ఈ చిన్నారి... నాట్యమయూరి!

ఏడేళ్ల వయసులోనే శాస్త్రీయ నృత్యంపై మక్కువ పెంచుకొంది. ఎంచుకున్న రంగంలో ఉన్నత శిఖరాలకు చేరాలని ముందుకు సాగుతోంది. ఇప్పుడు ఏకంగా రాష్ట్రపతి చేతుల మీదుగా ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్‌’ అందుకోనుంది. హనుమకొండకు చెందిన పెండ్యాల లక్ష్మీప్రియ ఘనతే ఇదంతా! ‘హాయ్‌బుజ్జీ’ ఆమెను పలకరించగా బోలెడు విషయాలు చెప్పింది.

Published : 21 Jan 2024 00:02 IST

ఏడేళ్ల వయసులోనే శాస్త్రీయ నృత్యంపై మక్కువ పెంచుకొంది. ఎంచుకున్న రంగంలో ఉన్నత శిఖరాలకు చేరాలని ముందుకు సాగుతోంది. ఇప్పుడు ఏకంగా రాష్ట్రపతి చేతుల మీదుగా ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్‌’ అందుకోనుంది. హనుమకొండకు చెందిన పెండ్యాల లక్ష్మీప్రియ ఘనతే ఇదంతా! ‘హాయ్‌బుజ్జీ’ ఆమెను పలకరించగా బోలెడు విషయాలు చెప్పింది.

ప్రస్తుతం కాజీపేటలో పదో తరగతి చదువుతున్న.. లక్ష్మీప్రియ స్వస్థలం హనుమకొండ అడ్వకేట్్స కాలనీ. నాన్న రాకేశ్‌ కుమార్‌, అమ్మ సాయిలత. లక్ష్మీప్రియ చిన్నతనం నుంచే శాస్త్రీయ నృత్యంపై ఆసక్తి పెంచుకొంది. సుధీర్‌రావు దగ్గర కూచిపూడి నేర్చుకుంటోంది. గురువుల శిక్షణకు తోడు కళను అమితంగా ఇష్టపడడంతో నృత్యంలో చిన్నతనంలోనే ఎంతో నైపుణ్యం సాధించింది.  హైదరాబాద్‌తోపాటు, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, దిల్లీ తదితర రాష్ట్రాల్లో సుమారు 500కు పైగా ప్రదర్శనలు ఇచ్చి తన ప్రతిభ చాటింది.

ప్రధాని అభినందన..

లక్ష్మీప్రియకు ‘భామాకలాపం’ నృత్యరూపకం అంటే ఎంతో ఇష్టమట. గతేడాది కూడా జాతీయ స్థాయిలో కళా ఉత్సవ్‌ పురస్కారం దక్కింది. దేశవ్యాప్తంగా అన్ని నృత్యరీతుల్లో జరిగిన ఈ పోటీలో రాష్ట్రం తరఫున కూచిపూడిలో లక్ష్మీప్రియ ఎంపికైంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ‘సీసీఆర్టీ’ ఉపకారవేతనం కూడా అందుకుంటోంది. గతేడాది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం లక్ష్మీప్రియను ప్రశంసించారు.‘పరీక్ష పే చర్చా’ కార్యక్రమంలో భాగంగా దిల్లీలో ప్రధాని మోదీ, లక్ష్మీప్రియ నాట్యం చూసి అభినందనలు కురిపించారు.

తెలంగాణ నుంచి...

‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్‌’ను జాతీయ స్థాయిలో ఏడు రంగాల్లో అద్భుతాలు సాధించిన అయిదు నుంచి పద్దెనిమిదేళ్ల పిల్లలకు అందజేస్తారు. ఈసారి దేశవ్యాప్తంగా 19 మందిని ఎంపిక చేశారు. అందులో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక చిన్నారి పెండ్యాల లక్ష్మీప్రియ. కళలు- సంస్కృతి రంగంలో ఈమెకు ఈ పురస్కారం దక్కింది.

సొంతంగా రూపకల్పన

లక్ష్మీప్రియ ప్రస్తుతం శాస్త్రీయ నృత్యంలో పలు ప్రయోగాలు చేసి ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. దివంగత దర్శకుడు కె.విశ్వనాథ్‌కు నివాళిగా ‘స్వర్ణ కమలం అందెల రవమిది’ అనే పేరుతో సొంతంగా నృత్య రీతిని రూపొందించింది. ఓరుగల్లులో కాకతీయులు నిర్మించిన ఆలయాల నేపథ్యంలో సాగే ఈ నృత్యం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది. లక్ష్మీప్రియ ఇటు నాట్యంలో రాణిస్తూనే, అటు చదువుల్లోనూ తన ప్రతిభ చాటుతోంది. పుస్తకాలు చదవడం కూడా తన హాబీ. తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువు చేయూత వల్లే తాను ఈ రంగంలో రాణిస్తున్నానని ఈ చిన్నారి చెబుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మరికొన్ని రోజుల్లోనే ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్‌’ను అందుకోనుంది. మరి మనమూ తనను అభినందిద్దామా!

గుండు పాండురంగశర్మ, ఈనాడు, వరంగల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు