చిరుధాన్యాలతో చిరుతిళ్లు

చాలామంది చిరుధాన్యాలను అన్నంలా వండుకుని తినడం చూస్తూనే ఉంటాం. కానీ వాటితోనూ రకరకాల వంటకాలను వండుకోవచ్చు... ఇలా.

Published : 24 Jun 2021 20:28 IST

చాలామంది చిరుధాన్యాలను అన్నంలా వండుకుని తినడం చూస్తూనే ఉంటాం. కానీ వాటితోనూ రకరకాల వంటకాలను వండుకోవచ్చు... ఇలా.


దోశ

కావలసినవి
సామలు: మూడుకప్పులు, మినప్పప్పు: కప్పు, మెంతులు: పావుచెంచా, అటుకులు: రెండు చెంచాలు, ఉప్పు: తగినంత, నూనె: అరకప్పు.

తయారీ విధానం
సామలు, మినప్పప్పు, మెంతుల్ని కలిపి నాలుగైదు గంటల ముందు నానబెట్టుకోవాలి. అటుకుల్ని పిండి రుబ్బేందుకు పదినిమిషాల ముందు నానబెట్టుకుంటే చాలు. ఆ తరువాత అన్నింటినీ కలిపి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకుని సరిపడా ఉప్పు కలిపి నాలుగైదు గంటలు పక్కన ఉంచాలి. తరువాత స్టౌమీద పెనంపెట్టి గరిటెతో పిండిని తీసుకుని దోశలా పరిచి, నూనె వేస్తూ రెండువైపులా కాల్చుకుని తీసుకోవాలి. ఇదేవిధంగా మిగిలిన పిండీ చేసుకోవాలి.


కిచిడీ

కావలసినవి
అరికెలు: అరకప్పు, పెసరపప్పు: అరకప్పు, పచ్చిబఠాణి: అరకప్పు, ఉల్లిపాయ: ఒకటి, టొమాటో: ఒకటి, అల్లం తరుగు: చెంచా, పచ్చిమిర్చి: రెండు, కరివేపాకు రెబ్బలు: రెండు, జీలకర్ర: అరచెంచా, ఇంగువ: చిటికెడు, కారం: చెంచా, ఉప్పు: తగినంత, నెయ్యి: రెండు టేబుల్‌స్పూన్లు, పసుపు: కొద్దిగా.

తయారీ విధానం
అరికెలు, పెసరపప్పును ఓ గిన్నెలో తీసుకుని గంటసేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కుక్కర్‌ని పెట్టి టేబుల్‌స్పూను నెయ్యి వేయాలి. అది వేడయ్యాక జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తరువాత పసుపు, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో తరుగు, పచ్చిబఠాణి వేసి బాగా కలిపి, కారం, తగినంత ఉప్పు, రెండుకప్పుల నీళ్లు పోసి... అరికెలు, పెసరపప్పు వేసి మూత పెట్టేసి, ఒక కూత వచ్చాక దింపేయాలి. తరువాత కిచిడీని బాగా కలిపి వడ్డించేముందు మిగిలిన నెయ్యి వేస్తే సరిపోతుంది.


మురుకులు

కావలసినవి
రాగిపిండి: అరకప్పు, బియ్యప్పిండి: పావుకప్పు, సెనగపిండి: టేబుల్‌స్పూను, వేడినూనె: చెంచా, ఇంగువ: పావుచెంచా, వాము: పావుచెంచా, నువ్వులు: రెండు చెంచాలు. ఉప్పు: తగినంత, నూనె: సరిపడా, కారం: కొద్దిగా.

తయారీ విధానం
ముందుగా ఓ గిన్నెలో నూనె తప్ప మిగిలిన పదార్థాలను తీసుకుని బాగా కలుపు కోవాలి. ఇందులో చెంచా వేడినూనె వేసి.. మరోసారి కలిపి నీళ్లు పోసుకుంటూ మురుకులపిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనెరాసిన మురుకుల గొట్టంలో తీసుకుని కాగుతున్న నూనెలో మురుకుల్లా వత్తుకుని ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.


నిప్పట్టు

కావలసినవి
కొర్రలు: కప్పు, బియ్యప్పిండి: కప్పు, సెనగపిండి: కప్పు, వేయించి, పొట్టుతీసి, కచ్చాపచ్చాగా చేసుకున్న పల్లీపొడి: రెండు టేబుల్‌స్పూన్లు, కచ్చాపచ్చాగా దంచిన ఎండుమిర్చి కారం: రెండు చెంచాలు, కొబ్బరి తురుము: చెంచా, జీలకర్ర: టేబుల్‌స్పూను, నువ్వులు: టేబుల్‌స్పూను, కొత్తిమీర తరుగు: పావుకప్పు, వెన్న: టేబుల్‌స్పూను, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం
ముందుగా స్టౌమీద బాణలి పెట్టి... కొర్రపిండి, బియ్యప్పిండి, సెనగపిండిని విడివిడిగా వేయించుకుని ఓ గిన్నెలో వేసుకోవాలి. అందులో నూనె, వెన్న తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని బాగా కలపాలి. తరువాత వెన్నను కరిగించి అందులో వేసి మరోసారి కలిపి గోరువెచ్చని నీళ్లు పోసుకుంటూ గట్టిపిండిలా చేసి మూత పెట్టేయాలి. పావుగంటయ్యాక ఈ పిండిని చేత్తో చిన్నసైజు పూరీల్లా చేసుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.


లడ్డు

కావలసినవి
జొన్నలు: కప్పు, బ్రౌన్‌షుగర్‌: ముప్పావుకప్పు, కొబ్బరితురుము: చెంచా, జీడిపప్పు: నాలుగైదు, నెయ్యి: టేబుల్‌స్పూను, గోరువెచ్చని పాలు: కొద్దిగా, యాలకులపొడి: పావుచెంచా.

తయారీ విధానం
స్టౌమీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక జొన్నలు వేసి దోరగా వేయించుకుని తీసుకోవాలి. అవి చల్లారాక మిక్సీలో మెత్తగా గ్రైండ్‌చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా బ్రౌన్‌షుగర్‌, జీడిపప్పు, కొబ్బరి కలిపి మిక్సీలో గ్రైండ్‌ చేసుకోవాలి. ఇప్పుడు పాలు తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ ఓ గిన్నెలో తీసుకుని బాగా కలిపి... పాలు చల్లుకుంటూ లడ్డూల్లా చుట్టుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని