చూస్తే బుడత.. రికార్డుల్లోనేమో మోత!

తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలికి చెందిన ఓ చిన్నారి చేసే అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. యోగాలో ఆమె విన్యాసాలు చూసినవారంతా నోరెళ్లబెట్టేస్తున్నారు. రికార్డుల మీద రికార్డులూ ఈమె సొంతమవుతున్నాయి. మరి ఆ చిచ్చరపిడుగు ఎవరో.. ఏంటో తెలుసుకుందామా!

Published : 26 Nov 2023 00:00 IST

తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలికి చెందిన ఓ చిన్నారి చేసే అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. యోగాలో ఆమె విన్యాసాలు చూసినవారంతా నోరెళ్లబెట్టేస్తున్నారు. రికార్డుల మీద రికార్డులూ ఈమె సొంతమవుతున్నాయి. మరి ఆ చిచ్చరపిడుగు ఎవరో.. ఏంటో తెలుసుకుందామా!

పద్నాలుగేళ్ల ప్రిషా ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతోంది. తిరునల్వేలిలో సెప్టెంబరు 27న ఈ చిన్నారి చేసిన యోగా విన్యాసాలు ఆమెకు తిరుగులేని పేరును తెచ్చిపెట్టాయి. ఏకంగా 100 ప్రపంచ రికార్డులు ఆమె సొంతమయ్యాయి! ఈ ఘనతను ‘నోబెల్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ సంస్థ నమోదు చేసి ప్రత్యేక ధ్రువీకరణ పత్రాన్ని ప్రదానం చేసింది.

తిరుగులేని విన్యాసాలతో...!

అబ్బురపరిచే విన్యాసాలు, నీటి అడుగున, నీటిపైనా చేసే యోగా, వినూత్నంగా ఈత కొట్టడం, కళ్లకు గంతలు కట్టుకుని సైకిల్‌ తొక్కడం, సైకిల్‌ తొక్కుతూనే నడుముకు రింగులు వేసుకుని హులాహుప్‌ చేయడం, కళ్లకు గంతలుండగానే తన ముందు ఏ వస్తువుందో ఇట్టే చెప్పేయడం, స్కేటింగ్‌, రెండు చేతులతో రాయడం, రూబిక్‌ క్యూబ్స్‌ సాల్వ్‌ చేయడంలో ఆమె తిరుగులేని చిచ్చరపిడుగులా మారింది. వీటిలోనే అనేక రికార్డులు సాధిస్తూ వస్తోంది.

చిన్నతనంలోనే డాక్టరేట్లు

చిన్నతనం నుంచే యోగా చేయడమంటే ప్రిషాకు ఎంతో ఇష్టం. తల్లి కూడా యోగా టీచర్‌. ఆమెను చూసే తను విన్యాసాలు నేర్చుకుంది. తనతో పాటే తరగతులకు వెళ్లేది. తన ఎనిమిదేళ్లప్పుడు అంధులను చూసి చలించిపోయింది.తిరునల్వేలిలో వారికి యోగా శిక్షణ ఉచితంగా ఇవ్వడం మొదలుపెట్టింది. ఆ చిన్నారి చేస్తున్న సేవను చూసి 2019లో యూనివర్సిటీ ఆఫ్‌ జెరూసలేం మెడికల్‌ కాలేజీ అండ్‌ హాస్పిటల్స్‌, వేలూరు వారు డాక్టరేట్ ఇచ్చి సన్మానించారు. ఇలా తొమ్మిదేళ్ల వయసులోనే డాక్టరేట్ పొందిన అమ్మాయిగా ప్రిషా రికార్డు సాధించింది. దివ్యాంగుల సేవకు మెచ్చిన జాతీయ బాలల హక్కుల కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) చిన్న వయసులో గురువుగా మారిన తొలి బాలికగా గుర్తించి ధ్రువీకరణను అందించింది. 2020-21 నేషనల్‌ యూత్‌ ఫెస్టివల్‌లో కేంద్ర ప్రభుత్వం నడిపే పాఠశాలల్లో యోగా పోటీలకు ముఖ్య అతిథిగా, జడ్జిగా అవకాశం కల్పించింది. గతేడాది ఆగస్టులో మలేషియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌బ్లైండ్‌ ఆమెను ప్రత్యేకంగా తమ దేశానికి ఆహ్వానించింది. విద్యార్థులకు 18 రోజులపాటు శిక్షణ ఇప్పించింది. ఇప్పటికీ ప్రిషా యోగా ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తమిళనాడురాష్ట్రంతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో వృద్ధాశ్రమాలు, పాఠశాలలు, కాలేజీల్లో ఉచిత శిక్షణలు ఇస్తోంది. పోలీసు అధికారులు, ఎన్‌సీసీ విద్యార్థులకు గురువుగా కొనసాగుతోంది. యోగాతో సమాజంలో స్ఫూర్తి నింపుతూ, అందులోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రిషాకు 2021లో ఇండియన్‌ ఎంపైర్‌ యూనివర్సిటీ, అమెరికాలోని వరల్డ్‌ తమిళ్‌ యూనివర్సిటీ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. యూఎస్‌ఏ, ఇండియా నుంచి ఏకంగా 3 డాక్టరేట్లు దక్కించుకున్న పిన్నవయస్కురాలిగా చరిత్ర సృష్టించింది.

పతకాలే... పతకాలు!

భారతదేశంతో పాటు మలేషియా, థాయ్‌లాండ్‌లో జరిగిన యోగా పోటీల్లో బంగారు పతకాలు, వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లను ప్రిషా సాధించింది. ఇలా ఆమె జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ యోగా పోటీల్లో 200కు పైగా బంగారు పతకాల్ని దక్కించుకుంది. తాను సాధించిన 100 రికార్డుల్లో యోగాలోనే అత్యధికంగా ఉన్నాయంటుంది ప్రిషా. అతిచిన్న వయసులో అసమాన్య ప్రతిభతో ఇన్నేసి రికార్డులు సాధించడాన్ని గుర్తించి యూఎస్‌ఏకి చెందిన గ్లోబల్‌ యూనివర్సిటీ ఆమెను ప్రత్యేకంగా మెచ్చుకుంది. ఈ చిన్నారికి కరాటేలోనూ ప్రవేశముంది. ప్రిషా యోగా మీద.. ‘లెట్స్‌ డూ ఇట్ టు డే ఎంజాయ్‌ ఇట్’ అనే పుస్తకాన్నీ రాసింది. దీనికి మంచిపేరు రావడంతో ‘ఇండియా ప్రైమ్‌’ అవార్డుకు ఎంపికైంది. ‘భవిష్యత్తులో ‘‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’’లో స్థానం సాధించడమే తన లక్ష్యమని ఈ చిన్నారి చెబుతోంది. మరి మనమూ తనకు మనసారా ఆల్‌ ది బెస్ట్‌ చెబుదామా!

హిదాయతుల్లాహ్‌.బి, ఈనాడు, చెన్నై

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని