Anand Mahindra: ఆ క్షణంలో నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి..!

ఆనంద్‌ మహీంద్రా.. తాజాగా ట్విటర్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేసి, తన ఉద్విగ్నతను అక్షర రూపంలో పంచుకున్నారు. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ మాజీ డ్రిల్‌ ఇన్‌స్ట్రక్టర్‌ సన్మాన కార్యక్రమానికి సంబంధించిన ఆ వీడియోలో.. ఆయన సెల్యూట్‌ చేసిన సమయంలో తన రోమాలు నిక్కబొడుచుకున్నాయని పేర్కొన్నారు.

Updated : 03 Oct 2022 22:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా(Anand Mahindra).. తాజాగా ట్విటర్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేసి, తన ఉద్విగ్నతకు అక్షరరూపం ఇచ్చారు. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ(NDA) మాజీ డ్రిల్‌ ఇన్‌స్ట్రక్టర్‌ సన్మాన కార్యక్రమానికి సంబంధించిన ఆ వీడియోలో.. వందేళ్ల వయసు కలిగిన ఆయన సెల్యూట్‌ చేసిన సమయంలో తన రోమాలు నిక్కబొడుచుకున్నాయని పేర్కొన్నారు. ‘వందో పుట్టిన రోజు సందర్భంగా ఎన్డీయే మాజీ డ్రిల్‌ ఇన్‌స్ట్రక్టర్‌ సుబేదార్‌ మేజర్‌ గోవింద స్వామిని సత్కరించారు. వృత్తి జీవితంలో ఆయన ఏడుగురు భారత ఆర్మీ జనరల్స్‌కు శిక్షణ ఇచ్చారు. గురువులను గౌరవించడం మన భారతీయ సంప్రదాయం. ఈ వీడియోలో ఆయన సెల్యూట్ చేసిన క్షణంలో నాకు గూస్‌బంప్స్ వచ్చాయి’ అని క్యాప్షన్‌ పెట్టారు.

బెంగళూరులో ‘మద్రాస్‌ సాపర్స్‌ డే’ వేడుకల వేళ ఈ సత్కార కార్యక్రమం నిర్వహించారు. గోవింద స్వామి సేవలకు గుర్తింపుగా ఆయన ప్రతిమను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ‘మద్రాస్ సాపర్స్‌ డ్రిల్ ఐకాన్ కెప్టెన్‌ గోవిందస్వామి స్వయంగా తన విగ్రహాన్ని ఆవిష్కరించారు. రిపబ్లిక్/ఆర్మీ డే పరేడ్ సందర్భంగా బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్ ట్రోఫీని మద్రాస్‌ సాపర్స్‌ తొమ్మిదిసార్లు గెలుచుకోవడం వెనుక ఆయన పాత్ర ఉంది’ అని ఆర్మీ సదరన్‌ కమాండ్‌ పేర్కొంది. మరోవైపు ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌పై నెటిజన్లూ ఉద్వేగభరితులయ్యారు! ‘మా అన్నయ్య, మేనల్లుళ్లిద్దరూ ఆయన కింద శిక్షణ పొందారు’ అని ఒకరు స్పందించారు. ‘ఆయన దేశానికి విశేష సేవలందించారు. ఇలాంటి సన్మానం లభించడం చూస్తుంటే సంతోషంగా ఉంది’ అని మరొకరు కామెంట్‌ పెట్టారు. ‘నిజమే.. గూస్‌బంప్స్‌ రప్పించే క్షణాలివి.. సెల్యూట్‌ సర్‌’ అని మరొకరు ట్వీట్‌ చేశారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని