రజ ప్రభ ప్రత్యేకం..

‘ఆలో బౌల ఆ, పోడా పిటా ఖై, సజబాజా హౌ డోలీ రే ఝూలీబా ఆ...’ (రారండోయ్‌ అమ్మాయిలూ...పొడాపిటా తిందాం. కొత్త దుస్తులు కట్టుకుని ఊయల మీద ఆడదాం)అంటూ ఒరియాలో సాగే ఈ పాట మిథున సంక్రాంతి వేళ చేసుకునే పొడా పితా ప్రత్యేకతను చెప్పకనే చెబుతోంది.

Published : 25 Jun 2023 00:44 IST

‘ఆలో బౌల ఆ, పోడా పిటా ఖై, సజబాజా హౌ డోలీ రే ఝూలీబా ఆ...’ (రారండోయ్‌ అమ్మాయిలూ...పొడాపిటా తిందాం. కొత్త దుస్తులు కట్టుకుని ఊయల మీద ఆడదాం)అంటూ ఒరియాలో సాగే ఈ పాట మిథున సంక్రాంతి వేళ చేసుకునే పొడా పితా ప్రత్యేకతను చెప్పకనే చెబుతోంది. ఉత్కళ రాష్ట్ర పండగలు జగన్నాథ సంస్కృతితో ముడిపడి ఉంటాయి. ఆషాఢంలో రథయాత్రకు ముందుగా మహిళలకు ప్రత్యేకమైన మూడు రోజుల పండగ ‘రజా/రజ ప్రభ/ రొజ్జొ’ (మిథున) సంక్రాంతి. 12 రాశుల్లో సంచరించే ఆదిత్యుడు మిథునరాశిలో ప్రవేశించే సమయంలో వచ్చే పండగ ఇది.  ప్రతి సంవత్సరం జూన్‌ నెలలో మూడు రోజుల పాటు జరిగే ఈ వేడకను ఒడిశా మహిళలు ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకొంటారు. పుడమితల్లి (మహాలక్ష్మీ) అభ్యంగన స్నానం చేస్తుందని సంబరంగా చెబుతారు. ఈ పండుగ రోజున చేసే ప్రత్యేక వంటకాల్లో ‘పొడా పిటా’ ఒకటి. ఈ సిగ్నేచర్‌ వంటకం.. ఒడియా సంస్కృతిలో భాగం కావడంతో ప్రతి ఇంట్లోనూ దీన్ని తప్పక వండుతారు. రథయాత్ర గుడించా ఆలయం నుంచి పూరీలోని జగన్నాథ్‌ ఆలయంలోకి తిరుగు ప్రయాణంలో మౌసిమా ఆలయంలో జగ్ననాథుడూ, ఆయన తోబుట్టువులకు ఇది వడ్డిస్తారు. బియ్యం, మినపప్పు, బెల్లం, కొబ్బరితో తయారు చేసే ఈ రొట్టె ఎంతో రుచికరం, ఆరోగ్యం కూడా.

ఎలా చేస్తారంటే...

కావాల్సినవి: బియ్యం - కప్పు, మినపప్పు- ముప్పావు కప్పు, బెల్లం- కప్పు, కొబ్బరి తురుము - కప్పు, సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు -పావు కప్పు, అల్లం- చిన్న ముక్క, యాలకుల పొడి- అర చెంచా, మిరియాల పొడి- అరచెంచా, నెయ్యి- మూడు నాలుగు పెద్ద చెంచాలు, ఉప్పు- తగినంత, జీడిపప్పులు- 2 చెంచాలు
తయారీ: బియ్యం, మినపప్పులను వేర్వేరు గిన్నెల్లో సుమారు నాలుగు గంటలు నానబెట్టండి. వాటిని బాగా కడిగాక... విడివిడిగా రుబ్బుకోండి. ఆపై రెండింటినీ కలిపి కొబ్బరి ముక్కలు, అల్లం, ఉప్పు, బెల్లం, సగం జీడిపప్పు, మిరియాలు, యాలకుల పొడిని బాగా కలిపి రెండు గంటల పాటు పులిసేలా పక్కన పెట్టండి. ఆపై కుక్కర్‌ వేడి చేసి దానిలో నెయ్యిరాసి పిండిని వేయండి. విజిల్‌ పెట్టకుండా పెద్ద మంట మీద ఉడికిస్తే సరి. వేడి పొడా పిటా సిద్ధమవుతుంది. దీన్ని కావాల్సిన ఆకృతుల్లో కట్‌ చేసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని