తూర్పు వైపు చూస్తున్నారు..!

ఇంటి కొనుగోలు ఆలస్యమయ్యే కొద్దీ ధరలు సామాన్య, మధ్యతరగతివాసులు అందుకోలేనంతగా పెరిగిపోతున్నాయి. దేశంలోని మిగతా నగరాల్లో ధరల పెరుగుదల చాలా స్పల్పంగా ఉంటే మన దగ్గరే అత్యధికంగా ఉంది. ఇప్పటికే స్థిరాస్తిని కొనుగోలు చేసినవారు ఆరునెలల వ్యవధిలో ధరల వృద్ధి చూసి సంతోషపడుతున్నా.. కొనే ఆలోచనలో ఉన్నవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Updated : 13 Jul 2019 01:42 IST

ఈనాడు, హైదరాబాద్‌

ఇంటి కొనుగోలు ఆలస్యమయ్యే కొద్దీ ధరలు సామాన్య, మధ్యతరగతివాసులు అందుకోలేనంతగా పెరిగిపోతున్నాయి. దేశంలోని మిగతా నగరాల్లో ధరల పెరుగుదల చాలా స్పల్పంగా ఉంటే మన దగ్గరే అత్యధికంగా ఉంది. ఇప్పటికే స్థిరాస్తిని కొనుగోలు చేసినవారు ఆరునెలల వ్యవధిలో ధరల వృద్ధి చూసి సంతోషపడుతున్నా.. కొనే ఆలోచనలో ఉన్నవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిర్మాణదారులను సైతం భూముల ధరలు హడలెత్తిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరంలో అందుబాటు ధరల్లో కొనగలిగే నిర్మాణాలు పెరగడం కొంచెం ఊరట. తూర్పు ప్రాంతంలో ఎక్కువగా ఈ తరహా నిర్మాణాలు జరుగుతున్నాయి.
అందుబాటు ధర అంటే ఆయా వ్యక్తుల ఆదాయాలను బట్టి మారుతోంది. ఇటీవల బడ్జెట్‌లో అందుబాటు ఇళ్ల ధర రూ.45 లక్షలుగా ఆదాయపు పన్ను వడ్డీ రాయితీ సందర్భంగా పేర్కొంది. ఈ ధరల శ్రేణిలో హైదరాబాద్‌ మార్కెట్‌లో ఎక్కువగా చిన్న బిల్డర్లే కడుతున్నారు. బడా సంస్థలు వీటికి ఆమడ దూరంలో ఉంటున్నాయి. ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెన్సీల తాజా నివేదికల ప్రకారం గత ఏడాది తొలి అర్ధ భాగంలో రూ.50 లక్షల లోపు ఇళ్ల ప్రాజెక్ట్‌లు కేవలం 18 శాతమే. ఇందులో రూ.25 లక్షల లోపు లేనేలేవు. ఈ ఏడాది పరిస్థితి చాలా మెరుగైంది. రూ.50 లక్షల లోపు ఇళ్ల ప్రాజెక్ట్‌లు 34శాతానికి పెరిగాయి. రూ.25 లక్షల లోపు 8 శాతం ప్రాజెక్ట్‌లు వచ్చాయి. మొత్తంగా చూస్తే ఈ విభాగంలో ఇళ్లు మూడు రెట్లు పెరిగాయి.

రూ.కోటి లోపు తగ్గాయి..
గేటెడ్‌ కమ్యూనిటీల్లో సకల సౌకర్యాలతో నివసించాలంటే రూ.కోటి వరకు పెట్టాల్సి వస్తోంది. ఇదివరకు రూ.75 లక్షల లోపు దొరికేవి. నగరంలో వ్యవస్తీకృత రంగంలో అత్యధిక ఇళ్లు ఈ విభాగంలో నిర్మాణమవుతున్నాయి.
* రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షల మధ్య గత ఏడాది తొలి అర్ధభాగంలో 23 శాతం ప్రాజెక్ట్‌లు రాగా.. ఈ ఏడాది 7 శాతానికి తగ్గిపోయింది.
* రూ.75 లక్షల నుంచి రూ.కోటి మధ్య గత ఏడాది తొలి అర్థభాగంలో 46 శాతం కొత్త ప్రాజెక్ట్‌లు వస్తే.. ఈసారి అది 35శాతానికి తగ్గిపోయింది.

విలాస గృహాల వైపు..
నగరంలో విలాసవంతమైన ఇళ్ల ప్రాజెక్ట్‌లు ఈ ఏడాది మూడురెట్లు పెరిగాయి. రూ.2కోట్లపైన కట్టే ఇళ్లు గత సంవత్సరం తొలి అర్ధసంవత్సరంలో 3 శాతమే ఉంటే.. ఈసారి 9 శాతానికి పెరిగింది. కోటి రూపాయల నుంచి రూ.2కోట్ల మధ్య 10 నుంచి 8 శాతానికి తగ్గాయి.
* ఐటీ కేంద్రంగా ఉన్న పశ్చిమ హైదరాబాద్‌లోనే 80 శాతం నిర్మాణాలు జరుగుతున్నాయి. కొత్త ప్రాజెక్ట్‌లు ఇక్కడే వస్తున్నాయి.
* పశ్చిమం తర్వాత అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది తూర్పు వైపే. మెట్రో రాకతో రవాణా అనుసంధానం పెరగడంతో గృహ నిర్మాణాలకు ఈ ప్రాంతం అనుకూలంగా మారింది. భవిష్యత్తులో మరిన్ని కొత్త ప్రాజెక్ట్‌లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

పశ్చిమ కంటే తూర్పులో వృద్ధి
ఇళ్లు, భూముల ధరల పెరుగుదల నగరంలో అన్నివైపులా కొనసాగుతోంది.
* అధిక నిర్మాణాలు చేపట్టే ఐటీ ప్రాంతంలో ధరల వృద్ధి 8 నుంచి 9 శాతం మధ్య ఉంది. అందనంత స్థాయిలో ధరలు ఉన్నాయి. రూ.75 లక్షలు-కోటి లోపు ధరల్లో ఎక్కువగా నిర్మాణాలు చేపడుతున్నారు. 1600 నుంచి 1800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎక్కువగా మూడు పడక గదుల ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. పుప్పాలగూడ, గోపన్‌పల్లి, మణికొండ, నార్సింగి, నల్లగండ్లలో కొత్త నిర్మాణాల జోరు ఎక్కువగా ఉంది. ఓఆర్‌ఆర్‌ అనుసంధానం, ఐటీ సంస్థలు చేరువగా ఉండడంతో డిమాండ్‌ ఎక్కువగా ఉంది.
* ఇప్పుడిప్పుడే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌ తూర్పు ప్రాంతంలో ధరల పెరుగుదల ఏకంగా 19 శాతం ఉండటం గమనార్హం. అయినప్పటికీ కొనగలిగే స్థాయిలో ఇక్కడ ధరలు ఉన్నాయి. మాల్స్‌ అందుబాటులోకి వస్తుండటం, మెట్రో అనుసంధానంతో ఈ ప్రాంతంలో ఇళ్లు, విల్లాల ప్రాజెక్ట్‌లు పెరిగాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని