చక్రాల చిరుత... విజయాల్లో ఘనత!

కాళ్లకు చక్రాలు...కళ్లలో విజయకాంక్ష!రెపరెపలాడే విజయపతాకం!వరించే వన్నెల పతకాలు!మారుమోగే కరతాళ ధ్వనులు...పసిప్రాయం నుంచే సాధన...పసిడి పతకాలతో రికార్డుల ఛేదన...ఇదంతా రోలర్‌ స్కేటింగ్‌లో సత్తా చాటుతున్న ఓ చిరుత గురించి వర్ణన! మరింతకీ ఆ క్రీడాకారిణి ఎవరంటే....

Published : 30 Oct 2023 00:02 IST

కాళ్లకు చక్రాలు...కళ్లలో విజయకాంక్ష!రెపరెపలాడే విజయపతాకం!వరించే వన్నెల పతకాలు!మారుమోగే కరతాళ ధ్వనులు...పసిప్రాయం నుంచే సాధన...పసిడి పతకాలతో రికార్డుల ఛేదన...ఇదంతా రోలర్‌ స్కేటింగ్‌లో సత్తా చాటుతున్న ఓ చిరుత గురించి వర్ణన! మరింతకీ ఆ క్రీడాకారిణి ఎవరంటే....

రోలర్‌ స్కేటింగ్‌లో అద్భుతాలు సృష్టిస్తున్న దొంత గ్రీష్మ స్వస్థలం విశాఖపట్నం. నాలుగేళ్ల చిరుప్రాయం నుంచే సాధన చేస్తూ.. ప్రస్తుతం రింక్‌లో చిరుతలా దూసుకుపోతోంది. ఇటీవల చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో పాల్గొన్న గ్రీష్మ నాలుగో స్థానంలో నిలిచినా.. అందరి ప్రశంసలందుకుంది. తాజాగా అక్కడే జరిగిన ఆసియన్‌ రోలర్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో యూత్‌ కేటగిరీలో ఆర్టిస్టిక్‌ ఇన్‌లైన్‌ స్కేటింగ్‌ విభాగంలో స్వర్ణం, ఫ్రీస్కేటింగ్‌తోపాటు పెయిర్‌ విభాగంలో రెండు రజత పతకాలు సొంతం చేసుకుంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఇప్పటి వరకు 103 పతకాలు సాధించి రికార్డు సృష్టించింది. అందులో 63 స్వర్ణాలు, 32 రజతాలు, 8 కాంస్య పతకాలున్నాయి. వీటిలో 3 అంతర్జాతీయ, 8 జాతీయస్థాయి పోటీలుంటే, వాటిలో 11 స్వర్ణ, 9 వెండి పతకాలు కైవసం చేసుకుంది.

అమ్మ ఆశ.. కూతురి ఆశయం!

గ్రీష్మ తండ్రి చంద్రశేఖర్‌ ప్రైవేటు ఉద్యోగి, తల్లి షర్మిల గృహిణి. గ్రీష్మ తల్లి రోజూ పార్కుకు వెళ్లినప్పుడు అక్కడ స్కేటింగ్‌ చేస్తున్న పిల్లలను చూసి మురిసిపోయేవారు. తన పిల్లలనూ అలాగే తీర్చిదిద్దాలనుకున్నారు. గ్రీష్మ చాలా చురుకుగా ఉండటంతో నాలుగేళ్లు రాగానే స్కేటింగ్‌ అకాడమీలో చేర్పించారు. తొలిరోజు నుంచి ప్రతిభ కనబరిచేది. ఏడాదిన్నర తర్వాత తండ్రికి బదిలీ కావడంతో హైదరాబాద్‌ వెళ్లిపోయారు. అక్కడ నాలుగేళ్లు శిక్షణ పొందింది. 2017లో తిరిగి వారు విశాఖ వచ్చేశారు. అదే ఏడాది తొలిసారి జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని కాంస్యం సాధించింది.

చదువుల్లోనూ మేటి...

ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న గ్రీష్మ చదువుల్లోనూ ముందుంటోంది. ఒకవైపు రోలర్‌ స్కేటింగ్‌కు సమయం కేటాయిస్తూనే, విద్యకూ ప్రాధాన్యం ఇస్తోంది. ప్రతిదినం తెల్లవారుజామున 4:30 గంటలకే నిద్ర లేచి స్కేటింగ్‌ సాధన ప్రారంభిస్తుంది. రోజూ నాలుగు గంటలకు పైగా సాధన చేస్తుంది. పోటీలు ఉన్నప్పుడు మరో గంట ఎక్కువగా కష్టపడుతుంది. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తున్న గ్రీష్మను ఇప్పుడు అందరూ పొగుడుతున్నారు. కానీ మొదట్లో.. ‘నీకు ఆటలెందుకు?’ అని ఎంతో మంది నిరుత్సాహపరిచేవారు. ‘ఆడపిల్ల చైనా వరకు ఎందుకు..? పదో తరగతిలో పిల్లను ఆటలాడటానికి పంపిస్తున్నావా..?’ అని గ్రీష్మ తల్లిని కూడా అడిగేవారు. కానీ ఇప్పుడు వారే గొప్పగా చెప్పుకొంటున్నారు.

కూచిపూడిలోనూ...

కేవలం రోలర్‌ స్కేటింగ్‌లోనే కాదు.. గ్రీష్మకు కూచిపూడిలోనూ ప్రావీణ్యం ఉంది. ఇప్పటి వరకు పలు ప్రాంతాల్లో 15కు పైగా ప్రదర్శనలిచ్చింది. 2019లో అయితే ఏకంగా స్కేటింగ్‌ చక్రాలతో కూచిపూడి ప్రదర్శన చేసి, వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. గ్రీష్మ తల్లి పోటీలకు తోడుగా వెళ్లేందుకు ఉద్యోగం మానేశారు. తన ప్రదర్శన బాగుండటంతో ఇంట్లో ఆర్థిక సమస్యలున్నా ప్రోత్సహిస్తున్నారు. ఆమె తన బంగారం తాకట్టు పెట్టి గ్రీష్మను ఆసియా క్రీడలకు పంపారు. ‘విదేశాల్లో పోటీలకు వెళ్లాలంటే ఒకరికి కనీసం రూ.2 లక్షలు ఖర్చవుతుంది. ఒక జత బూట్ల ఖరీదే దాదాపు రూ.లక్ష ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం, దాతలు సహకరిస్తే గ్రీష్మ మరిన్ని విజయాలు సాధిస్తుంది’ అని తల్లిదండ్రులు చెబుతున్నారు.

‘నిరాశ చెందను....’

‘పోటీలో పతకాలు రాకపోయినా నిరాశ చెందకుండా, కొత్త విషయాలు నేర్చుకుంటా. నా విజయాల్లో కోచ్‌లు సత్యనారాయణ, చిట్టిబాబు కీలకపాత్ర పోషించారు. వారు కొత్త విషయాలు బోధించడంతోపాటు, నాలో లోపాలను సరిదిద్దుకోవడానికి సహకరిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా’ అంటోంది గ్రీష్మ. మరి మనమూ తనకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుదామా!

కేతిరెడ్డి రాజ్యలక్ష్మి, ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని