ఈ బుడతడు కంపోజర్‌..!

హాయ్‌ నేస్తాలూ..! సంగీతం, పాటలు అనగానే.. అమ్మో! అవన్నీ పెద్దవాళ్లకు సంబంధించినవి మనకు ఎందుకులే అనుకుంటాం.. అసలు పెద్దగా పట్టించుకోము కూడా.. కానీ ఓ బుడతడు మాత్రం చిన్నప్పటి నుంచే పియానో వాయిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు.

Updated : 02 Jan 2024 05:19 IST

హాయ్‌ నేస్తాలూ..! సంగీతం, పాటలు అనగానే.. అమ్మో! అవన్నీ పెద్దవాళ్లకు సంబంధించినవి మనకు ఎందుకులే అనుకుంటాం.. అసలు పెద్దగా పట్టించుకోము కూడా.. కానీ ఓ బుడతడు మాత్రం చిన్నప్పటి నుంచే పియానో వాయిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. మరి తనెవరో.. ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

ష్యాలోని స్టార్వోపోల్‌కు చెందిన ఎలిసేయ్‌ మైసిన్‌కు ప్రస్తుతం పదమూడు సంవత్సరాలు. మూడేళ్ల వయసు అంటే.. అప్పుడు పిల్లలు కనీసం ఒకచోట కుదురుగా కూడా కూర్చోరు. చిన్నచిన్న వేళ్లతో అప్పుడప్పుడే.. ఆట వస్తువులు పట్టుకొని ఆడుకుంటుంటారు. కానీ మన మైసిన్‌ మాత్రం ఆ వయసులో ఉన్నప్పటి నుంచే పియానో నేర్చుకోవడం ప్రారంభించాడట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజమే నేస్తాలూ..! తనకు అయిదేళ్లు ఉన్నప్పుడు మొదటిసారి ఓ టీవీ షోలో ‘బ్లూ బర్డ్‌’ అనే పాటకు పియానో వాయించి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేశాడట.

అక్కతో కలిసి..!

ప్రస్తుతం తను వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఓ మ్యూజిక్‌ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్నాడు. మైసిన్‌ వాళ్ల అక్క లిసా కూడా పియానో వాయిస్తుందట. ఆమె వల్లే తనకు కూడా పియానో వాయించడం ఇష్టంగా మారిందట. ఇంకో విషయం ఏంటంటే.. తను మ్యూజిక్‌ కంపోజ్‌ కూడా చేస్తాడు. ఇంతకు ముందు కొన్ని సినిమాలకు సంగీతం అందించాడట. అక్కాతమ్ముళ్లు ఇద్దరూ కలిసి సినిమాలకు మ్యూజిక్‌ కంపోజ్‌ చేస్తారట. ఇప్పటి వరకు మైసిన్‌ పదుల సంఖ్యలో అవార్డులూ, రివార్డులు పొందాడు. పాల్గొన్న అన్ని పియానో పోటీల్లో దాదాపు మొదటి బహుమతే సాధించాడు. వందల సంఖ్యలో ప్రదర్శనలు ఇచ్చాడు. మ్యూజిక్‌ కాకుండా తనకు ఇంకా విహార యాత్రలు చేస్తూ.. ప్రపంచమంతా చుట్టి రావడం, కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ఇష్టమట. అడ్వెంచర్‌ గేమ్స్‌ కూడా ఎక్కువగా ఆడతాడట. ఎంతైనా మన మైసిన్‌ చాలా గ్రేట్‌ కదూ..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు