పాట పెడితే.. పాదం కదపాల్సిందే!

హలో ఫ్రెండ్స్‌.. మీకు డీజే అంటే తెలిసే ఉంటుంది కదా.. ఇంతకుముందు వరకూ కేవలం పెద్ద పెద్ద నగరాల్లో ఉండే వారికి మాత్రమే తెలిసేది.

Published : 05 Nov 2023 00:08 IST

హలో ఫ్రెండ్స్‌.. మీకు డీజే అంటే తెలిసే ఉంటుంది కదా.. ఇంతకుముందు వరకూ కేవలం పెద్ద పెద్ద నగరాల్లో ఉండే వారికి మాత్రమే తెలిసేది. కానీ.. ప్రస్తుతం అన్ని ఊరేగింపుల్లోనూ, శుభకార్యాల్లోనూ వినియోగిస్తుండటంతో అందరికీ డీజే అంటే ఏంటో తెలిసింది. అయితే, ఓ నేస్తం మాత్రం ఏకంగా డీజేలో ప్రపంచ రికార్డు సాధించేసింది. ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!!

పాన్‌కు చెందిన రినోకాకు ఆరు సంవత్సరాలు. సాధారణంగా ఈ వయసు పిల్లలు బడికెళ్లనని మారాం చేస్తూ, ఎంచక్కా ఆడుతూపాడుతూ గడిపేస్తుంటారు. కానీ, రినోకా మాత్రం ‘యంగెస్ట్‌ క్లబ్‌ డీజే(ఫిమేల్‌)’గా ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కించుకుంది.

అలా మొదలైంది..

ఒకరోజు సాయంత్రం రినోకా హోంవర్క్‌ పూర్తి చేసేసుకొని, టీవీ చూస్తుందట. అందులో ఒక అమ్మాయి డీజే ఆపరేట్‌ చేయడం తనను ఆకట్టుకుంది. ఆ ప్రోగ్రామ్‌ బాగా నచ్చడంతో, చాలాసేపు అలా చూస్తుండిపోయిందట. ఆ క్షణమే తను కూడా డీజే కావాలని నిర్ణయించుకుంది. అయితే, అనుకోకుండా 2022లో క్రిస్మస్‌ సందర్భంగా శాంతాక్లాజ్‌ నుంచి తనకు డీజే కిట్‌ బహుమతిగా అందిందట. అప్పటి నుంచి ప్రతిరోజూ బడి నుంచి వచ్చాక ప్రాక్టీస్‌ చేయసాగింది. అలా కొద్ది నెలల్లోనే మెలకువలూ నేర్చేసుకుంది. ఇటీవల ఓ క్లబ్‌లో దాదాపు వంద మంది ఎదుట గంటపాటు నిరాటంకంగా డీజే ఆపరేట్‌ చేసింది. ఈ వివరాలను గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు నమోదు చేసుకొని, రికార్డు అందించారు. అయితే, రకరకాల ఇష్టాలున్న అంతమందిని సంగీతంతో ఉర్రూతలూగించాలంటే.. డీజే ప్లే చేయడం మాత్రమే వస్తే సరిపోదనీ, అందుకు తగిన పాటలను ఒకదాని వెంట మరొకటి ఎంపిక చేసుకోవడం కూడా ముఖ్యమేనని చెబుతోందీ చిన్నారి.

ఇతర సరదాలూ..

చదువు, డీజే కాకుండా ఈ నేస్తానికి వేరే ఆసక్తులూ ఉన్నాయట. స్కేట్‌బోర్డింగ్‌, డాన్స్‌తోపాటు బొమ్మల సేకరణ చేస్తుంది. ఇటీవలే కీబోర్డు వాయించడం కూడా నేర్చుకోవడం ప్రారంభించిందట. వారానికోసారి మాత్రం ఇంటి దగ్గర్లోని పార్కుకు వెళ్లి, స్నేహితులతో కలిసి ఆడుకుంటుందట. యంగెస్ట్‌ డీజేగా ప్రపంచం మొత్తం చుట్టేయాలనీ, పెద్ద పెద్ద మ్యూజిక్‌ ఈవెంట్స్‌లో తన ప్రతిభను ప్రదర్శించాలనేది తన లక్ష్యాలుగా చెబుతోంది రినోకా. మరి ఈ నేస్తానికి మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని