ఎన్నో రకాలున్నాయి... మీకు ఏ గుడ్డు కావాలి?

శ్రావ్య ఇంటి సరకులు ఆర్డర్‌ పెట్టడానికి ఒక ఆన్‌లైన్‌ సైట్‌ తెరిచింది. కావాల్సినవన్నీ కార్ట్‌లో పెట్టాక చివరగా గుడ్లపైన క్లిక్‌ చేసింది. వరసగా ఒమేగా3, డి-విటమిన్‌, కార్డియో...

Published : 11 Feb 2024 00:24 IST

శ్రావ్య ఇంటి సరకులు ఆర్డర్‌ పెట్టడానికి ఒక ఆన్‌లైన్‌ సైట్‌ తెరిచింది. కావాల్సినవన్నీ కార్ట్‌లో పెట్టాక చివరగా గుడ్లపైన క్లిక్‌ చేసింది. వరసగా ఒమేగా3, డి-విటమిన్‌, కార్డియో... అంటూ రకరకాల పేర్లతో ఎగ్స్‌ కనిపించాయి. పౌల్ట్రీ గుడ్లు తెలుసు, నాటు కోడి గుడ్లూ తిన్నాం కానీ ఇక్కడ ఇన్ని రకాలున్నాయేంటీ అని ఆరా తీసింది. ఇంతకీ ఆ విషయాలేమిటంటే...

రోజూ ఒక గుడ్డు తింటే ఆరోగ్యానికి ఢోకా ఉండదని చాలామంది చెబుతుంటారు. విటమిన్లూ కాల్షియం, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలతో శరీరానికి ఎంతో మేలు జరుగుతుందన్న మాటా నిజమే. మరైతే పోషకాల నిలయంగా చెప్పే గుడ్డులోనే అదనంగా ఇలాంటి విటమిన్లనూ జత చేస్తే... ‘ఒక్క ఎగ్‌తోనే ఎంతో బలం వస్తుంది కదా’ అనుకున్న ఉత్పత్తిదారులు- బోలెడన్ని వెరైటీ ఎగ్స్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. మార్కెట్లో నాటుకోడి గుడ్లూ పౌల్ట్రీ కోడిగుడ్లూ ఎప్పటి నుంచో ఉన్నాయి. తర్వాత సేంద్రియ కోడిగుడ్లలాంటివీ అందుబాటులోకి వచ్చాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు అందించే కోడి గుడ్డు విలువ అందరికీ అర్థమైంది. ముఖ్యంగా కరోనా తర్వాత చాలా మంది ఇళ్లలో అల్పాహారంలో దీన్నీ భాగం చేశారు. ఆరోగ్యానికీ కోడిగుడ్డుకీ ఉన్న ఈ బలమైన బంధం వల్లే ఇప్పుడు మరికొన్ని కొత్త రకాల గుడ్లూ వస్తున్నాయి.

ఎన్ని రకాలో...

కోళ్లకు పెట్టే ఆహారంలోనే రకరకాల మార్పులు చేస్తూ విటమిన్‌ డి, విటమిన్‌ ఇ, ఒమేగా3, విటమిన్‌ ప్లస్‌ ఎగ్స్‌... ఇంకా అన్నిరకాల విటమిన్లూ ఐరన్‌, జింక్‌, కాపర్‌ లాంటి ఖనిజాలూ ఉండే ఇమ్యూనిటీ బూస్టర్‌ గుడ్లనూ తయారుచేస్తున్నారు. ఉదాహరణకు కోళ్లకు అవిసె గింజల్లాంటి ఒమేగా3 ఫ్యాటీ ఆమ్లాలు ఇచ్చే పదార్థాలతో ప్రత్యేకమైన డైట్‌ ఇస్తూ ‘ఒమేగా3 ఎగ్స్‌’ను తయారుచేస్తారు. కేవలం శాకాహారం అందిస్తూ ‘వెజిటేరియన్‌ ఎగ్స్‌’ని ఉత్పత్తి చేస్తారు. ఒక్కో రకమైన గుడ్డు కోసం కోళ్లకు పెట్టే దాణాలో మార్పులు చేస్తూ ఒక్కో డైట్‌ని డిజైన్‌ చేస్తారన్నమాట.
సాధారణంగా గుడ్డులో ప్రోటీన్‌, అమైనో ఆమ్లాలు, బి కాంప్లెక్స్‌ విటమిన్లు, డి విటమిన్‌, ఇతర ఖనిజాలూ ఉంటాయి. కానీ వీటికి అదనంగా పోషకాల్ని కలుపుతూ ఈ కస్టమైజ్డ్‌ ఎగ్స్‌ని తయారుచేస్తున్నారు. విటమిన్ల గుడ్లు మాత్రమే కాదండోయ్‌, డయాబెటిక్స్‌కి ప్రత్యేకంగా... రక్తంలో చక్కెరస్థాయిని మెరుగుపరిచే క్రోమియం ఖనిజాన్ని చేర్చుతూ ‘డయాబెట్‌ ఎగ్స్‌’నూ, తక్కువ కొవ్వూ ఎక్కువ ప్రోటీన్లతో ఉండే ‘కార్డియో ఎగ్స్‌’నూ, ఫిట్‌నెస్‌ ఫ్రీక్స్‌ కోసం ‘ప్రోటీన్‌ బ్రౌన్‌ ఎగ్స్‌’నూ తీసుకొచ్చారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతూ చిన్నారుల ఎదుగుదలకు అవసరమయ్యే విటమిన్లూ ఖనిజాలూ ఇవ్వాలనుకుంటే... సాధారణ కోడిగుడ్డుకు బదులు ప్రత్యేకమైన ఈ పోషకాల గుడ్లనూ ట్రై చేసి చూడొచ్చు. తమతమ అవసరాల్ని బట్టి పెద్దవాళ్లూ వీటిని తినొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..