అయిదేళ్లకే ప్రపంచ రికార్డు!

హాయ్‌ నేస్తాలూ.. ఎవరైనా ‘మీకు ఏ ఆటలంటే ఇష్టం? వాటిలో ఎక్కువగా ఏది ఆడతారు?’ అని అడిగితే.. క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, చెస్‌, క్యారమ్స్‌లాంటి పేర్లు చెబుతారు.

Updated : 21 Oct 2023 05:12 IST


హాయ్‌ నేస్తాలూ.. ఎవరైనా ‘మీకు ఏ ఆటలంటే ఇష్టం? వాటిలో ఎక్కువగా ఏది ఆడతారు?’ అని అడిగితే.. క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, చెస్‌, క్యారమ్స్‌లాంటి పేర్లు చెబుతారు. ఫోన్‌లో వీడియో గేమ్స్‌ గురించైతే ఇక చెప్పనక్కర్లేదు. కానీ, ఓ నేస్తం మాత్రం అందరిలా కాకుండా భిన్నమైన దారిలో వెళ్తోంది. అంతేకాదు.. ప్రపంచ రికార్డు కూడా సాధించింది. ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

మహారాష్ట్రలోని పుణెకు చెందిన మనస్వి విశాల్‌కు ప్రస్తుతం అయిదు సంవత్సరాలు. ‘ఈ వయసు పిల్లలెవరైనా యూకేజీనో, ఒకటో తరగతో చదువుతుంటారు.. వాళ్లేం చేస్తారు?’ అని తక్కువ అంచనా వేయకండి. ఈ చిన్నారి ‘లోయెస్ట్‌ లింబో స్కేటింగ్‌’ చేసి తన ప్రతిభను చాటింది. అంటే.. భూమి నుంచి కేవలం 6.49 అంగుళాల ఎత్తులోనే దూసుకెళ్లిందన్నమాట. గత జులైలో చేసిన ఈ ఫీట్‌కు సంబంధించిన వివరాలను ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ ప్రతినిధులు నమోదు చేసుకున్నారు. ఇటీవలే మనస్వికి రికార్డు ధ్రువపత్రాన్ని అందజేశారు.  

చిన్నప్పటి నుంచే..!

చిన్నతనం నుంచి మనస్వి చాలా చురుగ్గా ఉండేది. తనకు మూడున్నరేళ్లు ఉన్నప్పటి నుంచే లింబో స్కేటింగ్‌ నేర్చుకోవడం ప్రారంభించింది. ఇప్పటి వరకు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంది. అంతేకాదు.. బోలెడు పతకాలూ సాధించింది. ‘మరి బడి సంగతేంటి?’ అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది కదా.. ఈ నేస్తం చదువులోనూ ప్రతిభావంతురాలేనట.

అంత తేలికేం కాదు..

స్కేటింగ్‌లో రకరకాలు ఉంటాయని తెలిసే ఉంటుంది. లింబో స్కేటింగ్‌ అంటే.. కాళ్లకు స్కేట్స్‌ ధరించి, ఏవైనా వాహనాల చక్రాల మధ్యలోంచో లేదా ఇనుప కడ్డీల కింద నుంచో.. వాటిని ఏమాత్రం తాకకుండా చకచకా వెళ్లిపోవడమన్నమాట. ఇది మాటలు చెప్పినంత సులభమేం కాదు ఫ్రెండ్స్‌.. దానికి ఎంతో సాధన అవసరం. దాదాపు రెండేళ్ల నుంచి ఎంతో కష్టపడి ప్రాక్టీస్‌ చేస్తుంది కాబట్టే మనస్వి గిన్నిస్‌ రికార్డు సాధించగలిగింది.

తాజాగా ఈ విషయాన్ని గిన్నిస్‌ బుక్‌ వాళ్లు తమ అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల్లో అప్‌లోడ్‌ చేశారు. అది చూసిన వారంతా ‘మనస్వి గ్రేట్‌’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.. ఇంత చిన్న వయసులోనే ఈ నేస్తం ఇన్ని సాధించిందంటే, ముందు ముందు ఇంకెన్ని రికార్డులు కొల్లగొడుతుందో కదూ..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని