శెభాష్‌ హర్షిత!

హలో ఫ్రెండ్స్‌.. మనలో చాలామంది వంటగదిలోకి కూడా వెళ్లం. ఎంచక్కా అమ్మ వండిపెట్టింది తింటాం. ఆహార పదార్థాలకు సంబంధించిన విషయాలను అంతగా పట్టించుకోం. ‘చదువు, ఆటలతోనే సరిపోతుంది

Published : 05 Oct 2023 00:08 IST

హలో ఫ్రెండ్స్‌.. మనలో చాలామంది వంటగదిలోకి కూడా వెళ్లం. ఎంచక్కా అమ్మ వండిపెట్టింది తింటాం. ఆహార పదార్థాలకు సంబంధించిన విషయాలను అంతగా పట్టించుకోం. ‘చదువు, ఆటలతోనే సరిపోతుంది.. ఇక అది కూడానా?’ అంటారా.. అదీ నిజమేననుకోండి. అయితే, ఓ నేస్తం మాత్రం అందరిలా కాకుండా భిన్నమైన ఆసక్తితో ముందుకెళ్తోంది. పెద్ద పెద్ద సమావేశాల్లోనూ పాల్గొంటుంది. ఇంతకీ తనెవరో, ఆ వివరాలేంటో తెలుసుకుందామా.!

  •  ఒడిశాకు చెందిన హర్షిత ప్రియదర్శినికి 12 సంవత్సరాలు. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్న ఈ నేస్తాన్ని అక్కడి వారంతా ‘సీడ్‌ గర్ల్‌’ అని పిలుస్తుంటారు. ఎందుకూ అంటే.. తమ ప్రాంతంలో పండే అరుదైన వరి, చిరుధాన్యాల విత్తనాలను సేకరిస్తోంది. అలా వాటన్నింటినీ ఇంట్లోనే జాగ్రత్తగా పెద్ద పెద్ద గాజు సీసాల్లో భద్రపరుస్తోంది.

ఆమె స్ఫూర్తితోనే..

సేంద్రియ వ్యవసాయంపైన రైతులకు అవగాహన కల్పిస్తూ, వందల సంఖ్యలో రకరకాల విత్తనాలను భద్రపరుస్తున్న కమలా పుజారి అనే పెద్దావిడ గురించి మూడేళ్ల క్రితం హర్షితకు తెలిసింది. ఆమె స్ఫూర్తితోనే తాను కూడా భవిష్యత్తు తరాలకు మేలైన వంగడాలను అందించాలని అనుకుంది. అలా స్థానికంగా జరిగే సంతల్లో, రైతుల దగ్గరకు వెళ్తూ.. అరుదైన వరి, చిరుధాన్యాల విత్తనాలను సేకరించి దాయడం ప్రారంభించింది. అలా ఇప్పటివరకూ దాదాపు 150 రకాల వరి, 60 రకాల చిరుధాన్యాల వంగడాలను భద్రపరిచింది. వీటికోసం వాళ్ల ఇంట్లోనే ఓ గదిని ప్రత్యేకంగా కేటాయించింది.

దేశ రాజధాని వేదికగా..

మేలైన వంగడాల కోసం హర్షిత చేస్తున్న కృషిని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు గుర్తించారు. దాంతో ఇటీవల దిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అధ్యక్షతన ‘గ్లోబల్‌ సింపోజియం ఆన్‌ ఫార్మర్స్‌ రైట్స్‌’ పేరిట నిర్వహించిన సదస్సులో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. దాదాపు 125 దేశాల నుంచి ప్రతినిధులు హాజరైన ఈ కార్యక్రమంలో.. ధైర్యంగా మాట్లాడింది. ఆ వేదికగా తన పనితీరును వివరించడంతోపాటు ఇప్పటివరకూ సేకరించిన విత్తనాలనూ అక్కడికి తీసుకెళ్లి, ప్రదర్శనగా ఉంచింది.

జట్టుగా.. ఉచితంగా..

తన ప్రయాణంలో మరింత మందిని భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో ‘హర్షిత ప్రియదర్శిని సైన్స్‌ క్లబ్‌’ను ప్రారంభించింది. ఇందులో స్నేహితులతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లోని రైతులనూ చేర్చింది. వారందరి సహకారంతో వివిధ ప్రాంతాల్లో తాను సేకరించిన మేలైన వంగడాలను ఉచితంగా పంపిణీ చేయసాగింది. ‘ఒడిశా అనగానే ఎవరికైనా ముందుగా ప్రకృతి అందాలే గుర్తుకొస్తాయి. వాటితోపాటు ఈ ప్రాంతం మేలైన విత్తనాలకు కూడా ప్రసిద్ధి చెందినదని రాబోయే తరాలకు తెలియజేయాలనేదే నా ఉద్దేశం. భవిష్యత్తులో వ్యవసాయ శాస్త్రవేత్తగా స్థిరపడతా’ అని హర్షిత చెబుతోంది. చిన్న వయసులోనే పెద్ద ఆశయంతో ముందుకెళ్తున్న ఈ నేస్తానికి మనమూ ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని