నెట్‌ జీరో భవనాలు

‘నెట్‌ జీరో’! యూకేలోని గ్లాస్కోలో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సు(కాప్‌26) నేపథ్యంలో బాగా వినిపిస్తున్న పేరు ఇది. వాతావరణంలో కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి తీసుకురావడమే ఈ నినాదం ముఖ్య ఉద్దేశం. వరల్డ్‌ గ్రీన్‌

Updated : 06 Nov 2021 06:05 IST

పెరుగుతున్న హరిత ప్రాజెక్టులు
ఈనాడు, హైదరాబాద్‌

‘నెట్‌ జీరో’! యూకేలోని గ్లాస్కోలో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సు(కాప్‌26) నేపథ్యంలో బాగా వినిపిస్తున్న పేరు ఇది. వాతావరణంలో కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి తీసుకురావడమే ఈ నినాదం ముఖ్య ఉద్దేశం. వరల్డ్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ అధ్యయనం ప్రకారం భవనాల నుంచే 33 శాతం గ్రీన్‌హౌస్‌ వాయువులు వెలువడుతున్నాయి. వీటిని తగ్గించేలా భవన నిర్మాణాల్లో మార్పులు తేవాల్సిన అవసరాన్ని ఈ సదస్సు మరోసారి గుర్తు చేసింది.

దేశంలో హరిత భవనాల నిర్మాణాలకు 2001లో హైదరాబాద్‌లోనే పునాది పడింది. తొలి హరిత భవనంగా సీఐఐ-గోద్రెజ్‌ గ్రీన్‌ బిజినెస్‌ సెంటర్‌ను మాదాపూర్‌లో నిర్మించారు. తర్వాతి కాలంలో ఇదొక జాతీయ ఉద్యమంగా మారింది. ఇదే స్ఫూర్తితో నగరంలోని ఆకాశ హర్మ్యాలు, కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలను పర్యావరణహితంగా నిర్మిస్తున్నారు. నూతన సచివాలయ నిర్మాణంలోనూ ఈ విధానాన్నే అనుసరిస్తున్నారు. పారిశ్రామిక పార్కులు, పాఠశాలలు, వైద్యశాలలు, టౌన్‌షిప్‌ల నిర్మాణ ప్రణాళికలోనూ ఈ సూత్రాన్నే అవలంబిస్తున్నారు. ‘‘ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌(ఐజీబీసీ) వద్ద తెలంగాణకు సంబంధించి ఇప్పటివరకు 460 ప్రాజెక్టులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి భవనాల నిర్మాణంలో మహారాష్ట్ర తర్వాత స్థానం హైదరాబాద్‌ సొంతం చేసుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హరిత భవనాల ప్రాజెక్టుల సంఖ్య 6,400 దాటింది. విస్తీర్ణం ప్రకారం ఇప్పటివరకు 9 బిలియన్‌ చదరపు అడుగులకు చేరుకుంది. 2022 నాటికి 10 బిలియన్‌ చదరపు అడుగులకు చేరుకోవాలనేది లక్ష్యం. దీన్ని చేరుకోవాలంటే మరింతమంది ఈ తరహా నిర్మాణాల దిశగా ముందుకు రావాలని’ ఐజీబీసీ నిపుణులు పేర్కొన్నారు. సలహాలు/సూచనలు అవసరమైన వారు సీఐఐ-గోద్రెజ్‌ గ్రీన్‌ బిజినెస్‌ సెంటర్‌లోని హైదరాబాద్‌ చాప్టర్‌ను సంప్రదించవచ్చన్నారు.

ఎలా నిర్మించాలంటే

హరిత భవనాల్లో విద్యుత్తు వినియోగం తక్కువగా ఉండాలి. ఇల్లు/కార్యాలయం ఏదైనా పగటిపూట సహజసిద్ధ వెలుతురు వచ్చేలా, విద్యుత్తు వాడకం పరిమితంగా ఉండేలా చూసుకోవాలి. తద్వారా 30-40 శాతం వరకు విద్యుత్తు ఆదా కావాలి.

ఇంట్లోకి వెలుతురే తప్ప, వేడి రాకూడదు. ప్రస్తుతం ఇందుకు భిన్నంగా జరుగుతుండటంతో బహుళ అంతస్తుల భవనాలు/కార్యాలయాల్లో ఏసీ వినియోగం ఎక్కువైంది. దీన్ని నివారిస్తే ఏసీల వాడకం, తద్వారా విద్యుత్తు వినియోగం గణనీయంగా తగ్గుతుంది. 

భవనాల్లో 20 నుంచి 30 శాతం నీటిని ఆదాచేసే పరికరాలు వాడాలి. వాడిన నీటిలో 70 శాతం తిరిగి వినియోగించుకునేలా శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలి.  

నిర్మాణంలో వ్యర్థాలను తగ్గించాలి. ఐజీబీసీ గుర్తింపు పొందిన నిర్మాణ సామగ్రి వినియోగంతో ఇది సాధ్యం.

హరిత భవనాల్లో నెట్‌ జీరోలకు ప్రత్యేకత ఉంది. ఒక భవనం/కమ్యూనిటీ ఇలా ఏదైనా వారికి కావాల్సిన విద్యుత్తు నుంచి నీటి వినియోగం వరకు గ్రిడ్‌పై ఆధారపడకూడదు. అక్కడే సౌర/పవన విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవాలి. వర్షపు నీటిని ఒడిసిపట్టి ఉపయోగించుకోవాలి. వినియోగించే మొత్తం నీటిని భూమిలోకి ఇంకేలా చూడాలి. నగర శివారులో ఈ తరహా కమ్యూనిటీలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే జిల్లాల్లోనూ వస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని