లెక్కలంటే కష్టం కాదట..!

హలో నేస్తాలూ.. బడిలో ఇచ్చిన హోంవర్క్‌ చేయాలంటేనే చాలా బద్ధకిస్తాం. అందులోనూ గణితం  అంటే తెగ భయపడిపోతాం.

Updated : 01 Sep 2023 04:15 IST

హలో నేస్తాలూ.. బడిలో ఇచ్చిన హోంవర్క్‌ చేయాలంటేనే చాలా బద్ధకిస్తాం. అందులోనూ గణితం  అంటే తెగ భయపడిపోతాం. ఒక్కోసారి ‘ఈ లెక్కలను ఎవరు కనిపెట్టార్రా బాబూ..’ అని అనిపిస్తుంటుంది కదూ..! కానీ, ఓ నేస్తం మాత్రం ఆ చిక్కుల లెక్కలతోనే రికార్డు సాధించాడు. ఇంతకీ తనెవరో, ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

కోల్‌కతాకు చెందిన సౌమిల్‌ మన్నాకు పదకొండు సంవత్సరాలు. ప్రస్తుతం అయిదో తరగతి చదువుతున్నాడు. సాధారణంగా ఈ వయసులో ఎంచక్కా ఎక్కాలు(టేబుల్స్‌) మొత్తం నేర్చేసుకొని చిన్న చిన్న లెక్కలు చేసేస్తుంటాం. నోటితోనో, చేతి వేళ్ల మీదనో వచ్చేవి అయితే గబగబా కానిచ్చేస్తాం. కాస్త పెద్దవి అయితే స్నేహితులనో, పెద్దవాళ్లనో అడుగుతాం. ఇంకాస్త పెద్ద వాటికైతే కాలిక్యులేటర్‌ సహాయం తీసుకుంటాం.

చిటికెలోనే...

కానీ, సౌమిల్‌ మాత్రం ఏకంగా స్క్వేర్‌ రూట్లే చిటికెలో రాసేస్తున్నాడు. అది కూడా పది వరకో, ఇరవై వరకో కాదు నేస్తాలూ.. ఏకంగా 1 నుంచి 100 వరకు అన్ని సంఖ్యల స్క్వేర్‌ రూట్లు చెప్పేస్తున్నాడు. అది కూడా కేవలం 2 నిమిషాల 51 సెకన్లలోనే.. అందుకే, అతి తక్కువ సమయంలోనే ఈ ఘనతను సాధించినందుకు ‘ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ ప్రతినిధులు సౌమిల్‌ను అభినందించారు. ఈ నేస్తం పేరిట రికార్డూ నమోదు చేశారు.  

చిన్నప్పటి నుంచే ఆసక్తి..

తరగతిలో ఏ ప్రశ్న అడిగినా, ఏ పరీక్ష పెట్టినా.. మన సౌమిల్‌ ముందే ఉంటాడట. ఇంకో విషయం ఏంటంటే.. తనకు చిన్నప్పటి నుంచి లెక్కలంటే చాలా ఇష్టం. అందరూ భయపడే ఆ సబ్జెక్టుపైన కొడుకు ఆసక్తి చూసి తల్లిదండ్రులకూ భలే ముచ్చటేసిందట. ఏవైనా క్లిష్టమైన లెక్కలు సాధించేందుకు, మొదట సులభమైన పద్ధతులు ఏమైనా ఉన్నాయేమోనని చూస్తుంటాడు. ఆ తర్వాత తన పద్ధతిలో చకచకా వాటిని పూర్తి చేసేస్తాడట. ‘నీ రహస్యం ఏంటి?’ అని ఎవరైనా ఈ నేస్తాన్ని అడిగితే.. ‘ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయడమే..’ అని సింపుల్‌గా చెబుతాడు. అందుకే ఎంత పెద్ద లెక్కయినా తనకు అంత కష్టంగా అనిపించదు. పిల్లలూ.. ఆ సీక్రెట్‌ ఏంటో మీకూ తెలిసింది కదా.. లెక్కలను ఎంత ప్రాక్టీస్‌ చేస్తే, అంత సులభమన్నమాట. భవిష్యత్తులో ఈ నేస్తం మరిన్ని రికార్డులు సాధించాలని మనమూ ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దాం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు