Viral Video: పాఠశాల టాయ్‌లెట్లను శుభ్రం చేసిన ఎంపీ.. ఖాళీ చేతులతోనే..!

మధ్యప్రదేశ్‌కు చెందిన భాజపా ఎంపీ జనార్దన్‌ మిశ్రా ఓ పాఠశాల మరుగుదొడ్లను శుభ్రం చేశారు. అయితే, ఆయన ఎలాంటి బ్రష్‌ సాయం లేకుండా ఖాళీ చేతులతో ఈ పనిచేయడం గమనార్హం..........

Published : 23 Sep 2022 20:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మధ్యప్రదేశ్‌కు చెందిన భాజపా ఎంపీ జనార్దన్‌ మిశ్రా ఓ పాఠశాల మరుగుదొడ్లను శుభ్రం చేశారు. అయితే, ఆయన ఎలాంటి బ్రష్‌ సాయం లేకుండా ఖాళీ చేతులతో ఈ పనిచేయడం గమనార్హం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. భాజపా యూత్‌ వింగ్‌ భాజపా యువమోర్చా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘సేవా పఖ్‌వాడా’ కార్యక్రమాన్ని చేపడుతోంది. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్‌ 17 నుంచి ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని అక్టోబర్‌ 2న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా  ముగించనున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగానే మధ్యప్రదేశ్‌ రేవాలోని ఖట్కారి బాలికల పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని భాజపా యువ మోర్చా సభ్యులు చేపట్టారు. ఇందుకు ఆ నియోజకవర్గ ఎంపీ జనార్దన్‌ మిశ్రానును ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పాఠశాలను పరిశీలించిన ఎంపీ.. మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించారు. దీంతో వాటిని స్వయంగా ఆయనే శుభ్రం చేశారు. అయితే, శుభ్రం చేసేందుకు మిశ్రా ఎలాంటి బ్రష్‌ వాడలేదు. ఖాళీ చేతులతోనే క్లీన్ చేశారు. కాగా, ఈ వీడియోను ఎంపీ ట్విటర్‌లో పంచుకోగా అది ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. కార్యక్రమంలో మిశ్రా మాట్లాడుతూ.. ఎవరి పరిసరాలను వారే శుభ్రంగా ఉంచుకోవాలనే మహాత్మాగాంధీ, ప్రధాని మోదీ నినాదాన్ని గుర్తుచేశారు. తాను ఇలా శుభ్రం చేయడం ఇదే మొదటిసారి కాదు అని కూడా పేర్కొన్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని