విల్లాలకు డిమాండ్‌

కొవిడ్‌ అనంతరం స్థిరాస్తి కొనుగోలుదారుల ప్రాధాన్యాలు మారాయి. సిద్ధంగా ఉన్న ఫ్లాట్లతో పాటూ వ్యక్తిగత ఇళ్లు, విల్లాలవైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

Published : 14 Nov 2020 02:48 IST

ఈనాడు, హైదరాబాద్‌

కొవిడ్‌ అనంతరం స్థిరాస్తి కొనుగోలుదారుల ప్రాధాన్యాలు మారాయి. సిద్ధంగా ఉన్న ఫ్లాట్లతో పాటూ వ్యక్తిగత ఇళ్లు, విల్లాలవైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.అవుటర్‌ కేంద్రంగా నగరం నలువైపుల 15 ఎకరాల నుంచి 30 ఎకరాల విస్తీర్ణంలోఈ ప్రాజెక్ట్‌లు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో పూర్తైన ఇళ్లతో పాటూ వచ్చే సంవత్సరంలో పూర్తయ్యే నిర్మాణాలు ఉన్నాయి. పటాన్‌చెరు-సంగారెడ్డి, శంకర్‌పల్లి, బెంగళూరు, శ్రీశైలం రహదారి, ఘట్‌కేసర్‌, మేడ్చల్‌, శామీర్‌పేట మార్గాల్లో అందుబాటులో ఉన్నాయి. 150 చదరపు గజాలు మొదలు 500 చ.గజాల విస్తీర్ణంలో వీటిని నిర్మిస్తున్నారు. ప్రాంతం, విస్తీర్ణాన్ని రూ.1.50 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు వీటి ధరలు పలుకుతున్నాయి. సగటు విల్లా ధర రూ.2.5 కోట్లు ఉందని రియల్టర్లు అంటున్నారు.
విశాలంగా ఉండాలని..
పెద్దలు ఇంటి నుంచే పని చేయడం, పిల్లలకు ఆన్‌లైన్‌ పాఠాలతో కుటుంబ సభ్యులందరూ ఎక్కువ సమయం ఇళ్లలోనే ఉంటున్నారు. ఇళ్లు మరింత విశాలంగా ఉంటే బాగుండు అనే భావన కొవిడ్‌ తర్వాత ఎక్కువ మంది వ్యక్తం చేయడంతో పెద్ద ఇళ్లకు డిమాండ్‌ పెరిగింది. మూడు నాలుగు పడక గదుల ఇంటి కోసం చూస్తున్నారు. విశాలమైన ఇళ్లు బడ్జెట్‌లో దొరకాలంటే శివారు ప్రాంతాలకు వెళ్లక తప్పదు. సొంతంగా కట్టుకోవాలంటే విసిరేసినట్లుగా ఉండే నివాసాలతో భద్రత పెద్ద సమస్య. విల్లాలైతే భద్రతకు ఢోకా ఉండదు. ఇంటర్నెట్‌ వంటి సౌకర్యాలకు ఇబ్బంది ఉండదని వీటివైపు మొగ్గుచూపుతున్నారు. నగరంలో వారం మొత్తం ఉన్నా.. వారాంతంలో కుటుంబంతో కలిసి ప్రకృతి నడమ సేద తీరవచ్చని కొందరు మొగ్గుచూపుతున్నారు. పెట్టుబడిగానూ భావిస్తున్నారు. కొన్ని సంవత్సరాల్లోనే ఆ ప్రాంతంలో భూముల ధరలు రెట్టింపు కావడం కూడా అధిక ఆదాయ వర్గాలకు విల్లాలు ఆకర్షణీయంగా మారాయి. కొనుగోలుదారుల అభిరుచులకు తగ్గట్టుగా భిన్న థీమ్‌లతోనూ విల్లా ప్రాజెక్ట్‌లను బిల్డర్లు అభివృద్ధి చేస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని