తన దారి వేరు.. అవార్డులు షురూ..!

నైనిషా మల్లా.. చిన్నప్పటి నుంచి చదువుతోపాటు ఇతర విషయాల్లోనూ చురుకే. పాఠశాలలో ఏ కార్యక్రమం జరిగినా.. కచ్చితంగా తన ప్రదర్శన ఉండాల్సిందే. ఆ ప్రతిభ, చొరవతోపాటు తల్లిదండ్రుల ప్రోత్సాహమూ తోడవడంతో ఇటీవల ‘జూనియర్‌ మిస్‌ ఇండియా’ పోటీల్లోనూ పాల్గొంది.

Updated : 11 Jun 2023 06:57 IST

నైనిషా మల్లా.. చిన్నప్పటి నుంచి చదువుతోపాటు ఇతర విషయాల్లోనూ చురుకే. పాఠశాలలో ఏ కార్యక్రమం జరిగినా.. కచ్చితంగా తన ప్రదర్శన ఉండాల్సిందే. ఆ ప్రతిభ, చొరవతోపాటు తల్లిదండ్రుల ప్రోత్సాహమూ తోడవడంతో ఇటీవల ‘జూనియర్‌ మిస్‌ ఇండియా’ పోటీల్లోనూ పాల్గొంది. ‘బెస్ట్‌ పర్సనాలిటీ’ అవార్డునూ గెలుచుకుంది. ఇదంతా తనకెలా సాధ్యమైందో మీతో పంచుకోవాలని ఇలా మన ‘హాయ్‌ బుజ్జీ’ పేజీలోకి వచ్చింది. చక్కగా వినేయండి, అదే.. చదివేయండి మరి..!  

మాది శ్రీకాకుళం జిల్లాలోని పలాస-కాశీబుగ్గ. నాన్న శరత్‌ బాబు. ఆయన వ్యాపారి. తల్లి రూపా సంతోషి.. గృహిణి. నేను ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నా. నలుగురిలో ఒకరిగా కాకుండా నాకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలనుకుంటా. అందుకే చదువుతోపాటు ఇతర రంగాలపైనా దృష్టిసారించా. ఎప్పటికైనా మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొనాలని ఉండేది. అలా సోషల్‌ మీడియాలో నేను పోస్ట్‌ చేసిన ఫొటోలు చూసి ‘మై సిటీ ఈవెంట్స్‌, ఇండియా’ సంస్థ ప్రతినిధులు నన్ను సంప్రదించారు. గతేడాది మంబయిలో జరిగిన ‘జూనియర్‌ మిస్‌ ఇండియా’ పోటీలకు దరఖాస్తు చేయమని సూచించారు. అలా మా నాన్న సహాయంతో దరఖాస్తు చేశా. కొన్ని నెలల తర్వాత.. ఆంధ్రప్రదేశ్‌ తరఫున విశాఖపట్నంలో జరిగిన ఆడిషన్లకు హాజరవమని సమాచారం ఇచ్చారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే.. చాలామంది బాలికలు వచ్చారు. వారిని చూడగానే ‘అసలు నేను వీళ్లతో పోటీపడగలనా?’ అని భయం వేసింది. తర్వాత ధైర్యం తెచ్చుకొని అందరితోపాటు నేనూ ప్రదర్శన ఇచ్చా.

మరో విడతలోనూ..

విశాఖలో జరిగిన పోటీల్లో ఎంపిక కావడంతో హైదరాబాద్‌లో నిర్వహించే మరో విడత ఆడిషన్లకు పిలిచారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 55 మంది పాల్గొన్నారు. వారందరిలో నన్ను షో టాపర్‌గా ప్రకటించి.. జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఆ క్షణం నాకెంతో ఆనందంగా అనిపించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారిని ఓడించడమంటే మాటలు కాదు కదా.. అందుకే కచ్చితంగా జాతీయ స్థాయిలోనూ విజయం సాధించాలని ఆన్‌లైన్‌లో వీడియోలు చూస్తూ ప్రాక్టీస్‌ చేయడం ప్రారంభించా. క్యాట్‌ వాక్‌తోపాటు వర్తమాన అంశాలు, సమాజంపైన కాస్త అవగాహన తెచ్చుకున్నాను. ఓ వైపు ఉత్సాహం, మరోవైపు భయపడుతూనే తల్లిదండ్రులతో కలిసి ముంబయిలో ఇటీవల నిర్వహించిన ‘జూనియర్‌ మిస్‌ ఇండియా’ పోటీలకు వెళ్లాను. తుది పోరుకు మొత్తం 155 మంది హాజరయ్యారు. నాలుగు రౌండ్లలో పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రదర్శన ఇచ్చాను. అందులో నన్ను ‘బెస్ట్‌ పర్సనాలిటీ’ అవార్డు వరించింది.

ప్రతిభను గుర్తిస్తేనే..

భవిష్యత్తులో దేశం తరఫున అందాల కిరీటం అందుకొని, ఫ్యాషన్‌ డిజైనర్‌గా స్థిరపడాలనేది నా లక్ష్యం. పాఠశాలలో నిర్వహించే ‘బాలవికాస్‌’ కార్యక్రమం నాకెంతగానో ఉపయోగపడింది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. దాన్ని గుర్తించి, ఆ దిశగా సాధన చేస్తేనే రాణించగలం. అలాగని చదువును నిర్లక్ష్యం చేయకూడదు. అందరికంటే భిన్నంగా నేను ఈ మోడలింగ్‌ రంగంలో రాణించగలుగుతున్నానంటే, తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణం. నేస్తాలూ.. ఇక ఉంటా మరి.. బై బై!!

 సుమంత్‌ సకలాభక్తుల, ఈటీవీ భారత్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని