పక్షులే తన ప్రపంచం..!

ముంబయిలో జన్మించిన అనన్య విశ్వేశ్‌ (12) పదేళ్లుగా అమ్మానాన్నలతో కలిసి తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా ఊటీలో ఉంటోంది.

Updated : 26 Jul 2023 07:09 IST

కొమ్మల చాటున కుహుకుహూలు.. కొండల్లో కోనల్లో.. కిలకిలా రావాలు.. ప్రకృతి ఒడిలో పక్షుల రాగాలు... వీనుల విందైన ఇవన్నీ... ఇష్టం లేనిది ఎవరికి చెప్పండి... కానీ ఓ చిన్నారి విని వదిలేయలేదు.. కేవలం చూసి విడిచిపెట్టలేదు... వాటిని తన కెమెరాలో బంధించింది... ఆ చిత్రాలు, వాటి వివరాలతో...
ఓ పుస్తకాన్నే కూర్చింది... అంతేనా అంటే.. ఊహూ... కానేకాదు.. ఆ పుస్తకాలు అందరికీ ఉచితంగా అందిస్తోంది... మరి ఆ బుడత గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా!

ముంబయిలో జన్మించిన అనన్య విశ్వేశ్‌ (12) పదేళ్లుగా అమ్మానాన్నలతో కలిసి తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా ఊటీలో ఉంటోంది. వీళ్ల స్వస్థలం కేరళ. ఈ చిన్నారి 288 రకాల పక్షుల ఫొటోలు తీసి, వాటి వివరాలతో ‘ది బర్డ్స్‌ ఆఫ్‌ మసినగుడి’ పేరుతో పుస్తకం రాసింది. నాన్న సాయంతో ముద్రించిన ఈ పుస్తక ప్రతులను సొంత ఖర్చుతో పంపిణీ చేస్తోంది. అందరికీ పక్షుల జీవనశైలి గురించి తెలియాలనే అనన్య ఇలా చేస్తోంది.

నాన్న చేయూతతో...

వీరి నివాసం దగ్గర్లోనే ముదుమలై పులుల అభయారణ్యం ఉంది. ఈ చిన్నారి నాన్న అప్పుడప్పుడు అక్కడికి తీసుకెళ్తూ ఉండేవారు. అది దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో అక్కడ పలు రకాల పక్షులు ఎక్కువగా ఉంటాయి. అవన్నీ అనన్యకు బాగా నచ్చాయి. వాటి పేర్లను నాన్నను అడిగి తెలుసుకునేది. ఆయన కూడా ఓపిగ్గా చెప్పేవాడు. ఓసారి ఓ పక్షి పలు రంగుల్లో ఉండడం చూసింది. ‘ఆ పక్షి ఎందుకు అన్ని రంగుల్లో ఉంది? దాని ప్రత్యేకత ఏమిటి? అది ఏం తింటుంది? అసలు అన్ని పక్షులు ఎందుకు ఒకేలా ఉండవు?’ ఇలా చాలా ప్రశ్నలు చిన్నారికి వచ్చాయి. దీంతో అనన్య వాళ్ల నాన్న పక్షులకు సంబంధించిన ఓ చార్ట్‌ కొనిచ్చాడు. అందులోని వివరాలను ఈ చిన్నారి ఎంతో ఆసక్తిగా చదివి తెలుసుకుంది.

చిట్టి చేతులతో...

తమ కుమార్తెకు పక్షుల మీద ఉన్న ఆసక్తిని గమనించిన ఆయన మరిన్ని విషయాలు తెలుసుకునేలా ప్రోత్సహించారు. అందుకోసం ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో చదువుకునేలా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అనన్య రోజుకు 4 గంటలపాటు ఆన్‌లైన్‌ తరగతుల్లో పాల్గొని, మిగిలిన సమయాల్లో పక్షుల గురించి అధ్యయనంలో లీనమైపోతుంది. తాను తెలుసుకున్న పక్షులను నేరుగా చూడడమే కాకుండా, వాటి ఫొటోలు తీయాలనుకుంది. ఇంకేం నాన్న మంచి కెమెరా కొనిచ్చారు. అలాగే పక్షుల మీద పరిశోధనలు చేస్తున్న తన స్నేహితుడిని అనన్యకు పరిచయం చేశాడు. ఆ అంకుల్‌ వద్ద చిన్నారి పక్షుల గురించి చాలా విషయాలు నేర్చుకుంది. మసినగుడి, ఊటీ, కొత్తగిరి తదితర ప్రాంతాలు తిరిగి పలురకాల పక్షుల ఫొటోలు తీయడం ప్రారంభించింది. మసినగుడి ప్రాంతానికి అక్టోబరు, నవంబరు నెలల్లో రకరకాల పక్షులు వలస వస్తుంటాయి. అదేవిధంగా ఇక్కడివి ఆసియా ఖండం వ్యాప్తంగా వెళ్తుంటాయి. వాటన్నింటినీ తన చిట్టి చేతులతో కెమెరాలో బంధించింది.

అవగాహన కల్పించే యత్నం

‘జంతువుల గురించి జనానికి తెలిసినంతగా, పక్షుల విషయాలు తెలియడం లేదు. అందుకే పక్షుల జీవనశైలి గురించి ప్రజలకు తెలియజెప్పాలి అనుకున్నాను. అందుకే నేను తీసిన పక్షుల ఫొటోలు, వాటి వివరాలతో అమ్మానాన్న సాయంతో పుస్తకం రూపొందించా. ఆ పుస్తక ప్రతులను ఉచితంగా పలు కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, గ్రంథాలయాలకు పంపించాను. ఇంకా దట్టమైన అడవుల్లో ఉండే మరెన్నో పక్షుల గురించి పరిశోధించి, మరో పుస్తకం రూపొందించాలని ఉంది. పక్షులే నా ప్రపంచం. వాటిలా నచ్చిన చోటుకు, అనుకున్న సమయంలో ఎగురుకుంటూ వెళ్లి వాటి గురించి వివరాలు సేకరించాలని ఉంది. భవిష్యత్తులో ఐఎఫ్‌ఎస్‌ అధికారిణి కావాలన్నది నా కోరిక’ అంటోంది ఈ చిన్నారి. ఎంతైనా మన అనన్య చాలా గ్రేట్‌ కదూ! భవిష్యత్తులో తన ఆశయం నెరవేరాలని మనమూ మనసారా కోరుకుందామా మరి.

 పి.లక్ష్మీ హరికృష్ణ న్యూస్‌టుడే, ఆర్కేనగర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని