చిట్టి చేతులు... గట్టి చేతలు!

పట్టుమని పదేళ్లైనా లేవు. పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన వయసు. అయినా పట్టుబట్టి మరీ రికార్డుల మీద రికార్డులు సాధిస్తోంది. ఎంతో కష్టమైన రూబిక్స్‌ క్యూబ్స్‌ను పరిష్కరిస్తూ సత్తా చాటుతోంది.

Published : 05 Jul 2023 02:46 IST

ట్టుమని పదేళ్లైనా లేవు. పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన వయసు. అయినా పట్టుబట్టి మరీ రికార్డుల మీద రికార్డులు సాధిస్తోంది. ఎంతో కష్టమైన రూబిక్స్‌ క్యూబ్స్‌ను పరిష్కరిస్తూ సత్తా చాటుతోంది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో తెలుసుకుందామా!

గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌కు చెందిన కనికా భగ్తీయాకు కేవలం ఆరేళ్లు. త్రీ బై త్రీ మల్టీ క్యూబ్‌ను పరిష్కరించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సాధించింది. ‘వరల్డ్‌ వైడ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోనూ చోటు దక్కించుకుంది. కనికా ప్రస్తుతానికి 8 రకాల క్యూబ్స్‌ను ఇట్టే పరిష్కరించగలదు.

నాలుగేళ్ల వయసు నుంచే...

తనకు కేవలం నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే కనికా.. రూబిక్స్‌ క్యూబ్స్‌ పరిష్కరిస్తోంది. తనకంటే వయసులో పెద్దవారు, అనుభవజ్ఞులతోనూ పోటీ పడి తన సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు పలు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. ఎనిమిది అంతర్జాతీయ అవార్డులను సైతం గెలుచుకుంది.

కళ్లకు గంతలు.. కాళ్లకు చక్రాలు..

రూబిక్స్‌ క్యూబ్స్‌ను పరిష్కరించడమే ఎంతో కష్టమంటే, ఈ చిన్నారి ఏకంగా కళ్లకు గంతలు కట్టుకొని, స్కేటింగ్‌ చేస్తూ మరీ సాధిస్తోంది. కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో కనికా రూబిక్స్‌ క్యూబ్స్‌ మీద ఆసక్తి చూపించింది. దీంతో అమ్మానాన్న ఈ చిన్నారిని అకాడమీలో చేర్పించి శిక్షణ ఇప్పించారు. కేవలం రెండునెలల్లోనే రూబిక్స్‌ క్యూబ్స్‌ను పరిష్కరించడం నేర్చుకుని కోచ్‌తో సహా అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. స్కేటింగ్‌, మోడలింగ్‌లోనూ పాల్గొంటూ కనికా తన ప్రత్యేకత చాటుకుంటోంది. రాష్ట్ర, జాతీయస్థాయిలో పలు స్కేటింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లలోనూ పాల్గొంది. గోవా, ఆగ్రా, సూరత్‌, బరోడా మొదలైన జాతీయ స్కేటింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లలో పాల్గొని ఈ చిన్నారి సత్తా చాటిందని కోచ్‌ ఎంతో ఆనందంగా చెబుతున్నారు. తనకు బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ స్ఫూర్తి అంటున్న మన కనికా భగ్తీయా భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధించాలని మనమూ మనసారా కోరుకుందాం. తనకు మనమంతా ఆల్‌ ది బెస్ట్‌ చెబుదామా మరి..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు