ట్వింకిల్‌.. ట్వింకిల్‌.. షటిల్‌ స్టార్‌!

హాయ్‌ నేస్తాలూ..! రోజూ గేమ్స్‌ ఆడుతున్నారా..?! ఆటలు అంటే.. మీరు రోజూ ఫోన్లో ఆడే క్యాండీక్రష్‌, టెంపుల్‌ రన్‌లాంటివి కాదు. ఎంచక్కా అందరితో కలిసి బయట ఆడుకునేవి. ‘సెల్‌ఫోన్‌లో ఛార్జింగ్‌ అయిపోయినప్పుడు, ఎప్పుడో ఒకసారి ఆడుతుంటాం లే... అయినా.. ఇప్పుడు ఆ గోలెందుకు’ అనుకుంటున్నారా..! మనలాంటి ఓ చిన్నారి చిన్న వయసు నుంచే.. షటిల్‌తో చరిత్ర సృష్టిస్తోంది.

Updated : 25 Jan 2024 05:51 IST

హాయ్‌ నేస్తాలూ..! రోజూ గేమ్స్‌ ఆడుతున్నారా..?! ఆటలు అంటే.. మీరు రోజూ ఫోన్లో ఆడే క్యాండీక్రష్‌, టెంపుల్‌ రన్‌లాంటివి కాదు. ఎంచక్కా అందరితో కలిసి బయట ఆడుకునేవి. ‘సెల్‌ఫోన్‌లో ఛార్జింగ్‌ అయిపోయినప్పుడు, ఎప్పుడో ఒకసారి ఆడుతుంటాం లే... అయినా.. ఇప్పుడు ఆ గోలెందుకు’ అనుకుంటున్నారా..! మనలాంటి ఓ చిన్నారి చిన్న వయసు నుంచే.. షటిల్‌తో చరిత్ర సృష్టిస్తోంది. తన ఆటతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తనెవరో తెలుసుకోవాలని ఉంది కదూ.. అయితే వెంటనే ఈ కథనం చదివేయండి మరి..!

అరుణాచల్‌ప్రదేశ్‌లోని దిబాంగ్‌ వ్యాలీ జిల్లాకు చెందిన జెస్సికా నేయి సారింగ్‌కి ప్రస్తుతం పదకొండు సంవత్సరాలు. తను ఇప్పుడు ఆరో తరగతి చదువుతోంది. ఈ చిన్నారి షటిల్‌ బ్యాడ్మింటన్‌లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. తనకు నాలుగేళ్లు ఉన్నప్పటి నుంచే బ్యాడ్మింటన్‌ నేర్చుకోవడం ప్రారంభించిదట. తన ఆటతో అందరినీ ఆకట్టుకుంటోంది. గత ఏడాది బిహార్‌లో జరిగిన ఆల్‌ ఇండియా సబ్‌- జూనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ అండర్‌-13 విభాగంలో బంగారు పతకం సాధించి జాతీయ గుర్తింపు పొందింది. ఇలా బంగారు పతకం సాధించడం తనకు మొదటిసారి కాదు నేస్తాలూ.. అండర్‌-9, అండర్‌-11 విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో కూడా వరసగా తనే గెలిచి.. ఔరా అనిపించింది. తను పాల్గొన్న పోటీలన్నింటిలో ఎక్కువ బంగారు పతకాలు గెలిచిన చిన్నారిగా రికార్డు దక్కించుకుంది.

ప్రతిభతోనే..

ఈ చిన్నారి ఎన్ని గంటలైనా సరే.. ప్రాక్టీస్‌ చేస్తూనే ఉంటుందట. భారత ప్రభుత్వం ఇటీవల అందించిన ప్రధానమంత్రి జాతీయ బాలల పురస్కారానికి మన జెస్సికా కూడా ఎంపికయ్యింది. ఇది సాంస్కృతిక, క్రీడా, సాహసం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, సామాజిక సేవ వంటి విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన అయిదు నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు అందిస్తారు. ఈ ఏడాది ఈ విభాగాల్లో ఎంపికైన 19మందిలో జెస్సికా కూడా ఉంది. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఇచ్చిన ఈ పురస్కారాన్ని తను క్రీడా విభాగం నుంచి అందుకుంది. జెస్సికా ఇలాగే మరిన్ని అవార్డులు అందుకోవాలని మనమూ ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని