క్లిక్‌మనిపించాడు..పురస్కారం దక్కించుకున్నాడు!

హలో ఫ్రెండ్స్‌.. ఎటైనా టూర్‌కి వెళ్లినప్పుడో, ఏదైనా శుభకార్యాల్లోనో ఫొటోలు దిగుతుంటాం. మనం కూడా సెల్‌ఫోన్‌లో అప్పుడప్పుడూ సరదాగా సెల్ఫీలు తీసుకుంటాం

Updated : 01 Nov 2023 04:47 IST

హలో ఫ్రెండ్స్‌.. ఎటైనా టూర్‌కి వెళ్లినప్పుడో, ఏదైనా శుభకార్యాల్లోనో ఫొటోలు దిగుతుంటాం. మనం కూడా సెల్‌ఫోన్‌లో అప్పుడప్పుడూ సరదాగా సెల్ఫీలు తీసుకుంటాం. కానీ, ఓ నేస్తం మాత్రం ఆ సరదానే హాబీగా మార్చుకున్నాడు. ఫొటోగ్రఫీలో ఆస్కార్‌గా అభివర్ణించే అవార్డును అందుకున్నాడు. తనెవరో, ఆ వివరాలేంటో చదివేయండి మరి..

కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన విహాన్‌కు పది సంవత్సరాలు. ఇటీవల లండన్‌లోని ‘నేచురల్‌ హిస్టరీ మ్యూజియం’ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రఖ్యాత ‘వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పోటీల్లో బెస్ట్‌ ఫొటోగ్రాఫర్‌గా నిలిచాడు. తను తీసిన ఫొటో న్యాయనిర్ణేతలను మెప్పించింది మరి. ఇంతకీ ఆ ఫొటో ఏంటంటే.. శ్రీకృష్ణుడి విగ్రహం పక్కన వాలిన ఓ సాలీడు.

తండ్రిని చూసి..

విహాన్‌ వాళ్ల నాన్న వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌. దాంతో చిన్నతనంలోనే తనకు కెమెరాలతో పరిచయం ఏర్పడింది. తండ్రి తీసే చిత్రాలు చూస్తూ.. వాటికి సంబంధించి ఇంట్లో జరిగే చర్చలను వింటుండేవాడు. అలా తనకూ ఫొటోగ్రఫీపైన ఆసక్తి ఏర్పడింది. తన ఇష్టాన్ని తండ్రికి చెప్పడంతో నేర్చుకునేందుకు ప్రోత్సహించారాయన. అలా ఏడేళ్ల వయసు నుంచి ఫొటోగ్రఫీని హాబీగా చేసుకున్నాడు విహాన్‌.

టూర్‌కి వెళ్లి...

ఒకసారి విహాన్‌ కుటుంబ సభ్యులంతా కలిసి నగర శివారు ప్రాంతంలో ఉన్న మర్రిచెట్ల ఉద్యానవనానికి వెళ్లారు. అక్కడున్న ఓ చెట్టు కొమ్మలకు ఒక తెల్లటి సాలీడు నిర్మిస్తున్న గూడు తనను ఆకర్షించింది. చాలాసేపు దాన్నే అలా చూస్తూ రకరకాల ఫొటోలు తీయసాగాడు. ఆ తర్వాత అది అక్కడి ఒక పురాతన ఆలయం గోడ మీదున్న శ్రీకృష్ణుడి విగ్రహం పక్కన వాలింది. ఆ దృశ్యం విహాన్‌కు అద్భుతంగా అనిపించడంతో క్లిక్‌మనిపించాడు.

వేలాదిగా ఫొటోలు..

ఏటా నిర్వహించే ‘వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పోటీలకు ఈసారీ భారీగానే ఫొటోలు వచ్చాయట. మొత్తంగా 50 వేల దరఖాస్తులు రాగా.. అనేక వడపోతల అనంతరం వాటిల్లోంచి వంద మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. తర్వాతి దశలో అందులోంచి 11 ఫొటోలను మాత్రమే ఎంపిక చేశారు. వాటిలో అండర్‌-10 విభాగంలో విహాన్‌ తీసిన సాలీడు చిత్రం ఒకటి. సుమారు 95 దేశాల నుంచి ఈ అవార్డుకు పోటీపడ్డారట. అంతేకాదు.. గతంలో పురస్కారం పొందిన వాటితోపాటు ఈసారి ఉత్తమ చిత్రంగా ఎంపికైన ఈ నేస్తం ఫొటోనూ నాలుగు ఖండాల్లోని దాదాపు 25 దేశాల్లో ప్రదర్శనగా ఉంచుతారట.

ప్రకృతికి దగ్గరగా..

ఫొటోగ్రఫీలో తనకు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందనీ, ఈ హాబీ వల్ల సృజనాత్మకత పెరగడంతోపాటు ప్రకృతికి దగ్గరగా ఉండే అవకాశం లభిస్తుందని విహాన్‌ చెబుతున్నాడు. పిల్లలూ.. ఈ నేస్తానికి మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు