పువ్వులే... లక్షాధికారుల్ని చేశాయి!

ఒకటి తుపానులతో కొట్టుమిట్టాడే ప్రాంతం... మరొకటి కరవు బారిన పడిన ప్రాంతం... ఇంకొకటి వ్యాపారపంటల నీళ్ల దాహం తీర్చలేక అల్లల్లాడుతున్న ప్రాంతం.

Published : 11 Feb 2024 00:02 IST

ఒకటి తుపానులతో కొట్టుమిట్టాడే ప్రాంతం... మరొకటి కరవు బారిన పడిన ప్రాంతం... ఇంకొకటి వ్యాపారపంటల నీళ్ల దాహం తీర్చలేక అల్లల్లాడుతున్న ప్రాంతం. ఆ మూడింటి తలరాతనీ మార్చేసి ఒకనాటి పేద రైతులను నేడు లక్షాధికారులను చేస్తోంది పువ్వులసాగు.


మావల్‌... గులాబీల ఊరు

ఏటా వాలెంటైన్స్‌ డే నాడు ఆస్ట్రేలియా, జపాన్‌, దుబాయ్‌, సింగపూర్‌, మలేసియా లాంటి పలుదేశాల్లో అమ్ముడవుతున్న ఎర్ర గులాబీలు ఎక్కడివో తెలుసా? మనదేశంలోని పశ్చిమ కనుమల్లో పూసినవి. పుణె జిల్లాలో ఉన్న మావల్‌ గ్రామంలో- ఒకప్పుడు వరి, చెరకు ప్రధాన పంటలు. రానురానూ ఆ పంటల నీటిదాహాన్ని తీర్చడం రైతులవల్ల కాలేదు. ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారించిన వాళ్లను గులాబీలు ఆకట్టుకున్నాయి. తొంభయ్యవ దశకంలో టాటా సంస్థ ఓరియెంటల్‌ ఫ్లోరాటెక్‌ని ప్రారంభించి డచ్‌ రోజెస్‌ని సాగుచేసేది. ఆ తర్వాత కొన్ని సంస్థలు కూడా ఈ ప్రయోగం చేశాయి కానీ అదంతా కార్పొరేట్‌ కంపెనీల వ్యవహారం అనుకున్న రైతులు చాలాకాలం అటువైపు చూడలేదు. అలాంటిది గత దశాబ్దంలో ఒక్కొక్కరుగా మొదలుపెట్టి ఇప్పుడు పలువురు రైతులు ఈ బాట పట్టారు. పావు ఎకరంతో మొదలుపెట్టి 15 ఎకరాల వరకూ పొలం ఉన్నవాళ్లు కూడా గులాబీ ఉత్పత్తిదారుల సంఘాల్లో చేరి రంగురంగుల పువ్వుల్ని సాగుచేస్తున్నారు. రోజూ టన్నులకొద్దీ గులాబీలను దేశ విదేశీ మార్కెట్‌లకు పంపుతూ లక్షల్లో సంపాదిస్తున్నారు. పాలీహౌస్‌లలో బిందుసేద్యాన్ని అనుసరించడం వల్ల నీటికి సమస్య లేకపోవడంతో చుట్టుపక్కల గ్రామాల రైతులూ గులాబీల సేద్యంవైపు మళ్లడం విశేషం. ఎకరం పొలం ఉన్నా చాలు రోజుకు కనీసం రెండువేల పువ్వులు వస్తాయనీ, పూలసాగు చేపట్టాక మిగులు ఆదాయాన్ని కళ్లజూస్తున్నామనీ చెబుతున్నారు ఇక్కడి రైతులు.


రలాబా... రజనీగంధా

ఒడిశాలోని సముద్రతీర ప్రాంతానికి 17కి.మీ.ల దూరంలో ఉంటుంది రలాబా గ్రామం. సరిగ్గా పాతికేళ్ల క్రితం వచ్చిన సూపర్‌ సైక్లోన్‌ ఆ ఊరిని అతలాకుతలం చేసింది. 250కి.మీ.ల వేగంతో వీచిన గాలులకు అక్కడి ప్రజల జీవనాధారమైన తమలపాకు తోటలూ, పోక చెట్లూ నేలకు ఒరిగాయి. జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి వారికి చాలా సమయం పట్టింది. తుపానుగండం ఎప్పుడూ పొంచి ఉండేదే కాబట్టి పంటల్ని మార్చడమే మార్గమనుకున్న రైతులు రజనీగంధ పూలసాగు వైపు మళ్లారు. మొదట్లో 30 మంది పదెకరాల్లో ప్రారంభించగా ఇప్పుడు గ్రామంలోని 140 మంది రైతులూ పూల ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటుచేసుకుని ఈ సాగే చేస్తూ ఊరినీ తమ జీవితాల్నీ పరిమళభరితం చేసుకున్నారు. వీటివల్ల భూమి లేనివారికి కూడా చేతినిండా పని దొరికింది. రోజూ పువ్వులు కోయడం, ప్యాక్‌ చేయడం, నగరాల్లోని పుష్పగుచ్ఛాల తయారీదార్లకు సరఫరా చేయడం లాంటి పనులు చేస్తూ వారూ ఉపాధి పొందుతున్నారు. ‘మొక్కలు నాటిన ఎనిమిది నెలలకు పూత ప్రారంభమవుతుంది, ఇక అప్పటినుంచీ ఎకరానికి ఏటా రెండున్నర లక్షల ఆదాయం గ్యారంటీ. చేయాల్సిందల్లా వారానికోసారి నీళ్లు పెట్టడమే’ అంటున్నారు రలాబా వాసులు.


ఊరి పేరే ‘పూల పల్లె’

సీజన్‌తో నిమిత్తం లేకుండా కన్పించినంత మేరా పూల తివాచీ పరిచినట్లు బంతులూ చేమంతుల తోటల్ని చూడాలనుకుంటే మహారాష్ట్రలోని ‘ఫులాంచా’ గ్రామానికి వెళ్లాలి. అవును... ‘నికంవాడి’ అన్న ఆ ఊరి అసలు పేరు చెబితే ఎవరికీ తెలియదు, ఫులాంచా అంటేనే తెలుస్తుంది మరి. అక్కడి నుంచి రోజూ ట్రక్కుల కొద్దీ పువ్వులు నగరాలకు రవాణా అవుతుంటాయి. ఈ పల్లెలో కొంతకాలం క్రితం వరకూ రైతులు పసుపూ చెరకూ పండించేవారు. నీళ్లు ఉంటే పంట... లేకపోతే లేదు. ఎంత కష్టపడినా వచ్చే ఆదాయంతో పూటగడవడం కష్టంగా ఉండేది. వెంటపడగా పడగా పంట అమ్మిన ఏడాదికి కానీ డబ్బు ఇచ్చేవారుకాదు. అలాంటిది 2005లో ఓ వ్యవసాయాధికారి సలహాతో నలుగురైదుగురు రైతులు ధైర్యంచేసి కొంతపొలంలో బంతిపూల సాగు చేపట్టారు. తక్కువ సమయంలోనే వారి చేతికి డబ్బు అందడం చూసి మిగిలిన రైతులూ ఆకర్షితులయ్యారు. క్రమంగా 170 మంది చిన్న రైతులు 200లకు పైగా ఎకరాల్లో పూలసాగు చేపట్టారు. బంతిపూలతో పాటు ఎనిమిది రంగుల చేమంతుల్ని పండిస్తూ రోజూ 12 టన్నుల పూలను ట్రక్కుల్లో నగరంలోని మార్కెట్‌కి పంపుతున్నారు. బంతి ఏడాది పొడుగునా పూస్తుంది కానీ చేమంతులు మాత్రం కొన్నాళ్లే పూస్తాయి. అయితేనేం ‘జీవితంలో మొదటిసారి లక్షల్లో ఆదాయాన్ని కళ్లజూడగలుగుతున్నామంటే అది ఈ పూల చలవే’ అంటున్నారు ఫులాంచావాసులు. పువ్వుల్లేని వేడుకలు ఉండవు కాబట్టి ఆదాయానికి ఢోకా లేదు. ఈ ఊరివాళ్లే పూలమొక్కల నర్సరీ కూడా నిర్వహిస్తూ చుట్టుపక్కల రైతులకు పూలతోటలు పెంచుకోవడానికి సాయం చేస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..