వయసేమో చిన్న.. ప్రదర్శనల్లో మిన్న..!

హాయ్‌ ఫ్రెండ్స్‌..! మనకు డాన్స్‌ చేయడం అంటే సాధారణంగా చాలా బాగా నచ్చుతుంది.. స్కూల్లో అప్పుడప్పుడు ప్రదర్శలు కూడా ఇస్తుంటాం. ఒక పది, పదిహేను నిమిషాలు ఆగకుండా డాన్స్‌ చేస్తే అలసిపోతాం అంతే కదా..!

Updated : 15 Dec 2023 01:23 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌..! మనకు డాన్స్‌ చేయడం అంటే సాధారణంగా చాలా బాగా నచ్చుతుంది.. స్కూల్లో అప్పుడప్పుడు ప్రదర్శలు కూడా ఇస్తుంటాం. ఒక పది, పదిహేను నిమిషాలు ఆగకుండా డాన్స్‌ చేస్తే అలసిపోతాం అంతే కదా..! కానీ, ఓ అమ్మాయి మాత్రం కొన్ని గంటలు ఆపకుండా నృత్యం చేసింది. మరి తనెవరో ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

ర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన తులసి హెగ్దేకి పదిహేను సంవత్సరాలు. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతుంది. తనకు చిన్నప్పటి నుంచి సంప్రదాయ నృత్యం చేయడమంటే చాలా ఇష్టమట. టీవీలో వచ్చిన నృత్యాలను చూసి, తను కూడా అలాగే  చేయడానికి ప్రయత్నించేదట. ఆమె ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు తనను యక్షగానం తరగతుల్లో చేర్పించారట. అలా మూడేళ్ల వయసు నుంచే ఈ చిన్నారి నృత్యం నేర్చుకోవడం ప్రారంభించింది. ప్రతిరోజూ స్కూల్‌ నుంచి వచ్చాక, యక్షగాన తరగతులకు వెళ్తుందట.

వందల ప్రదర్శనలు..

మన తులసి తన అయిదేళ్ల వయసులో మొదటి ప్రదర్శన ఇచ్చిందట. ఇంతకీ.. యక్షగానం అంటే ఏంటో చెప్పలేదు కదూ..! నాటకం, నృత్యం, సంగీతంతో కూడిన ప్రదర్శన అన్నమాట. అంటే.. ఒక విధంగా రంగస్థల ప్రదర్శనలాంటిది. కానీ ఇది నేర్చుకోవడం, ప్రదర్శించడం చెప్పుకున్నంత సులభం అయితే కాదట నేస్తాలూ! తులసి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా దాదాపు 800 ప్రదర్శనలు ఇచ్చిందట. ఈ నృత్యం చేసేటప్పుడు తను 10 నుంచి 12 కిలోల బరువున్న దుస్తులు ధరిస్తుందట. ఒక్కోసారి వేదిక మీదే గంటల సమయం గడిచిపోతుందట. తన ప్రతిభతో ‘రబా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం దక్కించుకుంది. అలాగే.. ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన అన్‌స్టాపబుల్‌ 21 కార్యక్రమంలో కూడా పాల్గొంది. ఇంకా తనకు సాహిత్యం అంటే చాలా ఇష్టమట. భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ ప్రదర్శనలు ఇవ్వాలనేదే ఆమె లక్ష్యమట. ఇంత తక్కువ వయసులో అన్ని ప్రదర్శనలు ఇచ్చిందంటే ఎంతైనా.. మన తులసి చాలా గ్రేట్‌ కదూ..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు