చిన్నారి చేతిలో.. పతకాల పంట..!

హాయ్‌ నేస్తాలూ..! కొంచెం ఖాళీ సమయం దొరికితే చాలు.. ఏ ఆట ఆడుకుందామా.. అని చూస్తాం. ఎంత సేపయినా సరే, అలసిపోకుండా ఆడుకుంటూనే ఉంటాం.. అంతే కదా! ‘అయినా.. మేము రోజూ ఆడుకుంటుంటాం కదా!

Updated : 06 Jan 2024 05:41 IST

హాయ్‌ నేస్తాలూ..! కొంచెం ఖాళీ సమయం దొరికితే చాలు.. ఏ ఆట ఆడుకుందామా.. అని చూస్తాం. ఎంత సేపయినా సరే, అలసిపోకుండా ఆడుకుంటూనే ఉంటాం.. అంతే కదా! ‘అయినా.. మేము రోజూ ఆడుకుంటుంటాం కదా! మాకెందుకు చెబుతున్నారు ఈ విషయాలన్నీ’ అనుకుంటున్నారా? ఎందుకంటే ఓ చిన్నారి ఆటతోనే బోలెడు పతకాలు సాధించింది. మరి తనెవరో ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

ర్ణాటకలోని బెంగళూరుకు చెందిన వి.చరిత్రియకు ఆరున్నరేళ్లు. ప్రస్తుతం ఒకటో తరగతి చదువుతోంది. ఈ చిన్నారి రోలర్‌ స్కేటింగ్‌లో ‘నేషనల్‌ యంగెస్ట్‌ ప్లేయర్‌’గా నిలిచింది. తను చిన్న వయసులో ఉన్నప్పటి నుంచే.. స్కేటింగ్‌ నేర్చుకోవడం ప్రారంభించిందట. ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా పాల్లొందట. ‘స్కూల్‌ నుంచి వచ్చిన వెంటనే.. తను ప్రాక్టీస్‌ చేయడం మొదలుపెడుతుంది. చిన్నచిన్న గాయాలు అయినా వాటిని లెక్క చేయకుండా అలాగే ప్రాక్టీస్‌ చేస్తుంది. గెలిచిన పోటీల్లో ఎక్కువగా మొదటి స్థానంలోనే నిలిచింది’ అని చరిత్రియ అమ్మానాన్నలు చెబుతున్నారు.

తక్కువ కాలంలోనే..

ఈ చిన్నారి 2022 నుంచి 2023 సంవత్సరంలో ఎక్కువ మెడల్స్‌ సాధించిన వ్యక్తిగా రికార్డుకెక్కింది. సంవత్సర కాలంలో తను 21 పతకాలు గెలుచుకుంది. అందులో 14 బంగారు, 4 వెండి, 3 రజత పతకాలున్నాయి. ఇంకో విషయం ఏంటంటే.. తను రోలర్‌ స్కేటింగ్‌లోనే కాకుండా మిగతా ఆటల్లో కూడా.. చాలా చురుగ్గా పాల్గొంటుందట. మన చరిత్రియ ప్రతిభను గుర్తించిన ‘ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ వారు ‘మ్యాగ్జిమమ్‌ మెడల్స్‌ విన్‌ బై ఎ కిడ్‌’ విభాగంలో స్థానం కల్పించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలనేదే తన లక్ష్యమని చెబుతున్న ఈ చిన్నారికి మనమూ ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు