేంద్రప్రసాద్‌, లక్ష్మి మరింతగా ప్రోత్సహించారు. కార్తికేయను వెంటనే ఉత్తరాఖండ్‌లోని నెహ్రూ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటెనీరింగ్‌ (ఎన్‌ఐఎం) శిక్షణ కేంద్రానికి పంపించారు. అక్కడ బేసిక్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్న కార్తికేయ ఇంటికి వచ్చి భరత్‌ తమ్మినేని, రోమన్‌ భరద్వాల్‌ పర్యవేక్షణలో రెండేళ్లుగా శిక్షణ పొందుతూ మరింత రాటుదేలాడు. మొదటగా 2022 ఏప్రిల్‌లో 5,364 మీటర్ల ఎత్తైన ఎవరెస్టు బేస్‌ క్యాంపునకు చేరుకున్నాడు. అదే నెలలో నేపాల్‌లోని 5,083 మీటర్ల ఎత్తైన మౌంట్‌ నంగ్‌కర్ట్‌శాంగ్‌ను అధిరోహించాడు. మే నెలలో హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులూమనాలీలో 5,289 మీటర్ల ఎత్తున్న ఫ్రెండ్‌షిప్‌ పర్వతాన్ని అధిరోహించాడు.

గడ్డకట్టించే చలిలో..
లద్దాఖ్‌లోని మార్ఖా లోయలో -25 డిగ్రీల గడ్డకట్టే చలిలో ఆరువేల మీటర్లకు పైగా ఎత్తున్న రెండు పర్వతాలను అధిరోహించి ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. జులై 11న తొలుత 6,270 మీటర్ల ఎత్తులోని కాంగ్‌యాట్సే యాత్ర ప్రారంభించాడు. ఏడు రోజుల తరువాత జులై 18న శిఖరాగ్రానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి క్రాంపాస్‌ బేస్‌ పాయింట్‌ మీదుగా 6,240 మీటర్ల ఎత్తులోని ద్జోజోంగో పర్వతాన్ని జులై 20న అధిరోహించాడు. అత్యంత పిన్న వయసులో ఈ రెండు పర్వతాలను అధిరోహించడంతో ‘ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘ఏషియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం దక్కించుకున్నాడు.

24 గంటల వ్యవధిలోనే రెండు శిఖరాలు
ఐరోపాలోనే అత్యంత ఎత్తైన ఎల్‌బ్రస్‌ పర్వతం తూర్పు, పడమర శిఖరాలను 24 గంటల వ్యవధిలో అధిరోహించాడు. ఎల్‌బ్రస్‌ పర్వతం తూర్పు శిఖరం 5,621 మీటర్లు, పశ్చిమ శిఖరం 5,642 మీటర్ల ఎత్తు ఉంటాయి. ఆగస్టు 8న రష్యాకు వెళ్లిన కార్తికేయ 15న ఉదయం పర్వత పడమర శిఖరాగ్రానికి చేరుకున్నాడు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశాడు. అదే రోజు అక్కడి నుంచి ప్రారంభమై.. 16న తెల్లవారుజామున తూర్పు శిఖరం చేరుకున్నాడు. 24 గంటల వ్యవధిలోనే ఈ రెండు శిఖరాలను అధిరోహించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచి కార్తికేయ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ట్రెక్కింగ్‌పై శిక్షణ తీసుకుంటూనే మరోవైపు చదువుల్లోనూ రాణిస్తున్నాడు. భవిష్యత్తులో ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరాలను అధిరోహిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మరి మనం కార్తికేయకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా!

- చిప్ప సాయికిరణ్‌, హైదరాబాద్‌ సిటీ డెస్క్‌, ఈనాడు డిజిటల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని