కొత్తవే కాదు.. పాతవీ చూస్తున్నారు

సొంతింటి కల సాకారం కావాలంటే ఎంతో వ్యయ, ప్రయాసలు పడాల్సిన పరిస్థితి. నగరంలో భూములకే కాదు.. ఫ్లాట్‌లు, విల్లాలు ఇలా ఏవి చూసినా ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు.

Published : 30 Sep 2023 01:58 IST

ఈనాడు - హైదరాబాద్‌ : సొంతింటి కల సాకారం కావాలంటే ఎంతో వ్యయ, ప్రయాసలు పడాల్సిన పరిస్థితి. నగరంలో భూములకే కాదు.. ఫ్లాట్‌లు, విల్లాలు ఇలా ఏవి చూసినా ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. గతంలో నగర శివార్లకు వెళ్తే తక్కువ ధరకు దొరికేవి. ఇప్పుడు శివార్లలోనే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. విశాలమైన రహదారులు కొత్త ప్రపంచాన్ని చూపిస్తున్నాయి. తదనుగుణంగానే అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. 2వేల చదరపు అడుగులు ఉన్న అపార్టుమెంటు.. గేటెడ్‌ కమ్యూనిటీలో అయితే రూ.2 కోట్లపైనే ఉంటోంది. దూరం వెళ్లి విల్లానే కొనుక్కుందామని ఆలోచన చేస్తే.. మౌలిక వసతులున్న చోట రూ.3 కోట్ల లోపు ఏవీ దొరకట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాము ఉంటున్న ప్రాంతాల్లో అపార్టుమెంట్లలో పాత ఫ్లాట్ల వైపు కొనుగోలుదారులు చూస్తున్నారు.

నాణ్యమైనవి ఉంటే.. : ఎక్కడో నగర శివార్లలో ఇల్లు కొనుక్కొని.. నగరంలో ఉండే కార్యాలయాలకు రావడం కూడా కష్టమే. ఐటీ ఉద్యోగులైతే ఆయా సంస్థలు నగర శివార్లలోనే ఉన్నాయి కనుక కాస్త వెసులుబాటుగా ఉంటుంది. పని చేసే ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఇళ్లను ఎంపిక చేసుకోవడం ఎంతో ఉత్తమమని అనుభవజ్ఞులు చెబుతున్నారు. అందుకే పాత ఇళ్ల వైపు చాలామంది చూస్తున్నారు. వీటిని కొనేటప్పుడు నిర్మాణ నాణ్యత ఎలా ఉంది అనేది చూడాలి. సెల్లారులోకి నీరు చేరుతుందా? వరద ముంచెత్తుతోందా.. గోడలు తడిగా మారుతున్నాయా.. గోడలకు పగుళ్లు వచ్చాయా.. ఇలా అన్నీ పరీక్షించుకోవాలని నిర్మాణ రంగ నిపుణులు సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని