ఈ బాంబులు తినండి!

ఇవి మొలకలు కాదు... అలాని మొక్కలూ కాదు! విత్తనాలు వేసిన తర్వాత వచ్చే తొలి ఆకులు ఉంటాయి కదా.. అవే! వాటినే మైక్రోగ్రీన్స్‌ అంటారు. మనకు తెలిసిన చక్కని ఉదాహరణ... బేబీ మెంతికూర. మెంతికూరలాగానే ముల్లంగి, తోటకూర, స్వీట్‌కార్న్‌, వేరుసెనగ, ఆవాలు, ధనియాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు..

Published : 23 Jun 2019 00:23 IST

మైక్రోగ్రీన్స్‌
రుచి పేలిపోవాలి!

ఇవి మొలకలు కాదు... అలాని మొక్కలూ కాదు! విత్తనాలు వేసిన తర్వాత వచ్చే తొలి ఆకులు ఉంటాయి కదా.. అవే! వాటినే మైక్రోగ్రీన్స్‌ అంటారు. మనకు తెలిసిన చక్కని ఉదాహరణ... బేబీ మెంతికూర. మెంతికూరలాగానే ముల్లంగి, తోటకూర, స్వీట్‌కార్న్‌, వేరుసెనగ, ఆవాలు, ధనియాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు.. వీటి నుంచి కూడా మైక్రోగ్రీన్స్‌ని తయారుచేసుకోవచ్చు. వీటిని ఆధునిక పాకశాస్త్రంలో ‘న్యూట్రిషన్‌ బాంబ్స్‌’ అంటున్నారు. అంతగా పోషకాలుంటాయన్నమాట వీటిల్లో! మనం వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పనికిరాని ప్లాస్టిక్‌ పాత్రల్లో మట్టి నింపి గుప్పెడు ఆవాలో, గోధుమలో చల్లితే చాలు. నాలుగైదు రోజులకల్లా చక్కని మొక్కలు గుబురుగా వచ్చేస్తాయి. శుభ్రమైన కత్తెరతో వాటిని కత్తిరించుకుని కూరల్లో, సూపుల్లో, పిజాలపై తాజాగా చల్లుకోవడమే.

మైక్రోగ్రీన్స్‌ కిచిడీ

కావాల్సినవి: బియ్యం- అరకప్పు, పెసరపప్పు- పావుకప్పు, పచ్చిమిర్చి- మూడు, పసుపు- తగినంత, ఉల్లిపాయ ముక్కలు- రెండు చెంచాలు, టమాటా ముక్కలు- రెండు చెంచాలు, అల్లం తురుము- రెండు చెంచాలు, కొత్తిమీర తరుగు- రెండు చెంచాలు, జీలకర్ర- పావుచెంచా, కారం- పావుచెంచా, ధనియాలపొడి- చెంచా, నెయ్యి- రెండు చెంచాలు, క్యారట్‌ ముక్కలు- రెండు చెంచాలు, ఫ్రెంచ్‌బీన్స్‌ ముక్కలు- రెండు చెంచాలు, మైక్రోగ్రీన్స్‌(పల్లీలు, తోటకూర, ఆవాలు), ఉప్పు- తగినంత 
తయారీ: ముందుగా బియ్యం, పప్పులని అరగంటపాటు నానబెట్టుకోవాలి. తగినంత ఉప్పు, పసుపు వేసి బియ్యాన్ని తక్కువ మంట మీద మెత్తగా ఉడికించుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నాన్‌స్టిక్‌పాన్‌లో నెయ్యివేసి వేడి చేసుకుని అల్లం తురుము, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ధనియాలపొడి వేసి వేయించుకోవాలి. చివరిగా టమాటా ముక్కలు, కారం కూడా వేసి ఉడికిన తర్వాత పొయ్యి కట్టేయాలి. ఇప్పుడు మరొక పాత్రలో కాస్త నెయ్యి, జీలకర్ర వేసి కాయగూరముక్కలు వేయించుకోవాలి. అవి కూడా పూర్తిగా వేగాక ముందుగా చేసి పెట్టుకున్న టమాటా కారం వేసి వేయించి.. అన్నం, పప్పు మిశ్రమం వేసుకోవాలి. చివరిగా శుభ్రం చేసి పెట్టుకున్న మైక్రోగ్రీన్స్‌ వేసి మూతపెట్టి ఐదు నిమిషాలపాటు మగ్గనిచ్చి దింపుకోవాలి. 

స్వీట్‌కార్న్‌ సూప్‌లో

కావాల్సినవి: స్వీట్‌కార్న్‌ గింజలు- రెండు కప్పులు, నూనె- రెండు చెంచాలు (ఆలివ్‌ అయితే మంచిది), బటర్‌- చెంచా, ఉల్లిపాయ- ఒకటి, ఉల్లికాడ- ఒకటి, సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు- అరచెంచా, ఉప్పు, మిరియాలపొడి- తగినంత, కాయగూరలు ఉడికించిన నీళ్లు- మూడు కప్పులు, క్రీం- అరకప్పు, మైక్రోగ్రీన్స్‌(ఆవ, మెంతి, ముల్లంగి, ఎర్రతోటకూర...)- రెండు చెంచాలు, పచ్చిమిర్చి- నాలుగు
తయారీ: మందపాటి పాత్రలో బటర్‌, నూనెలు వేసి చిన్న సెగమీద వేడి చేసుకుని... ఉల్లిపాయ ముక్కలు, తరిగిన ఉల్లికాడ ముక్కలు వేసి ముదురు గోధుమరంగులోకి వచ్చేంతవరకూ వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, స్వీట్‌కార్న్‌ గింజలు వేసి మరో ఐదునిమిషాల పాటు వేయించుకుని ఉప్పు, మిరియాలపొడి వేసుకోవాలి. వాటిని బాగా కలిపిన తర్వాత కాయగూరలు ఉడికించిన నీళ్లు వేసుకుని తక్కువ మంటపైన పది నిమిషాలపాటు ఉడికించుకోవాలి. దాన్ని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ సూప్‌ని వడకట్టుకుని చివరిగా క్రీం వేసి తక్కువ మంట మీద ఉంచి దీనిపై మైక్రోగ్రీన్స్‌ని చల్లి మూడు నిమిషాల తర్వాత దింపేయాలి. 

బేబీ మెంతికూర చికెన్‌

కావాల్సినవి: బేబీ మెంతికూర కట్ట- ఒకటి, చికెన్‌- 600గ్రా, ఉల్లిపాయలు- రెండు, టమాటా- ఒకటి(గుజ్జు చేసుకోవాలి), అల్లంవెల్లుల్లిముద్ద- చెంచా, పెరుగు- పావుకప్పు, పసుపు- తగినంత, కారం- చెంచా, జీలకర్రపొడి- అరచెంచా, ధనియాలపొడి- అరచెంచా, గరంమసాలా- అరచెంచా, లవంగాలు- మూడు, దాల్చినచెక్క- చిన్నముక్క, జీడిపప్పులు- ఐదు(నానబెట్టి రుబ్బి పెట్టుకోవాలి), ఉప్పు, నూనె- తగినంత 
తయారీ: అడుగు మందంగా ఉన్న కడాయిలో నూనె పోసి వేడెక్కాక.. ఉల్లిపాయ ముక్కలని దోరగా వేయించి స్టౌ కట్టేయాలి. చల్లారిన తర్వాత పెరుగుతో కలిపి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మరో పాత్ర తీసుకుని చెంచా నూనె వేసుకుని మెంతికూరని పైపైన వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసుకుని అందులో లవంగాలు, దాల్చినచెక్క వేసి వేయించి.. అందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న పెరుగు, ఉల్లిపాయ ముద్ద.. టమాటా గుజ్జు వేసుకోవాలి. అవి ఉడికిన తర్వాత కారం, పసుపు, జీలకర్రపొడి, ఉప్పు, ధనియాలపొడి, అల్లంవెల్లుల్లి ముద్ద కూడా వేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత చికెన్‌ వేసి కూరని దాదాపుగా ఉడికిపోనివ్వాలి. చివరిగా జీడిపప్పు పేస్ట్‌, వేయించిన బేబీ మెంతికూర, గరంమసాలా వేసి కూరని మరో పది నిమిషాలపాటు ఉడికించుకుని దింపుకోవాలి. 
అలంకరణగా: మొదట్లో మైక్రోగ్రీన్స్‌ని అలంకరణలో భాగంగా మాత్రమే వాడేవారు. తర్వాతర్వాత అదే ప్రధాన ఆహారంగా మారింది. నేరుగా తినలేం అనుకునేవారు సూప్స్‌, సలాడ్స్‌, శాండ్‌విచ్‌, పిజా, పాస్తాలతో కలుపుకొంటే కావాల్సిన పోషకాలని అందుకోవచ్చు. మామూలు ఆకుకూరలతో పోలిస్తే వీటిల్లో 40 శాతం అధిక పోషకాలుంటాయి.
పోషకాలు : వీటిల్లో యాంటీఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి. కళ్లు, చర్మం, జుట్టుని ఆరోగ్యంగా ఉంచే.. విటమిన్‌ సి, కె, ఇలు అధికంగా ఉంటాయి.

ఆమ్లెట్‌

కావాల్సినవి: బటర్‌- చెంచా లేదా నూనె- తగినంత, గుడ్లు- మూడు, మైక్రోగ్రీన్స్‌- పావుకప్పు, ఉప్పు, మిరియాలపొడి- రుచికి తగినంత, కారం- పావుచెంచా
తయారీ: సగం మైక్రోగ్రీన్స్‌ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు గుడ్లలోని సొన, ఉప్పు, మిరియాలపొడి, తరిగిన మైక్రోగ్రీన్స్‌, కారం వేసి ఆ మిశ్రమాన్ని బాగా నురగ వచ్చేంతవరకూ ఫోర్క్‌తో గిలక్కొట్టుకోవాలి. పాన్‌లో బటర్‌ లేదా నూనె వేసి సన్నసెగమీద వేడిచేసుకుని అందులో గుడ్డు మిశ్రమాన్ని అట్టులా పోసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత అట్టు తిరగేసుకుని అందులో మైక్రోగ్రీన్స్‌ వేసుకుని అట్టుని మడిచిపెట్టాలి. ఇప్పుడు రెండువైపులా కాల్చుకోవాలి.
పక్కదేశంపై బాంబులేస్తే యుద్ధం దీపావళికి బాంబులు పేలిస్తే సంబురం న్యూట్రిషన్‌ బాంబులు వేస్తే... రుచి పేలిపోద్దంతే! నేల చీల్చుకొని అప్పుడే విచ్చుకున్న లేలేత మొలకలే ఈ న్యూట్రిషన్‌ బాంబులు. మైక్రోగ్రీన్స్‌గా మార్కెట్‌లో దొరుకుతున్న రకరకాల చిగుళ్లు.. పోషకాల లోగిళ్లుగా పేరు మూటగట్టుకున్నాయి. కొత్తిమీర చిగురు, చిన్న మెంతి, ఉల్లి మొలకలు, మరెన్నో.. తాము అలంకార ప్రాయం కాదని.. ఆరోగ్యానికి అత్యవసరాలమని నిరూపించుకుంటున్నాయి. ఎందుకు ఆలస్యం మైక్రోగ్రీన్స్‌ వెరైటీలు ట్రై చేసేయండి..

ఇలా పెంచుకోవాలి 

* ఆవాలు, మెంతులు, పొద్దు తిరుగుడు, ముల్లంగి, ఎర్ర తోటకూర, గోధుమలు, బీట్‌రూట్‌, ఉల్లి, కొత్తిమీర, క్యారెట్‌, పాలకూర, వేరుసెనగ, వెల్లుల్లి వంటివాటి లేత మొలకలని మైక్రోగ్రీన్స్‌గా ఉపయోగించుకోవచ్చు. 
* మట్టి అవసరం లేకుండా కూడా వీటిని పెంచుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ‘స్ప్రౌటింగ్‌ పాడ్స్‌’ అని దొరుకుతాయి. వాటిల్లో కాసిని విత్తనాలు వేసి నీళ్లు చల్లితే సరి. మీకు కావాల్సిన మైక్రోగ్రీన్స్‌ సిద్ధమవుతాయి.
* కోకోపీట్‌, ఆర్గానిక్‌ కంపోస్ట్‌(ఆకులని కుళ్లబెట్టి తయారుచేసిన ఎరువు), మట్టి కలిసిన మిశ్రమం మైక్రోగ్రీన్స్‌ని పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
* విత్తనాలని మరీ దగ్గరగా చల్లుకోకూడదు. సరిగా గాలి తగలక మొక్కలు కుళ్లిపోవడం, ఫంగస్‌ విస్తరించడం జరుగుతాయి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని