Viral Video: బల్బు ఎత్తుకెళ్లిన కానిస్టేబుల్‌.. వీడియో వైరల్‌!

చోరీ కేసులో ఓ పోలీసు కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌ అయ్యారు. ఇంతకు ఆయన దొంగిలించింది ఏం వస్తువు అని ఆలోచిస్తున్నారా? ఒక విద్యుత్‌ ‘బల్బు’. ఎవరూ లేనిది చూసి.. ఒక దుకాణం బయట అమర్చిన ఓ బల్బును ఆయన గుట్టుగా ఎత్తుకెళ్లడం గమనార్హం.

Published : 15 Oct 2022 19:13 IST

లఖ్‌నవూ: దొంగతనాలను నివారించాల్సిన ఓ పోలీసు కానిస్టేబులే.. చోరీ కేసులో సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇంతకు ఆయన దొంగిలించింది ఏం వస్తువు అని ఆలోచిస్తున్నారా? ఒక విద్యుత్‌ ‘బల్బు(Bulb)’. ఎవరూ లేనిది చూసి.. ఒక దుకాణం బయట అమర్చిన ఓ బల్బును ఆయన గుట్టుగా ఎత్తుకెళ్లడం గమనార్హం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌(Prayagraj) జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఫూల్‌పుర్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ రాజేశ్‌ వర్మ.. ఇటీవల రాత్రిపూట గస్తీ విధులకు వెళ్లాడు. ఇందులో భాగంగా నడుచుకుంటూ.. ఓ మూసిఉన్న దుకాణం వద్దకు చేరుకున్నాడు. అటు ఇటు చూసి.. ఎవరూ లేరని నిర్ధారించుకుని.. అక్కడే బయట అమర్చిన ఓ బల్బును తీసి జేబులో పెట్టుకున్నాడు. అనంతరం మెల్లిగా అక్కడినుంచి జారుకున్నాడు. మరుసటి రోజు బల్బు మాయమైన విషయాన్ని గమనించిన దుకాణదారుడు.. సీసీటీవీ ఫుటేజీలను తనిఖీ చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది.

మరోవైపు.. ఈ ఫుటేజీ కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కానిస్టేబుల్‌ ప్రవర్తనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. ఆయన్ను విధుల్లోంచి తొలగించారు. ఆయనకు ఇటీవలే పదోన్నతి వచ్చింది. అయితే, తనకు విధులు కేటాయించిన చోట చీకటిగా ఉన్నందున.. ఇక్కడి బల్బును తీసి అక్కడ అమర్చినట్లు ఆయన పేర్కొనడం గమనార్హం. ఇటీవలి కాలంలో యూపీ పోలీసులపై విమర్శలకు అవకాశం ఇచ్చిన రెండో ఘటన ఇది. కొద్ది రోజుల క్రితం కాన్పూర్‌లో పేవ్‌మెంట్‌పై నిద్రిస్తున్న వ్యక్తి జేబులోంచి సెల్‌ఫోన్ దొంగిలిస్తూ ఓ పోలీసు పట్టుబడ్డాడు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని