అదిగో.. ద్వారక..!

చిలిపికృష్ణుడిగా గోవులకాపరిగా రాధామనోహరునిగా గీతాప్రబోధకునిగా కోట్లాది భక్తుల గుండెల్లో గూడు కట్టుకున్న శ్రీకృష్ణుడి ఆలయాలు దేశవ్యాప్తంగా కోకొల్లలు. కానీ గోమతీనది అరేబియా సముద్రంలో కలిసేచోట నిర్మించిన ద్వారకాధీశుని ఆలయం పౌరాణికంగానూ చారిత్రకంగానూ ఎంతో ప్రసిద్ధి చెందింది.

Updated : 03 Sep 2023 04:01 IST

చిలిపికృష్ణుడిగా గోవులకాపరిగా రాధామనోహరునిగా గీతాప్రబోధకునిగా కోట్లాది భక్తుల గుండెల్లో గూడు కట్టుకున్న శ్రీకృష్ణుడి ఆలయాలు దేశవ్యాప్తంగా కోకొల్లలు. కానీ గోమతీనది అరేబియా సముద్రంలో కలిసేచోట నిర్మించిన ద్వారకాధీశుని ఆలయం పౌరాణికంగానూ చారిత్రకంగానూ ఎంతో ప్రసిద్ధి చెందింది. అందుకే ఏటా లక్షలాదిమంది ఆ ఆలయంలో కొలువుదీరిన ఆ దేవకీసుతుణ్ణి దర్శించుకుని జన్మ ధన్యమైనట్లుగా భావిస్తుంటారు.

సుప్రసిద్ధ 108 వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ద్వారక ఒకటి. అక్కడి ద్వారకాధీశుని ఆలయం గుడిమీద గుడి... మందిరం పక్కన మందిరం... చెక్కినట్లుగా అద్భుతమైన వాస్తునిర్మాణంతో ఉంటుంది. కృష్ణుడి మునిమనుమడైన వజ్రనాభుడు, నాడు కృష్ణుడి రాజనివాసం ఉన్న ప్రాంతంలోనే మొదట ఈ ఆలయాన్ని కట్టించాడట. నాటి ఆలయం మునిగిపోవడంతో దానిమీదనో పక్కనో మళ్లీమళ్లీ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మందిరం కూడా ఒక కాలానికి చెందినది కాదు. క్రీ.శ.8 నుంచి 18వ శతాబ్దం వరకూ కడుతూ వచ్చిన సముదాయం అంటున్నారు. 72 స్తంభాలతో ఐదు అంతస్తులతో చాళుక్యుల శైలిలో ఉన్న ప్రధాన ఆలయాన్ని 16వ శతాబ్దంలో కట్టినట్లు భావిస్తున్నారు. ఇక్కడ కృష్ణుడిని ద్వారక రాజ్యాధిపతిగా భావించడంవల్లే ఆలయానికి ద్వారకాధీశ్‌ అని పేరు. ఈ ఆలయాన్ని జగత్‌ మందిర్‌ అనీ పిలుస్తారు. సున్నపురాతితో నిర్మించిన ఈ ఆలయానికి రెండు శిఖరాలు ఉన్నాయి. నాగరా శైలిలో ఎత్తుగా కట్టిన ప్రధాన శిఖరం కిందనే గర్భాలయం ఉంటుంది. ఆలయ స్తంభాలు చక్కని శిల్పకళతో కనువిందు చేస్తుంటాయి. నల్లరాతిమీద 2.25 అడుగుల ఎత్తులో శంఖ, చక్ర, గద, పద్మాలతో చతుర్భుజుడుగా దర్శనమిచ్చే ఆ ద్వారకాధీశుణ్ని చూసేందుకు రోజూ వేలాదిమంది భక్తులు తరలి వస్తుంటారు. జన్మాష్టమిరోజున ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుంది.

రోజుకి పదకొండుసార్లు..!

గర్భాలయంలో కొలువైన ఆ నల్లనయ్యను నిత్యం రకరకాలుగా అలంకరించడమే కాదు, రోజుకి పదకొండుసార్లు భోగ్‌(ప్రసాద)సేవలతో సంతుష్టిపరుస్తుంటారు. భక్తులూ భోగ్‌ను నైవేద్యంగా నివేదించవచ్చు. ఆ లడ్డూగోపాలుడికి జన్మాష్టమినాడు చప్పన్‌ భోగ్‌ తప్పనిసరి. ఇక్కడే కాదు, ఆరోజున అన్ని కృష్ణ మందిరాల్లోనూ 56 రకాల ప్రసాదాల్ని నివేదిస్తారు. బాలకృష్ణుడు గోకులవాసుల్ని రక్షించేందుకు గోవర్థన పర్వతాన్ని ఏడు రోజులపాటు ఏమీ తినకుండా చిటికెన వేలుమీద మోశాడు. కృష్ణుడు మూమూలుగా రోజుకి ఎనిమిదిసార్లు భోజనం చేసేవాడు. దాంతో గోకులవాసులు ఆ ఏడు రోజుల భోజనాన్నీ 56 వంటకాలుగా వండిపెట్టి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. అందుకే జన్మాష్టమి రోజున 56 వంటకాలతో కూడిన చప్పన్‌భోగ్‌ నివేదన సంప్రదాయంగా వస్తోంది. జన్మాష్టమితోపాటు అన్నకూట్‌ ఉత్సవాన్నీ ఇక్కడ వైభవంగా జరుపుతారు.

ఆలయానికి వెళ్లేందుకు గోమతి ఘాట్‌ నుంచి స్వర్గద్వారం, మోక్షద్వారం అని రెండు ద్వారాలు ఉన్నాయి. స్వర్గ ద్వారం వైపు 56 మెట్లు ఉన్నాయి. ఇవి 56 కోట్ల యాదవులకు సంకేతమట. భక్తులు స్వర్గద్వారం నుంచి వెళ్లి కృష్ణ పరమాత్మను దర్శించుకుని మోక్షద్వారం గుండా బయటకు వస్తారు. ద్వాపర యుగంలో రుక్మిణీదేవి తులసిఆకుతో సరితూగిన శ్రీకృష్ణుణ్ణి గుర్తుతెస్తూ తులాదాన్‌ను నిర్వహించడం ఈ ఆలయానికున్న మరో ప్రత్యేకత.

ద్వారకాధీశ్‌ ఆలయంలో దేవకి, జాంబవతి, సత్యభామ విగ్రహాలతోపాటు సమీపంలో బలరాముడు, కృష్ణుడి కుమారుడు ప్రద్యుమ్నుడు, మనుమడు అనిరుద్ధుడికీ శివకేశవులకీ ప్రత్యేక పూజాస్థానాలున్నాయి. కానీ రుక్మిణీ మందిరిం ఆ ప్రాంగణంలో కనిపించదు. దుర్వాసుడి శాపం వల్లే ఆమె మందిరాన్ని కృష్ణుడి సన్నిధికి దూరంగా నిర్మించారట. ఒకసారి దుర్వాస రుషిని భోజనానికి ఆహ్వానించి, తమ నివాసానికి తోడ్కొని వెళుతున్న సమయంలో రుక్మిణీదేవికి దాహం వేయడంతో కృష్ణుడు, కాలితో నేలను తవ్వి ఆమె దాహం తీర్చాడట. తనను పట్టించుకోకుండా రుక్మిణీదేవికి కృష్ణుడు నీళ్లు ఇచ్చాడన్న కోపంతో ఆమెను కృష్ణుడికి దూరంగా ఉండమనీ, అలాగే తనకి నీరివ్వని అక్కడి నేలంతా ఉప్పుమయం కావాలని శపించాడట. రుక్మిణీ ఆలయంలో భక్తులు విరాళంగా నీళ్లివ్వడానికీ, ద్వారకలోని గోమతీ నదీజలాలు ఉప్పగా ఉండటానికీ ఇదే కారణమనీ అంటారు.

ధ్వజారోహణం ద్వారకాధీశ్‌ మందిర్‌కున్న మరో ప్రత్యేకత. ఈ జెండాను రోజుకు ఐదుసార్లు మారుస్తారు. ఈ జెండాను మార్చిన ప్రతీసారి పూజలు నిర్వహించి బ్రాహ్మణులందరికీ భోజనం పెడతారట. జెండాను మార్చే ప్రక్రియను భక్తులే నిర్వహిస్తుంటారు. పతాకాన్ని తలపై మోస్తూ శ్రీకృష్ణుని కీర్తిస్తూ నర్తిస్తూ తీసుకొస్తారట. దీన్ని దేవుడికి సమర్పించాక పూజారుల్లో ఒకరు పైకి వెళ్లి పతాకాన్ని మారుస్తారు. ఈ జెండా 52 చిన్న జెండాల సమాహారంగానూ 52 గజాల కొలతతోనూ సూర్యచంద్రుల బొమ్మలతోనూ ఉండాలి.

ఆ సూర్యచంద్రులు ఉన్నంత వరకూ ఈ ఆలయం నిలిచి ఉంటుందనే అర్థంతోనే జెండామీద ఆ బొమ్మలు వేస్తారట. ఇక, 52 సంఖ్య యాదవుల్లోని 52 ఉపకులాలకి సంకేతం. నలుపు మినహా ఏ రంగులోనైనా జెండా ఉండొచ్చు. వీటిని కుట్టేందుకు ప్రత్యేక టైలర్లు ఉంటారు. ఈ రకమైన పతాక సంప్రదాయం మరే ఆలయంలోనూ కనిపించదు.

బేట్‌ ద్వారక!

ద్వారకాధీశ్‌ ఆలయానికి సమీపంలో కృష్ణుడు గోపికలతో ఆడిన గోపీ తలావ్‌ అన్న ప్రదేశం ఉంటుంది. కృష్ణుడికి దూరంగా ఉండలేని గోపికలు ఇక్కడకు వచ్చి, చివరిసారిగా అతనితో నృత్యం చేసి, ప్రాణాలు విడిచి ఇక్కడి మట్టిలో కలిసిపోయారట. ఆ ప్రాంతాన్నే ఇప్పుడు గోపీ చందన్‌గా పిలుస్తూ నుదుట బొట్టుగా పెట్టుకుంటారు భక్తులు. ద్వారక నుంచి ఓఖా వెళ్లే మార్గంలో రుక్మిణీదేవి సన్నిధి పేరుతో ఓ ఆలయం ఉంటుంది. దీన్ని రుక్మిణీ కల్యాణం జరిగిన ప్రదేశంగా చెబుతారు. అయితే ద్వారకను సందర్శించినవాళ్లంతా కృష్ణుడు తన అష్టమహిషులతో నివసించాడని భావించే బేట్‌ లేదా బెట్‌ ద్వారకను చూడకుండా వెనుతిరగరు. ఇది సముద్రంలో ఉన్న చిన్న ద్వీపం. మహాభారతంలోని సభాపర్వంలో ‘అంతర్ద్వీప’గా పిలిచినది ఇదేనట. చుట్టూ నీరు ఉండటాన్నే గుజరాతీలో బేట్‌ అంటారనీ అందుకే దీనికి బేట్‌ ద్వారక అన్న పేరు వచ్చిందనీ చెబుతారు. బాల్యస్నేహితుడైన సుధామ కృష్ణుడిని ఇక్కడే కలిశాడనీ భెంట్‌ అంటే సమావేశం కాబట్టి ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందనీ అంటారు. ఇందుకు గుర్తుగా కృష్ణుడికి భక్తులు అన్నాన్ని నివేదిస్తుంటారు. ఇది ఆయన నివాసస్థలం కాబట్టి ఇక్కడి ఆలయం కూడా భవంతిలానే ఉంటుంది. కృష్ణభగవానుడు ఉదయాన్నే కళ్లు తెరిచి తన తల్లిని చూసేవాడన్న నమ్మకంతో ప్రధాన ఆలయానికి ఎదురుగా దేవకీ దేవాలయాన్నీ నిర్మించారు. ఈ ద్వీపంలోని రుక్మిణీ ఆలయం కళాత్మకంగా చూడ్డానికి బాగుంటుంది. కొత్తగా కట్టించిన సోనాని దేవత మ్యూజియంలో కృష్ణుడి లీలల్ని తెలిపే చిత్రాలను చూస్తూ ద్వాపరయుగంలోకి వెళ్లిపోతుంటారు భక్తులు.

శ్రీకృష్ణ ద్వారక!

ద్వారక... కృష్ణుడు నడయాడిన నేల... భగవంతుడి పాదస్పర్శతో పునీతమైన భూభాగం... శ్రీకృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన సుందర నగరం... ఇలా ఎన్నో పవిత్ర భావనలతో ముడిపడిన పుణ్యక్షేత్రం. ఇక్కడికి సమీపంలోని బేట్‌ద్వారక అనే దీవిలోనే కృష్ణుడు నివసిస్తూ ద్వారకను రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని పాలించినట్లు చెబుతారు. యాదవులతోపాటు అంధకులు, వృష్టులు, భోజులు కూడా ఈ రాజ్యంలో భాగంగా ఉండేవారనీ; వాణిజ్య కూడళ్లూ, నివాసాలూ, రాజమార్గాలూ అందమైన కట్టడాలతో ద్వారక స్వర్గాన్ని తలపించేదనీ అంటారు. అందుకే దీన్ని స్వర్ణ ద్వారక అనీ పిలిచేవారు. మహాభారతం, హరివంశం, వాయు పురాణం, భాగవతాల్లో ద్వారక గురించిన అనేక వర్ణనలు కనిపిస్తాయి. కంసుడు మరణంతో కృష్ణుడిమీద పగ పెంచుకున్న జరాసంధుడు మధుర మీద చేస్తోన్న దాడులకు విసుగెత్తిన కృష్ణుడు, గోమతీ నది సముద్రంలో కలిసే చోట సురక్షిత సుందర ద్వారకను నిర్మించాడనీ, ఆయన మరణానంతరం సముద్రంలో వచ్చిన ప్రళయానికి అది మునిగిపోయిందనీ, అర్జునుడు దీన్ని ప్రత్యక్షంగా చూశాడనీ... పురాణాలు చెబుతున్నాయి. వాటి ప్రకారం- కురుక్షేత్ర యుద్ధం జరిగిన 36 సంవత్సరాల తరవాత ఈ నగరం సముద్రంలో కలిసిపోయింది. ఆ కాలానికి చెందిన నగర ఆనవాళ్లు సముద్రం అడుగున ఉన్నట్లు ప్రముఖ ఆర్కియాలజిస్టులూ చెబుతున్నారు. ఆనాటి శ్రీకృష్ణ ద్వారక సాగర గర్భంలో కలిసిపోతేనేం... ఆ ప్రాంతంలోనే వెలసిన నేటి ద్వారక, కర్మఫలం నుంచి విముక్తిని ప్రసాదించి, మోక్షాన్ని కలిగించే సప్తమోక్షపురిల్లో ఒకటిగా అశేష భక్తుల నీరాజనాలు అందుకుంటోంది!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు