చిట్టి చేతులు... గట్టి చేతలు!

హాయ్‌ నేస్తాలూ..! మనకు కొంచెం ఖాళీ సమయం దొరికితే చాలు.. అమ్మానాన్నల ఫోన్‌ తీసుకొని గేమ్స్‌ ఆడుకుంటాం. లేదంటే కార్టూన్స్‌ చూసుకుంటాం కదా..!

Published : 27 Dec 2023 00:48 IST

హాయ్‌ నేస్తాలూ..! మనకు కొంచెం ఖాళీ సమయం దొరికితే చాలు.. అమ్మానాన్నల ఫోన్‌ తీసుకొని గేమ్స్‌ ఆడుకుంటాం. లేదంటే కార్టూన్స్‌ చూసుకుంటాం కదా..! కానీ ఓ చిన్నారి మాత్రం ల్యాప్‌టాప్‌ మీద ఏబీసీడీలు టైప్‌ చేసి రికార్డు సృష్టించింది. వాటితో రికార్డేంటి? అని ఆశ్చర్యపోతున్నారా..! అయితే ఆ పూర్తి వివరాలేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయండి!

ముంబయికి చెందిన నీలశ్రీకి ప్రస్తుతం రెండున్నరేళ్లు. తను ఇప్పుడిప్పుడే ప్లే స్కూల్‌కు వెళ్తోంది. నిజానికి ఆ వయసులో మాట్లాడటం కూడా సరిగ్గా రాదు. ప్రతి దానికి మారాం చేస్తూ ఉంటారు పిల్లలు. అసలు అక్షరాలు గుర్తుపట్టడం కూడా తెలియదు. కానీ మన నీలశ్రీ మాత్రం అతితక్కువ సమయంలోనే ఏబీసీడీలు టైప్‌ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఆశ్చర్యంగా ఉంది కదూ..! కానీ ఇది నిజమే నేస్తాలూ.. కేవలం 25 సెకన్లలోనే ఎలాంటి తప్పులు లేకుండా 26 ఆంగ్ల అక్షరాలు టైప్‌ చేసింది. తన ప్రతిభను గుర్తించిన ‘ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ వారు ‘ఫాస్టెస్ట్‌ ఆల్ఫాబెట్‌ టైపింగ్‌ ఏ టూ జెడ్‌ బై ఎ టోడ్లర్‌’ విభాగంలో ఆమెకు స్థానం కల్పించారు.

ఇదే మొదటిది కాదు..

అయితే మన నీలశ్రీకి ఇదే మొదటి రికార్డు కాదట ఫ్రెండ్స్‌. తనకు ఒకటిన్నరేళ్లు ఉన్నప్పుడే ఒక రికార్డును సొంతం చేసుకుందట. చిన్న వయసులోనే అతితక్కువ సమయంలో 50 మీటర్ల దూరం పరిగెత్తిన చిన్నారిగా పేరు సంపాదించుకుంది. ‘ఫాస్టెస్ట్‌ 50 మీటర్స్‌ రన్‌ బై ఎ టోడ్లర్‌’ విభాగంలో రికార్డు దక్కించుకుంది. తను ఏ విషయాన్ని చెప్పినా ఇట్టే గుర్తుపెట్టుకుంటుందట. మళ్లీమళ్లీ సాధన చేయడానికి చాలా ఇష్టపడుతుందని, అస్సలు విసుగు చెందదని చిన్నారి తల్లిదండ్రులు ఆనందంగా చెబుతున్నారు.

తండ్రి ప్రోత్సాహమే..

తను ఈ రికార్డులు సాధించడానికి వాళ్ల నాన్న ఎలవారసన్‌ ప్రోత్సాహమే కారణమట. ఆయన కూడా వివిధ విభాగాల్లో పలు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సాధించారట. తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటున్న మన నీలశ్రీ చాలా గ్రేట్‌ కదూ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని