ఫలూదా... పసందుగా..!

సాయంత్రం వేళ కాఫీ లేదా టీలు తాగే కాలం కాదిది. ఎండలు మండే ఈ సమయంలో పిల్లల నుంచీ పెద్దవాళ్ల దాకా అందరం చల్లని పదార్థాలే కోరుకోవడం సహజం. అలాగని తరచూ ఐస్‌క్రీమో, కుల్ఫీనో తినలేంగా ...

Updated : 22 Nov 2022 21:18 IST

సాయంత్రం వేళ కాఫీ లేదా టీలు తాగే కాలం కాదిది. ఎండలు మండే ఈ సమయంలో పిల్లల నుంచీ పెద్దవాళ్ల దాకా అందరం చల్లని పదార్థాలే కోరుకోవడం సహజం. అలాగని తరచూ ఐస్‌క్రీమో, కుల్ఫీనో తినలేంగా... అందుకే కాస్త రూటు మార్చి ఐస్‌క్రీమ్‌ వాడుతూ ఫలూదా రుచుల్ని చేసేద్దామా.

రోజ్‌ సిరప్‌తో..

కావలసినవి: కాచి చల్లార్చిన పాలు: రెండు కప్పులు, సబ్జా గింజలు: రెండు చెంచాలు (అరగంట ముందు నానబెట్టుకోవాలి), ఉడికించిన సేమియా: పావుకప్పు, రోజ్‌ సిరప్‌: మూడు టేబుల్‌స్పూన్లు, ఐస్‌క్రీమ్‌: రెండు చెంచాలు, డ్రైఫ్రూట్స్‌
పలుకులు: పావుకప్పు.
తయారీ విధానం: ముందుగా పాలల్లో రోజ్‌ సిరప్‌ కలిపి పెట్టుకోవాలి. నాలుగు గ్లాసులు తీసుకుని... వాటిల్లో పావువంతు పాలు పోసి, చెంచా చొప్పున సబ్జా గింజలు, దానిపైన సేమియా వేయాలి. ఇలా ఒకదాని తరువాత మరొకటి
నాలుగైదు వరసలు వేసుకుని, అన్నింటినీ ముప్పావుగంటసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తరువాత బయటకు తీసి, వాటిపైన కొద్దిగా ఐస్‌క్రీమ్‌, డ్రైఫ్రూట్స్‌ పలుకులూ అలంకరించుకుంటే సరి.


పండ్ల ముక్కలతో..

కావలసినవి: అరటి, ఆపిల్‌, మామిడి, పైనాపిల్‌, స్ట్రాబెర్రీ, ద్రాక్ష ముక్కలు: అన్నీ కలిపి కప్పు (ఫ్రిజ్‌లో పెట్టాలి), ఉడికించిన సేమియా: పావుకప్పు, సబ్జా గింజలు: రెండు చెంచాలు (అరగంట ముందు నానబెట్టుకోవాలి), కాచి చల్లార్చిన పాలు: రెండు కప్పులు, రోజ్‌ సిరప్‌: పావుకప్పు, చక్కెర: పావుకప్పు, ఐస్‌క్రీమ్‌: నాలుగు చెంచాలు, డ్రైఫ్రూట్స్‌ పలుకులు: పావుకప్పు.
తయారీ విధానం: పాలల్లో చక్కెర కలిపి ఓ అరగంటసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. నాలుగు గ్లాసులు తీసుకుని వాటిల్లో ముందుగా కొన్ని పండ్లముక్కలు వేయాలి. తరువాత చెంచా చొప్పున రోజ్‌ సిరప్‌, సబ్జా గింజలు, సేమియా ఒకదాని
తరువాత మరొకటి వేయాలి. వీటిపైన మళ్లీ కొన్ని పండ్లముక్కలు వేసి, అరకప్పు చొప్పున పాలు పోయాలి. ఈ గ్లాసుల్ని ముప్పావుగంటసేపు ఫ్రిజ్‌లో పెట్టి తరువాత బయటకు తీసి, చివరగా చెంచా చొప్పున వెనీలా ఐస్‌క్రీమ్‌ వేసి, డ్రైఫ్రూట్స్‌
పలుకులతో అలంకరించాలి.


మామిడితో..

కావలసినవి: సబ్జా గింజలు: పావుచెంచా (అరగంట ముందు నీళ్లలో నానబెట్టుకోవాలి), ఉడికించిన సేమియా: అరకప్పు, కాచి చల్లార్చిన ఫుల్‌క్రీం మిల్క్‌: ఒకటిన్నర కప్పు,  మామిడిపండు ముక్కలు: అరకప్పు, రోజ్‌ సిరప్‌: అరకప్పు, మామిడిపండు గుజ్జు: అరకప్పు, మ్యాంగో ఐస్‌క్రీమ్‌: నాలుగు చెంచాలు, జీడిపప్పు, బాదం, పిస్తా పలుకులు: అన్నీ కలిపి పావుకప్పు.
తయారీ విధానం: లుగు గ్లాసులు తీసుకుని వాటిల్లో ముందుగా సబ్జా గింజలు, ఉడికించిన సేమియా సమానంగా వేసుకోవాలి. వీటిపైన మామిడి ముక్కలు ఉంచి, రెండుచెంచాల చొప్పున రోజ్‌ సిరప్‌ వేసుకోవాలి. ఇప్పుడు అన్నింట్లో సమానంగా మామిడిపండు గుజ్జు వేసి పైన చల్లని పాలుపోసి ముప్పావుగంటసేపు ఫ్రిజ్‌లో పెట్టి బయటకు తీయాలి. చివరగా వీటిపైన మ్యాంగో ఐస్‌క్రీమ్‌, డ్రైఫ్రూట్స్‌ పలుకులు వేసుకుంటే మ్యాంగో ఫలూదా రెడీ.


చాక్లెట్‌తో..

కావలసినవి: ఉడికించిన సేమియా: పావుకప్పు, సబ్జా గింజలు: టేబుల్‌స్పూను (అరగంట ముందు నీళ్లలో నానబెట్టుకోవాలి), చాక్లెట్‌పొడి: పావుకప్పు, కాచి చల్లార్చిన పాలు: రెండు కప్పులు, కరిగించిన చాక్లెట్‌ సిరప్‌: అరకప్పు, చక్కెర: పావుకప్పు, కార్న్‌ఫ్లేక్స్‌: అరకప్పు, డ్రైఫ్రూట్స్‌ పలుకులు: పావుకప్పు, ఐస్‌క్రీమ్‌: అరకప్పు.
తయారీ విధానం: పాలూ, చాక్లెట్‌పొడీ, చక్కెర ఓ గిన్నెలోకి తీసుకుని అన్నింటినీ కలుపుకోవాలి. నాలుగు గ్లాసులు తీసుకుని వాటిల్లో చెంచా చొప్పున చాక్లెట్‌ సిరప్‌ వేయాలి. ఇప్పుడు అన్ని గ్లాసుల్లో సమానంగా సేమియా, నానబెట్టిన సబ్జా గింజలు, కొన్ని కార్న్‌ఫ్లేక్స్‌, డ్రైఫ్రూట్స్‌ పలుకులు ఒకదాని తరువాత మరొకటి వేసుకోవాలి. వీటిపైన చాక్లెట్‌ పాలు పోసి, ఐస్‌క్రీమ్‌ ఉంచి, మిగిలిన చాక్లెట్‌ సిరప్‌ పైన వేసుకుని తింటే రుచి అదిరిపోతుంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని