Graphene: గ్రాఫీన్‌... రేపటి ప్రపంచం దీనిదే!

ఎంత అధునాతన ఫోన్‌ అయినా దాన్ని పూర్తిస్థాయిలో ఛార్జ్‌ చేయడానికి... కనీసం అర్ధగంట పడుతోందిప్పుడు. కానీ, శామ్‌సంగ్‌ సంస్థ అతిత్వరలో కేవలం పదినిమిషాల్లోనే వందశాతం ఛార్జయ్యే ఫోన్‌ని విడుదలచేయబోతోంది. నేటి ఇళ్ళ నిర్మాణంలో ఇనుప చువ్వలకే ఎక్కువ ఖర్చవుతోంది. ఇకపైన వాటి అవసరమేలేని సరికొత్త కంకర వస్తోంది!

Updated : 20 Aug 2023 10:40 IST

ఎంత అధునాతన ఫోన్‌ అయినా దాన్ని పూర్తిస్థాయిలో ఛార్జ్‌ చేయడానికి... కనీసం అర్ధగంట పడుతోందిప్పుడు. కానీ, శామ్‌సంగ్‌ సంస్థ అతిత్వరలో కేవలం పదినిమిషాల్లోనే వందశాతం ఛార్జయ్యే ఫోన్‌ని విడుదలచేయబోతోంది. నేటి ఇళ్ళ నిర్మాణంలో ఇనుప చువ్వలకే ఎక్కువ ఖర్చవుతోంది. ఇకపైన వాటి అవసరమేలేని సరికొత్త కంకర వస్తోంది! ఆ కంకరని వేశాక- కేవలం నిమిషాల్లోనే ఆరిపోయి గట్టిపడుతుందట. - చదవడానికి ఈ రెండూ వేర్వేరు విషయాలుగా అనిపించినా ఈ అద్భుతాల వెనకో పదార్థం ఉంది. దాని పేరు గ్రాఫీన్‌(Graphene)! ఓ పూతరేకు పొరలో లక్షోవంతు మందం మాత్రమే ఉండే గ్రాఫీన్‌... స్టీలుకన్నా రెండొందల రెట్లు గట్టిది. రాగి కంటే వందశాతం వేగంతో కరెంటుని తీసుకెళ్ళగలుగుతుంది. కనుకే, కాలికింది నేల నుంచి ఆకాశంలోని విమానాలదాకా ప్రతిదాంట్లోనూ గ్రాఫీన్‌ వాడకం మొదలైంది. శాస్త్ర ప్రపంచం దీన్నో ‘మ్యాజిక్‌ మెటీరియల్‌’గా కీర్తిస్తోంది! గ్రాఫిన్‌తో సరికొత్త యుగం మొదలైందనీ చెబుతోంది. ఆ యుగం పరిణామక్రమమిది...

ఇద్దరూ శాస్త్రవేత్తలు. ఒకాయన ప్రొఫెసరైతే... ఇంకొకరు ఆయన విద్యార్థి. ఆరోజు ఆ ఇద్దరూ దేనికోసమో తీవ్రంగా శోధిస్తున్నారు. తమ రోజువారీ పరిశోధనని కాసేపు పక్కనపెట్టి మరీ... వెతుకులాటలో నిమగ్నమయ్యారు. వాళ్ళు ఆ రోజు గాలిస్తున్నది చెత్తబుట్టల్ని! వాటిల్లో చిందరవందరగా పడి ఉన్న సెల్లో టేపుల్ని!

ఇంగ్లండులోని మాన్‌చెస్టర్‌ వర్సిటీలోని సెంటర్‌ ఫర్‌ మెసో సైన్స్‌ అండ్‌ నానో టెక్నాలజీ భవనంలో సాగుతోంది ఈ తతంగమంతా. అది 2002 సంవత్సరం సెప్టెంబర్‌ నెల 23. ఆ రోజు ఉదయం నుంచి రాత్రిదాకా ఇద్దరూ ఇలా వెతకడం చూసినవాళ్ళందరూ వెక్కిరింపుగానో జాలిగానో నవ్వుకున్నారు. కానీ ఆ ఇద్దరూ మాత్రం ఆ సెల్లోటేపులన్నింటినీ సేకరించుకుని వచ్చి మైక్రోస్కోప్‌ కింద పెట్టారు. కళ్ళలో వత్తులేసుకుని మరీ- ఓ పదార్థం కోసం వెతికారు. అది దొరికాక... ‘హుర్రే’ అని వాళ్ళు సంబరపడిపోలేదుకానీ... ప్రపంచం మాత్రం నివ్వెరపోయింది. ఎందుకంటే- ఆ చెత్తబుట్టల్లో, వాటిల్లోని సెల్లోటేపుల్లో వాళ్ళకి ఆ రోజు కనిపించింది ‘గ్రాఫీన్‌’ అన్న అతిపలచటి పదార్థం కాబట్టి! దాన్ని వెతికిపట్టుకున్నందుగ్గాను ఆ ఇద్దరికీ 2010లో భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి వచ్చింది. దాన్ని అందుకున్న ఆ ప్రొఫెసర్‌ పేరు- ఆండ్రె గయమ్‌. ఆ విద్యార్థి- కాన్‌స్టాంటిన్‌ నవసేలవ్‌. నోబెల్‌ పురస్కారం సందర్భంగా ప్రొఫెసర్‌ ఆండ్రె గయమ్‌ చెప్పిన మాటలు చరిత్రలో నిలిచిపోయాయి... ‘గ్రాఫీన్‌ అన్నది మేం కొత్తగా కనిపెట్టింది కాదు. ప్రపంచం పుట్టినప్పటి నుంచీ అది ఉంది... మా యూనివర్సిటీ ప్రొఫెసర్లందరూ విసిరిపారేసిన సెల్లోటేపుల్లో దాక్కుని ఉంది. వాటిని విసిరేసేటప్పుడు కాస్త ఆగి- తమ మైక్రోస్కోప్‌కి పనిచెప్పి ఉంటే ఈ నోబెల్‌ బహుమతి వాళ్ళకే దక్కి ఉండేది. ఆ రకంగా వాళ్ళు విసిరేసింది ఉత్త టేపుల్ని కాదు... కొత్త అవకాశాలనీ... సరికొత్త యుగాన్నీ’ అని చెప్పారాయన. ఈ ప్రొఫెసర్‌ మాటల్నే కొంత పరిశీలించి చూద్దాం. గ్రాఫీన్‌ అన్నది ప్రపంచం పుట్టినప్పటి నుంచీ ఉంది అంటున్నాడాయన. ఉంటే అది ఎలా ఉంది? అప్పటిదాకా ఎందుకు ఎవరూ కనిపెట్టలేకపోయారు? వాటికి జవాబు వెతుకుదాం రండి...

‘ఇందుగలడందులేడన్న సందేహంబు వలదు...’ అంటాడు పోతన ఆ పరమాత్ముని గురించి. ఆ పద్యం ‘కార్బన్‌’కి కూడా బాగా వర్తిస్తుంది. మీరు చదువుతున్న ఈ కాగితమో కంప్యూటరో మొబైలో మీ చుట్టూ ఉన్న పదార్థాలో... ఏవైనా సరే, వాటిల్లో ఎంతోకొంత కార్బన్‌ ఉండితీరుతుంది. అందుకే ఆక్సిజన్‌, హైడ్రోజన్‌, హీలియం తర్వాత విశ్వంలో అత్యధికంగా వ్యాపించి ఉన్న మూలకం ఇదేనంటారు. అన్నింటా ఉన్నా... భూమిపైన దీని ప్రధాన రూపాలు నాలుగు! ఒకటి- బొగ్గు. ఆదిమానవుడు నిప్పుని కనిపెట్టిన కాలం నుంచే ఇది మనకి తోడుంది. ఇనుముని ఉక్కుగా మార్చి మనకి ఆయుధాలుగా ఉపయోగపడటంలో కీలకపాత్ర పోషించింది. రెండో రూపం - వజ్రం. క్రీస్తు పూర్వం 2500 నుంచీ వీటిని వెలికి తీసి నగలుగా అలంకరించుకుంటున్నాం. మూడోది- ఫులెరీన్‌ అనే అతిసూక్ష్మ పదార్థం. దీన్ని ఎక్కువగా ల్యాబుల్లోనే తయారుచేస్తారు. నాలుగోది- గ్రాఫైట్‌. గ్రాఫీన్‌ తయారీలో కీలక పాత్రధారి ఇదే...

‘పెన్సిల్‌ ములికిని దేనితో తయారుచేస్తారు?’ - స్కూల్‌ సైన్స్‌ పాఠాల్లో ఈ ప్రశ్న వస్తుంది. ‘గ్రాఫైట్‌’ అన్నది దానికి జవాబు. 16వ శతాబ్దంలో ఉత్తర ఇంగ్లండులోని పశువుల కాపర్లకి పొరలుపొరలుగా ఉన్న పెద్ద రాళ్ళలా ఇవి దొరికాయి. ఆ రాళ్ళ ముక్కల్ని మొదట బొగ్గనుకుని మండించారు కానీ అది మండలేదు. కానీ- ఆ రాళ్ళు ఏదైనా గీయడానికీ రాయడానికీ అనువుగా ఉండటంతో- గొర్రె చర్మాలపైన వాటితో గుర్తులు వేయసాగారు. దాదాపు రెండు శతాబ్దాల దాకా అందుకోసమే ఉపయోగిస్తూ వచ్చారు దాన్ని. 18వ శతాబ్దంలో ఆ రాళ్ళపైన శాస్త్రవేత్తల దృష్టిపడింది. రాయడానికి అనువుగా ఉంది కాబట్టి దీనికి గ్రాఫైట్‌(గ్రాఫ్‌ అంటే లాటిన్‌లో రాత అని అర్థం) అని నామకరణం చేశారు. పనిలోపనిగా - ఇది రాతకే కాదు ఫిరంగి గుండ్ల తయారీకి బాగా ఉపయోగపడుతుందనీ కనిపెట్టారు. ఇంకేం... ఇంగ్లండు ప్రభుత్వం ఆ గనుల్ని సొంతం చేసుకుంది. భారత్‌, శ్రీలంకల్లోనూ పుష్కలంగా దొరికిన గ్రాఫైట్‌ నిల్వలపైన ఆ సర్కారు ఆధిపత్యం చెలాయించింది. ఫ్రాన్స్‌పైన శత్రుత్వంతో అక్కడికి సరఫరా చేయడం నిలిపేసింది! దాంతో ఫ్రెంచివాళ్ళు కొత్త ఆవిష్కరణలకి నడుంకట్టారు. తమ దగ్గర మిగిలిన అతితక్కువ గ్రాఫైట్‌ నిల్వలకి బంకమట్టిని కలిపి సరికొత్త పెన్సిళ్ళను తయారుచేసుకోసాగారు. అంతేకాదు, గ్రాఫైట్‌ని పొడిగా చేసి వాడటం, వాటితో అతికించే పదార్థాలూ తయారుచేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం బ్యాటరీల నుంచి రాకెట్‌ల తయారీవరకూ ఎన్నో ఉత్పత్తులకి గ్రాఫైట్‌ని వాడుతున్నారు. మరి అలాంటి గ్రాఫైట్‌ నుంచి గ్రాఫీన్‌ని తయారుచేయాల్సిన అవసరం ఏమొచ్చింది...? దానికి సమాధానం తెలియాలంటే- కొద్దిగా సైన్సులోకి వెళ్ళాలి...

పూతరేకులాంటిదే...

బొగ్గూ, వజ్రమూ, గ్రాఫైటూ... ఇవి కార్బన్‌కి చెందిన వేర్వేరు రూపాలనుకున్నాం కదా! ఇవన్నీ ఎప్పటి నుంచో ఉపయోగంలో ఉన్నా కూడా- 1772లోనే తొలిసారి బొగ్గూ వజ్రం ఒకేకోవకి చెందిన వస్తువులని కనిపెట్టగలిగారు. మరో ఏడేళ్ళకి- గ్రాఫైట్‌ కూడా ఇదే రకానికి చెందిందని నిర్ధరించారు. 19వ శతాబ్దం నాటికి ఈ మూడింటికీ రసాయన నిర్మాణాన్ని(కెమికల్‌ స్ట్రక్చర్‌) రూపొందించారు. ఈ మూడింటికీ అణువుల సంఖ్య ఇంచుమించు ఒకటేకానీ అవి ఒకదానికొకటి అనుసంధానమైన విధానం వేరని పసిగట్టారు. వజ్రంలోని అణువుల నిర్మాణం దగ్గరదగ్గరగా ఓ పెట్టె(క్యూబ్‌) ఆకారంలో ఉంటుంది కాబట్టి దానికి గట్టితనం ఎక్కువ. బొగ్గు నిర్మాణం కాస్త చిందరవందరగా ఉండటం వల్ల పెళుసుగా ఉంటుంది. కానీ- గ్రాఫైట్‌లోని అణువుల నిర్మాణం ఆరుకోణాల్లో(హెక్సాగన్‌) అందంగా అమరి ఉంటుంది. అంతేకాదు- ఈ అణువులన్నీ ఒకదానిపైన ఒకటి పొరలుపొరలుగా పేర్చినట్టు ఉంటాయి. అంటే- ఓ పూతరేకులా ఉంటుందని అనుకోవచ్చు. ‘మరి ఆ పూతరేకు నుంచి ఒక్క రేకుని మాత్రమే వేరుచేయగలిగితే?’ అన్న ఆలోచన వచ్చింది శాస్త్రవేత్తలకి. ఆ ఆలోచన ఫలితమే గ్రాఫీన్‌!

ఇంతకీ ఎందుకు తీయాలి?

సూక్ష్మంలో మోక్షం అన్నది నేటి పారిశ్రామికరంగం నినాదం. తక్కువ స్థలాన్నీ, ఇంధనాన్నీ తీసుకుని ఎక్కువ ఫలితాన్నిచ్చే వస్తువుల ఆవిష్కరణల కోసం శాస్త్రవేత్తలవైపు చూస్తుంటారు వాళ్ళు. ఒకప్పుడు ఒక గది పరిమాణంలో ఉండే కంప్యూటర్‌- ఇప్పుడు మన చేతిలో ఒదిగిపోతోందంటే అలాంటి పరిశోధనల చలవే. పొరలుపొరలుగా ఉన్న గ్రాఫైట్‌ నుంచి కేవలం అణువంత పలుచటి పొరని వేరుచేసి... దాన్ని ఉపయోగించాలన్న ఆలోచన 1940 నుంచే ఉంది. అలా వేరుచేయగలిగితే - ఆ పొర దాని మాతృక గ్రాఫైట్‌కన్నా వెయ్యిరెట్లు గట్టిగా ఉంటుందనీ స్టీలుకన్నా రెండొందల రెట్లు స్థిరంగా ఉంటుందనీ గ్రహించారు. ఒట్టిగట్టిదనమే కాదు... ఇందులో ‘ఛార్జింగ్‌ పార్టికల్స్‌’ అన్న ప్రత్యేక అణువులూ ఉన్నాయని తెలుసుకున్నారు. వాటివల్ల- ఇవి రాగికన్నా వందశాతం వేగంగా కరెంటుని తీసుకెళ్ళగలవని నిర్ధరించారు. స్టీలుకన్నా గట్టిది, అత్యంత వేగంగా కరెంటుని సరఫరా చేయడమేకాక ఓ రబ్బర్‌లా ఎటువంచితే అటు వంగేది... ఒకే పదార్థంలో ఈ రెండు లక్షణాలూ ఉంటే ఇంకేం కావాలి? దీనితో ఓ సెల్‌ఫోన్‌ని తయారుచేయాలనుకుందాం. అందులో వాడాల్సిన రాగి అక్కర్లేదు కాబట్టి... పెద్దగా కనెక్షన్‌లూ వాటికి అవసరమైన పరికరాలూ అవసరంలేదు. అందువల్ల చాలా సన్నగా దీన్ని తయారుచేయొచ్చు. పైగా- పూర్తి ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది కాబట్టి ఇట్టే మడతపెట్టేయొచ్చు! మడవగలిగినా- అంతేస్థాయిలో గట్టిగానూ ఉంటుందన్నమాట. ఇలాంటి ఉపయోగాలెన్నో ఉంటాయికాబట్టే... పరిశోధకులు దీనిపైన దృష్టిపెట్టారు. కానీ- గ్రాఫైట్‌ నుంచి కేవలం అణువంత పొరని తీయడం అరవైయేళ్ళపాటు ఎవరికీ సాధ్యంకాలేదు. ఓ వినూత్న ఆలోచనే దాన్ని సాధ్యం చేసింది...

అసలు పరిశోధన ఇది కాదు...

నిజానికి, ప్రొఫెసర్‌ గయమ్‌ తన బృందంతో కలిసి ఫిజిక్స్‌పైన రకరకాల ప్రయోగాలు చేస్తూ... ఓ ఆటవిడుపుగానే గ్రాఫీన్‌పైన దృష్టిపెట్టాడు. దీని పరిశోధనలకి తన సొంత జీతాన్నే వాడుతూ వచ్చాడు. అలా అతని దగ్గర జా డాంగ్‌ అనే పరిశోధక విద్యార్థి చేరాడు. అతనికి ల్యాబుల్లో వాడే ఓ గ్రాఫైట్‌ ముద్దని ఇచ్చి- అందులో నుంచి అణువంత పలుచని పొరని వేరు చేసి ఇవ్వమన్నాడు. ఓ సుద్దముక్కని అరగతీస్తూ పోతే చివరగా సన్నటి పొర మిగులుతుంది కదా! అలాగే, అతను దాన్ని అరగతీసీ... తీసీ... చివరికి ఓ ముక్కని ప్రొఫెసర్‌గారి చేతిలో పెట్టాడు. దాన్ని ఆయన మైక్రోస్కోపులో చూస్తే- అది గ్రాఫీన్‌ కాలేదని తేలింది! పైగా, కాసేపటికే ఫట్‌మని విరిగిపోయింది. ‘అయ్యో! నా యాభైవేలు పోయాయే’ అని ప్రొఫెసర్‌ గయమ్‌ బాధపడుతూ ఉంటే ఓ ఉపాయం చెప్పాడు కాన్‌స్టాంటిన్‌ నవసేలవ్‌ అనే మరో విద్యార్థి! అదేమిటంటే...

అలా బయటపడింది...

ఫిజిక్స్‌ ల్యాబుల్లో గ్రాఫైట్‌ని మైక్రోస్కోపు స్పష్టతని పరీక్షించడానికి వాడుతుంటారు. గ్రాఫైట్‌లోని సూక్ష్మ అణువులు ఎంతబాగా కనిపిస్తే- ఆ మైక్రోస్కోపు అంతచక్కగా పనిచేస్తుందని లెక్కన్నమాట. అందుకోసం టెస్టు చేయాలంటే- ముందు గ్రాఫైట్‌ శుభ్రంగా ఉండాలికదా! అలా శుభ్రంచేయడానికి దాన్ని కడగరూ, తుడవరూ. ఓ సెల్లోటేపు తీసుకుని దానిపైన అతికించి... తీస్తూ ఉంటారు. అలా తీసినప్పుడు గ్రాఫైట్‌ పైనున్న దుమ్మూధూళీ టేపుకి అంటుకుని వచ్చేస్తుందన్నమాట! ‘ఆ రకంగా వాడిన టేపులో- అతిసన్నటి గ్రాఫైట్‌ పొర ఉండొచ్చేమో!’ అన్న ఆలోచన వచ్చింది నవసేలవ్‌కి. ఆ విషయం- తన ప్రొఫెసర్‌కి చెప్పాడు. ఆయనకి ఈ ఆలోచన బాగుందనిపించడంతో ఇద్దరూ కలిసి- ఆ టేపుల్ని పడేసిన చెత్తబుట్టల్ని గాలించారు! దొరికినవాటిని మైక్రోస్కోపులో పెట్టి చూస్తే... యురేకా! వీళ్ళు కోరుకున్న అణువంత పొర దానికి అంటుకుని ఉంది. దానిపైన ఓ సిల్వర్‌కోటింగ్‌ని వేసి... కరెంటుని సరఫరా చేస్తే... అందులోని అణువులు గ్రాఫైట్‌కన్నా భిన్నంగా కదలడం, అత్యంత వేగంగా కరెంటుని మోసుకెళ్ళడం చూశారు. ఇక- అతినాజూకైన ఆ పొరని వేరుచేసి అలాంటి వేలాది పొరల్ని సృష్టించగలిగారు. వాటిని కంటికి కనిపించే వస్తువులా మార్చడానికని ఒకదానిపైన ఒకటి పేర్చారు! ‘అలా పెడితే మళ్ళీ అది గ్రాఫైట్‌లా మారిపోతుంది కదా?’ అన్న సందేహం రావొచ్చు. అలా అవి అతుక్కుపోకుండా- ఆ పొరలని ఆక్సిడైజేషన్‌ పద్ధతితో వేరు చేశారు. ఈ కృషికే నోబెల్‌ బహుమతి వచ్చింది! శాస్త్రవేత్తల అరవై ఏళ్ళ కల సాకారమైంది! పదేళ్ళు తిరగకుండానే ‘అది ఇది ఏమని అన్నిరంగముల’ అన్నట్లు... రకరకాల రూపాల్లో గ్రాఫీన్‌ వాడకం మొదలైంది. మచ్చుకి కొన్ని చూద్దాం...

మొబైల్‌ టెక్నాలజీలో : ‘గ్రాఫీన్‌’తో ఫ్లెక్సిబుల్‌ మొబైల్‌ ఫోన్‌లు వచ్చేస్తాయి’ అన్నాడు దాన్ని ఆవిష్కరించిన ప్రొఫెసర్‌ గయమ్‌- నోబెల్‌ని అందుకుంటూ. కాస్త ఆలస్యమైనా- త్వరలోనే అలాంటి ఫోన్‌లు రాబోతున్నాయి. ఈ ఫోన్‌లు పూర్తి పారదర్శకంగానూ ఉంటాయి. అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ) ఇప్పటికే వీటి ప్రొటోటైపుల్ని తీసుకొచ్చింది. షామీ సంస్థ గ్రాఫీన్‌ బ్యాటరీ ఫోన్‌ అంటూ ఐదువేల ఎంపీహెచ్‌తో ఓ ఫోన్‌ని గతేడాది మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. దాన్ని తలదన్నేలా ఈ ఏడాది శామ్‌సంగ్‌- కేవలం 12 నిమిషాల్లో పూర్తిస్థాయిలో ఛార్జ్‌ అయ్యే ఫోన్‌ని తీసుకొస్తోంది. వేగంగా ఛార్జ్‌ అవ్వడమే కాదు... ఆ ఛార్జ్‌ వారంపాటు ఉంటుందట! ఆపిల్‌ సంస్థ కూడా గ్రాఫీన్‌ సాయంతో తమ ఐఫోన్‌లలో అతి సూక్ష్మ మైక్రోఫోన్‌ని ఫోన్‌లో పెట్టబోతోంది. దాని ద్వారా- ఫోన్‌ బరువును బాగా తగ్గించి అతిసన్నటి మోడల్‌ని తీసుకురాబోతోంది.

వైద్యరంగాన : గ్రాఫీన్‌ కణాలు చుట్టుపక్కల వాతావరణంలోని ప్రతిచిన్నమార్పునీ క్షణంలో పసిగట్టగలుగుతాయి. ఈ లక్షణం- దాన్ని వైద్యరంగానికి దగ్గరచేస్తోంది. కొందరు రోగులకి అనునిత్యం గుండెరేటునీ, నాడీ వ్యవస్థని పరిశీలించాల్సి ఉంటుంది. ఇందుకోసం- వాళ్ళ శరీరంపైన ఎప్పుడూ ఓ పరికరం ఉండాలి! దానికి బదులు- కేవలం ఓ టాటూ పూతతో(అందులో గ్రాఫీన్‌ పొడి ఉంటుంది) నిత్యం రోగి తీరుతెన్నుల్ని పరిశీలించే విధానం వచ్చేసింది. దీంతోపాటూ- క్యాన్సర్‌ కణాలని కచ్చితంగా గుర్తించి దాన్ని అంతమొందించే మెడిసిన్‌ క్యారియర్‌ క్యాప్సుల్స్‌గానూ తెస్తున్నారు. జన్యు సంబంధిత క్యాన్సర్‌ ప్రమాదాన్ని ముందుగా పసిగట్టే బయో సెన్సర్‌లనీ యూరప్‌లో ఉపయోగిస్తున్నారు.

‘రక్షణ’  కోసం : గ్రాఫీన్‌ పలచగా ఉన్నా స్టీలుకన్నా గట్టిగా ఉంటుంది కదా! ఈ లక్షణం హెలికాప్టర్‌లూ, యుద్ధవిమానాల తయారీకి ఉపయోగపడుతోంది. తక్కువ ఖర్చు, కొద్దిపాటి స్థలంలోనే శక్తిమంతమైన ‘క్రూ క్యాబిన్‌’లని ఇప్పటికే తయారుచేస్తున్నారు. గ్రాఫీన్‌కున్న మరో లక్షణం- అయస్కాంత తరంగాలని తప్పించుకోవడం. అంటే- దానితో చేసే పరికరాలు శత్రుదేశాల రాడార్‌ పరికరాలని మోసం చేస్తాయన్నమాట! ఈ లక్షణాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ చైనా ఈ మధ్యే- రాడార్‌లకి అందని హెలికాప్టర్‌లని తన అమ్ములపొదిలోకి చేర్చింది.

భవన నిర్మాణంలో : ఈ రంగంలో స్టీల్‌ వాడకాన్ని సగానికి సగం తగ్గించేలా- గ్రాఫిన్‌తో సరికొత్త కంకరని తయారుచేస్తోంది లండన్‌కి చెందిన లెవిడియన్‌ అన్న సంస్థ. ఈ కంకరలో కేవలం ఒక్కశాతం గ్రాఫీన్‌ ఉన్నా... 60 శాతం మన్నికనిస్తుంది. అలా సిమెంటు వాడకాన్ని భారీగా తగ్గిస్తుంది. ఇనుపచువ్వల అవసరం లేకుండా కేవలం కంకరతోనే గట్టిదనాన్ని తెస్తున్నారు. చువ్వల్ని వాడినా వాటి మన్నికని గ్రాఫీన్‌ రెట్టింపు చేస్తుందని చెబుతున్నారు. వైరింగ్‌లోనూ గ్రాఫీన్‌ విప్లవాన్ని సృష్టిస్తోంది. రాగికన్నా వందరెట్లు వేగంగా ఇది- కరెంటుని మోసుకెళ్తుంది కాబట్టి రాగిశాతాన్ని తగ్గించి... గ్రాఫీన్‌ చేర్చిన వైర్లు పెద్ద సంఖ్యలో తయారవుతున్నాయి.

వస్త్రాల్లోనూ : గ్రాఫీన్‌తో దోమలు మన దగ్గరకి రాకుండా ఉండే ప్రత్యేక దుస్తుల్ని తయారుచేస్తున్నారు. దోమల్ని భయపెట్టే రసాయనాలు ఇప్పటికే ఉన్నాయికానీ... వాటిని వస్త్రంపైన వేసి దుస్తులు తయారుచేయడం కష్టంగా ఉండేది. గ్రాఫీన్‌ ఆ ఇబ్బందిని పారదోలి- ఆ రసాయనం సహజంగా వస్త్రంపైన కలిసేలా చూస్తుంది. అంతేకాదు, క్రీడాకారుల కోసం- శరీరం వేడెక్కి ఎక్కువ చెమటపట్టకుండా చూసుకునే వస్త్రాలూ వచ్చాయి.

సైన్సు... సామాన్యులకి ఓ పట్టాన అర్థంకాని లెక్కలతో నిండి ఉండొచ్చు. కానీ అది వేసే ప్రతి అడుగూ- మానవజాతికి ఓ ముందడుగు అని చెప్పొచ్చు. ఒకప్పటి రాతియుగమైనా, పారిశ్రామిక విప్లవంతో వచ్చిన ప్లాస్టిక్‌ యుగమైనా, నేటి సిలికాన్‌ శకమైనా... మానవ మనుగడని అలా ముందుకు నడిపించినవే! గ్రాఫీన్‌తో అలాంటి నూతన యుగం ఒకటి ప్రారంభమవుతుందన్న అంచనా... శాస్త్రవేత్తలది. ఆ మాట నిజం కావాలి అన్న శుభకామన... మనందరిది!


భారత్‌ ఎక్కడుంది?

రెండు దశాబ్దాల కిందట సెమీకండక్టర్‌ల తయారీ అవకాశం వస్తే - దాన్ని మనదేశం అందుకోలేకపోయింది. చైనా దాన్ని తన్నుకుపోయింది. కానీ గ్రాఫీన్‌ విషయంలో భారత్‌ ఎంతో మెలకువతో వ్యవహరించింది. గ్రాఫీన్‌ని ఆవిష్కరించిన మూడేళ్ళకే బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌(ఐఐఎస్‌సీ) తనదైన పరిశోధనతో దాన్ని సులువుగా తయారుచేసే రియాక్టర్‌ని రూపొందించింది. ఆ టెక్నాలజీని టాటా స్టీల్‌ సంస్థ కూడా అందిపుచ్చుకుని భారీ ఎత్తున తయారీ మొదలుపెట్టింది. పాత ప్లాస్టిక్‌ని అతితక్కువ సమయంలో కొత్తగా మార్చే సాంకేతికతని కూడా కనిపెట్టింది. మహారాష్ట్రలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నానో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సంస్థ రైతుల కోసం పండ్లూ కాయగూరల్ని నిల్వచేసే బ్యాగుల్ని తయారుచేసింది. ఏ మాత్రం నిల్వ రసాయనాలు (ప్రిజర్వేటివ్స్‌) వాడని ఈ బ్యాగులు పండ్లు తాజాగా ఉండే సమయాన్ని రెట్టింపు చేస్తాయట! ఇక- మనదేశంలోని లాగ్‌9 అనే స్టార్టప్‌... గ్రాఫీన్‌ సాయంతో విద్యుత్తు ఉత్పత్తిలో వాడే అతిశక్తిమంతమైన కెపాసిటర్లని తయారుచేస్తోంది. ఆర్‌ఎఫ్‌ నానో కంపోసిట్స్‌ అనే మరో స్టార్టప్‌... ఏకంగా రాడార్‌లని ఏమార్చే(స్టెల్త్‌ టెక్నాలజీ) యుద్ధపరికరాలని మన సైన్యానికి అందిస్తోంది. గేగాడైన్‌ అనే మరో స్టార్టప్‌ ఈవీ వాహనాలని కేవలం ఎనిమిది నిమిషాల్లో రీచార్జ్‌ చేసే బ్యాటరీలని ఆవిష్కరిస్తోంది. ఇలాంటి స్టార్టప్‌లు మనదేశంలో డజనుకుపైగా ఉన్నాయి. ఈ వాతావరణాన్ని ప్రోత్సహించడానికీ, మరెన్నో పరిశోధనలు చేయడానికీ కేరళలో ‘ఇండియా ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఫర్‌ గ్రాఫీన్‌’ని ఏర్పాటుచేసింది కేంద్ర ప్రభుత్వం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..