Idli ATM: ఐడియా అదుర్స్‌.. నిమిషాల్లో వేడివేడి ఇడ్లీ చేతికి.. ఈ ఇడ్లీ ATM చూశారా?

నగదు విత్‌డ్రా చేసే ఏటీఎంల గురించి మనందరికీ తెలుసు.. రైస్‌, వాటర్‌ ఏటీఎంలూ చూశాం. కానీ, బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్‌ కంపెనీ ఏ సమయంలోనైనా ఆకలి తీర్చేలా వినూత్న ఏటీఎం(ATM)ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే ఇడ్లీ ఏటీఎం(Idli ATM).

Updated : 14 Oct 2022 19:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నగదు విత్‌డ్రా చేసే ఏటీఎంల గురించి మనందరికీ తెలుసు.. రైస్‌, వాటర్‌ ఏటీఎంలూ చూశాం. కానీ, బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్‌ కంపెనీ ఏ సమయంలోనైనా ఆకలి తీర్చేలా వినూత్న ఏటీఎం(ATM)ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే ఇడ్లీ ఏటీఎం(Idli ATM). కేవలం నిమిషం వ్యవధిలోనే ఇడ్లీలను సరఫరా చేసి ఆకట్టుకుంటోన్న ఈ ఏటీఎం వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. బెంగళూరుకు చెందిన శరణ్‌ హిరేమత్‌, సురేష్‌ చంద్రశేఖరన్‌ అనే ఇద్దరు వ్యక్తులు ఏర్పాటు చేసిన ఫ్రెషాట్‌ రోబొటిక్స్‌ (Freshot Robotics) అనే స్టార్టప్‌ కంపెనీ దీన్ని రూపొందించింది. ఈ యంత్రాన్ని ఇడ్లీ బాట్‌ లేదా ఇడ్లీ ఏటీఎంగా పేర్కొంటున్నారు. ఈ యంత్రం ఇడ్లీ తయారీ నుంచి ప్యాకేజీ, సరఫరా వరకు మొత్తం ప్రక్రియంతా ఇట్టే చకచకా చేసేస్తుంది.

12 నిమిషాల్లో 72 ఇడ్లీలు..

బెంగళూరు నగరంలో ఏర్పాటు చేసిన ఈ ఆటోమేటిక్‌ ఇడ్లీ తయారీ యంత్రం 24×7 ఇడ్లీలను సప్లయ్‌ చేస్తుంది. కేవలం 12 నిమిషాల్లోనే 72 ఇడ్లీలు సప్లయ్‌ చేయగలదు. వీటితో పాటు పొడి, చట్నీలతో చక్కగా ప్యాక్‌ చేసి ఇస్తుంది. వీటిని అక్కడే తినొచ్చు లేదంటే ఇంటికి పార్సిల్‌ తీసుకెళ్లొచ్చు కూడా. ఈ వీడియో చూస్తే ఏటీఎం నుంచి ఇడ్లీ పొందడం ఎంత సులువో అర్థమవుతుంది. ఏటీఎం వద్ద ఏర్పాటు చేసిన క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేస్తే.. వచ్చే మెనూలో ఆర్డర్‌ చేయాలి. ఆ తర్వాత ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేస్తే కేవలం 55 సెకన్లలోనే వేడి వేడి ఇడ్లీల పార్శిల్‌ మీ చేతిలో పడుతుంది. 

ఆలోచన అలా మొదలైంది..

కంప్యూటర్‌ ఇంజినీర్‌ హిరేమత్‌కు ఒక రోజు రాత్రి ఎదురైన చేదు అనుభవమే ఈ వినూత్న ఆలోచన పురుడు పోసుకొనేందుకు కారణమైంది. 2016లో తన కుమార్తె అనారోగ్యానికి గురైనప్పుడు అర్ధరాత్రి పూట ఎక్కడా వేడి వేడి ఇడ్లీలు దొరకక చాలా ఇబ్బంది పడ్డారట. నిరంతరం ఇలాంటి ఆహారం దొరకాలంటే ఆటోమెటిక్‌ యంత్రమే ఏకైక మార్గమని తనకు అనిపించిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. అల్పాహారం కోసం దక్షిణ భారతదేశంలో ఏర్పాటైన తొలి ఆటోమేటెడ్‌ కుకింగ్‌ పంపిణీ యంత్రం ఇదే కావడం విశేషం. ప్రస్తుతం బెంగళూరులోని రెండు చోట్ల ఈ ఇడ్లీ ఏటీఎంలను ఏర్పాటు చేశారు. వీటిని దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు విస్తరించే ఆలోచన ఉన్నట్టు వారు తెలిపారు. భవిష్యత్తులో దోసె బోట్స్‌, రైస్‌బోట్స్‌, జ్యూస్‌బోట్స్‌ వంటి ఏటీఎంలను కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్టు తెలిపారు.




గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని