కొనేముందు ఏం చూస్తున్నారంటే..
ఫ్లాట్, విల్లా సొంతం చేసుకునే ముందు కొనుగోలుదారులు ఏం చూస్తున్నారు? వేటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు? గతానికీ.. ఇప్పటికీ.. కొనుగోలుదారుల ఆలోచనల్లో ఏమైనా మార్పులు వచ్చాయా?
ఈనాడు, హైదరాబాద్ : ఫ్లాట్, విల్లా సొంతం చేసుకునే ముందు కొనుగోలుదారులు ఏం చూస్తున్నారు? వేటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు? గతానికీ.. ఇప్పటికీ.. కొనుగోలుదారుల ఆలోచనల్లో ఏమైనా మార్పులు వచ్చాయా? వీరు ఆశించిన సౌకర్యాలున్నా స్థిరాస్తుల లభ్యత ఎలా ఉంది? నరెడ్కో, హౌసింగ్ రీసెర్చ్ చేపట్టిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
1 ఆరోగ్యానికి పెద్దపీట
నగరాల్లో ఇల్లు కొనేటప్పుడు నేటి తరం చుట్టుపక్కల ఆరోగ్య సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది ప్రధానంగా చూస్తున్నారు. అత్యవసరంలో ఎంత సమయంలో ఆసుపత్రికి చేరుకోవచ్చు? ఎంత సమీపంలో వైద్య సదుపాయాలు ఉన్నాయనేది ఆరా తీస్తున్నారు. ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ల ఆరోగ్య అవసరాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. తమ మొదటి ప్రాధాన్యత ఇదే అంటున్నారు.
2 క్రీడా మైదానాలు.. ఖాళీ స్థలాలు
ఇల్లు విశాలంగా ఉండటమే కాదు.. కమ్యూనిటీలో సకల సౌకర్యాలు ఉండాలనేది నేటి కొనుగోలుదారుల మాట. పిల్లల కోసం క్రీడా సదుపాయాలు, పెద్దలకు క్లబ్‌హౌస్, జిమ్, ఈతకొలను వంటి సదుపాయాలు ఉండాలని కోరుకుంటున్నారు. అన్నింటికి మించి ఎక్కువ ఖాళీ స్థలం వదిలి.. పచ్చదనం అధికంగా ఉంటే ఇష్టపడుతున్నారు.
3. పిల్లల ఆలనాపాలనా
చిన్న కుటుంబాల నేపథ్యంలో పిల్లల ఆలనాపాలనా చూసే డే కేర్ సౌకర్యాలు ఉండాలని గృహ కొనుగోలుదారులు చూస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ కార్యాలయాలకు వెళితే పిల్లల్ని చూసుకోవడం కష్టం అవుతోంది. ఇంటి నుంచి పనిచేస్తున్నా పిల్లలపై శ్రద్ధ పెట్టలేని పరిస్థితి. కాబట్టి కమ్యూనిటీలో డే కేర్ సదుపాయాలు ఉండాలని కోరుకుంటున్నారు.
4 కార్యాలయానికి చేరువలో
ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు పని ప్రదేశానికి ఎంతదూరంలో ఉంది అనేది ప్రధానంగా చూస్తున్నారు. నగరాల్లో ట్రాఫిక్‌లోనే అధిక సమయం వృథా అవుతోంది. వీటి అనుభవాలతో కార్యాలయానికి దగ్గరలో సొంతింటి కోసం అన్వేషిస్తున్నారు.
5 వినోద కేంద్రాలు
వారాంతాల్లో కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు అనువైన వినోద కేంద్రాలు, ఆహారశాలలు ఉన్నాయా? లేవా? అనేది కూడా చూస్తున్నారు. ఇవన్నీ ఉన్న ప్రాంతాల్లో కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు.
6 సిటీకి కాస్త దూరంగా
నగరంలోని ప్రధాన కేంద్రంలో కాకుండా బయట కాస్త దూరంగా ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సర్వేలో వెల్లడైంది. కొత్తగా అభివృద్ధి చెందిన, చెందుతున్న ప్రాంతాలపై మొగ్గు చూపిస్తున్నారు.
కొనుగోలుదారుల ఆలోచనలకు తగ్గట్టుగా నిర్మాణాలు
కొనుగోలుదారుల అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా నిర్మాణ ప్రాజెక్టుల్లో బిల్డర్లు ఎప్పటికప్పుడు మార్పులు చేపడుతున్నారు. అవసరమైన కొత్త సదుపాయాలను చేరుస్తున్నారు. వాటి ఆధారంగా ప్రాధాన్య అంశాలు గుర్తించి వాటికి పెద్దపీట వేస్తున్నారు. సహజంగా ఇవన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీల్లోనే కల్పిస్తుండటంతో వాటిల్లో కొనుగోలుకు ఇష్టపడుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.