పిట్ట కొంచెం... గాత్రం ఘనం!

పట్టుమని పదేళ్లైనా లేవు. అయితేనేం సంగీతం మీద భలే పట్టుంది. కేవలం గాత్రంతోనే కాదు, నాట్యంలోనూ మెప్పిస్తోంది. దేశం కాని దేశంలో.. మన దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడేలా చేస్తోంది. ప్రముఖులతో ప్రశంసలు అందుకుంటోంది.

Updated : 16 Jul 2023 06:34 IST

పట్టుమని పదేళ్లైనా లేవు. అయితేనేం సంగీతం మీద భలే పట్టుంది. కేవలం గాత్రంతోనే కాదు, నాట్యంలోనూ మెప్పిస్తోంది. దేశం కాని దేశంలో.. మన దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడేలా చేస్తోంది. ప్రముఖులతో ప్రశంసలు అందుకుంటోంది. మనలాంటి ఎంతోమంది బాలలకు ఆదర్శంగా నిలుస్తోంది. మరి ఆ చిన్నారి గురించి తెలుసుకుందామా!

డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లికి చెందిన గణిశెట్టి శివన్నారాయణ, శ్రీదేవిల సంతానమే హృద్య. అమ్మానాన్న ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటున్నారు. అక్కడే ప్రస్తుతం ఈ చిన్నారి మూడో తరగతి చదువుతోంది. చిన్ననాటి నుంచి తమ కూతురు సంగీతాభిరుచిని గమనించిన తల్లిదండ్రులు తగిన ప్రోత్సాహం అందించారు. వాషింగ్టన్‌లోని సియాటెల్‌ నగరంలో నళినీకృష్ణన్‌ దగ్గర అయిదేళ్లుగా కర్ణాటక సంగీతం, భరతనాట్యం నేర్పిస్తున్నారు. రెండేళ్లుగా శ్రీరామాచారి వద్ద సినీ సంగీతంలోనూ శిక్షణ  ఇప్పిస్తున్నారు. ఒక వైపు చదువును, మరో వైపు కళలను సమన్వయం చేసుకుంటూ హృద్య ముందుకు సాగుతోంది.

రాగయుక్తంగా..

ఈ బాలిక చిన్న వయసు నుంచే అమెరికాలోని పలు ప్రాంతాల్లో సంగీత కచేరీల్లో పాల్గొనడం ప్రారంభించింది. వందలు, వేల సంఖ్యలో హాజరైన ప్రవాస భారతీయులను తన గాత్రంతో కట్టిపడేసింది. వారి కరతాళ ధ్వనులతో ప్రాంగణాలు మారుమోగేలా చేసింది. అమెరికాలో పలు తెలుగు సంఘాలు నిర్వహించే స్టేజ్‌ షోలకు ప్రారంభ భక్తిగీతాలు పాడి ప్రేక్షకులను మెప్పిస్తోంది. అమెరికాలో జరిగిన సంగీత, సినీ ఆర్టిస్ట్‌-3 అవార్డును గెలుచుకుంది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు... చిరుప్రాయం నుంచే తన ప్రతిభను చాటుతోంది.

ప్రముఖుల ప్రశంసలు...

మణిశర్మ సెటిల్‌కాంటెస్ట్‌ను గెలిచి ఆయన నుంచి ప్రశంసలు అందుకుంది. తన ఏడో ఏట తమన్‌ షోలో వేలాది ప్రేక్షకుల మధ్య ‘లాహే..లాహే’ అంటూ సినీ గీతాన్ని ఆలపించింది. ఏకంగా మెగాస్టార్‌ చిరంజీవి నుంచీ అభినందనలు అందుకుంది. ‘నన్ను నన్నుగా.. ఉండనీవుగా...’ అనే సినీ గీతంతోనూ అమెరికాలో జరిగిన ఓ పోటీలో విజేతగా నిలిచింది. దర్శకుడు కృష్ణవంశీ నుంచి ప్రశంసలు అందుకుంది.

సొంత ఊరిలో....

కేవలం అమెరికాలోనే కాదు... తమ స్వగ్రామమైన సన్నవిల్లి రామాలయంలో హృద్య ఇటీవల శాస్త్రీయ సంగీత కచేరీ నిర్వహించింది. స్థానికులు, చుట్టుపక్కల గ్రామస్థులు మైమరిచి ఆలకించారు. అమెరికాలో ఉంటున్నప్పటికీ మన సంస్కృతి, సంప్రదాయాలు, కళలను మరిచిపోలేదని అందరూ అభినందించారు. గత నెలలో అయినవిల్లి సిద్ధివినాయక ఆలయంలో జరిగిన కచేరితోనూ అబ్బురపరిచింది. శాస్త్రీయ సంగీతంలో అత్యున్నత స్థాయికి చేరడమే తన లక్ష్యమని చెబుతోంది. మరి మనమూ హృద్యకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుదామా.!  

 కాకిలేటి శ్రీనివాస్‌, న్యూస్‌టుడే, ఉప్పలగుప్తం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని