పిల్లల కోసం సైన్స్‌ పార్కు!

హలో ఫ్రెండ్స్‌.. మనలో చాలామందికి లెక్కలంటే భయం.. కొందరికేమో సైన్స్‌ పాఠాలు అర్థం కాక, పుస్తకాలతో కుస్తీలు పడుతుంటారు. అందుకే పిల్లల్లో సైన్స్‌ పట్ల భయం పోగొట్టి, అందులోని అంశాలు సులభంగా అర్థమయ్యేలా ఓ పార్కును ఏర్పాటు చేశారు.

Published : 22 Jul 2023 00:42 IST

హలో ఫ్రెండ్స్‌.. మనలో చాలామందికి లెక్కలంటే భయం.. కొందరికేమో సైన్స్‌ పాఠాలు అర్థం కాక, పుస్తకాలతో కుస్తీలు పడుతుంటారు. అందుకే పిల్లల్లో సైన్స్‌ పట్ల భయం పోగొట్టి, అందులోని అంశాలు సులభంగా అర్థమయ్యేలా ఓ పార్కును ఏర్పాటు చేశారు. మరి ఆ పార్కేంటో, ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

ర్ణాటక రాష్ట్రం గదగ్‌ పట్టణంలోని చిక్కట్టి అనే ఓ ప్రైవేటు పాఠశాలకు విద్యార్థులందరూ వరస కడుతున్నారట. అలాగని అడ్మిషన్ల కోసమని పొరపాటు పడకండి. ఎందుకూ అంటే.. ఆ బడి ఆవరణలో ఇటీవల కొత్తగా నిర్మించిన సైన్స్‌ పార్కే అందుకు కారణం.

31 నమూనాలు..

సదరు ప్రైవేటు పాఠశాల యజమాని చిక్కట్టి.. బడి ఆవరణలోని దాదాపు ఎకరం స్థలంలో సైన్స్‌ పార్కును తీర్చిదిద్దారు. దీనికోసం దాదాపు రూ.30 లక్షలు ఖర్చు చేశారట. ఈ పార్కులో మన పాఠ్య పుస్తకాల్లో ఉండే దాదాపు 31 నమూనాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు కేవలం తరగతి గదుల్లో పాఠాలు వినడమే కాకుండా.. ప్రయోగాత్మకంగా నేర్చుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటుందని భావించారాయన. దాంతో సొంత డబ్బుతో ఈ పార్కును ఏర్పాటు చేయించారు. అంతేకాదు.. ప్రభుత్వ, ఇతర ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఉచితంగానే అందులోకి ప్రవేశం కల్పిస్తున్నారు.

వీడియోల ద్వారా..

స్థానికంగా, చుట్టుపక్కలున్న విద్యార్థులు మాత్రమే ఆ పార్కుకు వెళ్లిరాగలరు. ‘మరి ఇతర ప్రాంతాల్లో ఉండేవారి పరిస్థితి ఏంటి?’.. ఇదే ప్రశ్న.. పార్కు నిర్వాహకులకూ వచ్చింది. అందుకే, అందులో ఉన్న ప్రాజెక్టులు, పరికరాల పనితీరును వీడియో తీసి మరీ.. స్కూల్‌కు సంబంధించిన సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. ఈ పార్కును 2019లోనే అందుబాటులోకి తీసుకురావాలని అనుకున్నా.. కొవిడ్‌ లాక్‌డౌన్‌తో కొంత ఆలస్యమైందట. తమ ప్రాంతం పిల్లలు సైన్స్‌లో వెనకబడొద్దనే ఉద్దేశంతోనే ఆయన ఈ ఆలోచన చేశారట. ఆ స్కూల్‌ టీచర్లే పార్కుకు వచ్చే విద్యార్థులకు ఆయా పరికరాల గురించి వివరంగా చెబుతున్నారు. పుస్తకాల్లో చదువుకున్న అంశాలను నేరుగా చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందంటూ అక్కడికొచ్చే పిల్లలంతా సంతోషంగా చెబుతున్నారు. నేస్తాలూ.. మీరెప్పుడైనా ఆ కర్ణాటక వైపు వెళ్తే, ఈ సైన్స్‌ పార్కును చూసిరావడం మర్చిపోవద్దు మరి..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని