తనో తీయనిస్నేహగీతం!

చిన్నప్పటి నుంచీ నాకు బిడియం ఎక్కువ. ఎవరితోనూ త్వరగా కలవలేను. అమ్మాయిల గురించి అయితే వేరే చెప్పక్కర్లేదు....

Updated : 07 Dec 2019 00:52 IST

చిన్నప్పటి నుంచీ నాకు బిడియం ఎక్కువ. ఎవరితోనూ త్వరగా కలవలేను. అమ్మాయిల గురించి అయితే వేరే చెప్పక్కర్లేదు. ఎప్పుడూ ఆమడ దూరంలోనే ఉండేవాడిని. అలాంటి నా జీవితంలో బీటెక్‌ పెద్ద ఛేంజోవర్‌ అనొచ్ఛు కారణం గీతాంజలి. నా క్లాస్‌మేట్‌. తన ప్రవర్తన, మాటతీరు, కలుపుగోలుతనం ఎవ్వరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. నేను చదువులో ముందుండేవాడిని. దీంతో తను కాలేజీకి రాకపోయినా, ఏవైనా సందేహాలున్నా నన్ను అడిగి తెలుసుకునేది. కంబైన్డ్‌ స్టడీస్‌తో మా స్నేహం మొదలయ్యింది. తన ఇష్టాలు, సమస్యలూ అన్నీ నాతో పంచుకునేది. ‘నీతో ఉన్నంత సేపు నాకసలు సమయమే తెలీదు. నువ్వో కొత్త ప్రపంచాన్ని చూపించావ్‌. తక్కువ సమయంలో నా క్లోజ్‌ ఫ్రెండుగా మారింది నువ్వే!’ అంటూ తను నా గురించి చెబుతుంటే నాకు నేనే కొత్తగా కనిపించా. తను నా పట్ల తీసుకునే శ్రద్ధ నన్ను తన వైపు ఆకర్షించింది. తనని ఇష్టపడేలా చేసింది. అది ప్రేమా? లేదా ఆకర్షణా? అని తేల్చుకోలేకపోయా. తన వెంటే ఉండాలనిపించేది. నువ్వంటే ఇష్టం అని చెబుదామంటే.. తన స్థాయికి నేను సరిపోనని అనిపించేది. కొంచెం సమయం తీసుకుని నా ఇష్టాన్ని తెలపాలనుకున్నా..

అన్నీ మనం ఊహించినట్టు జరగవుగా. ఓ రోజు ‘నేనొకరిని ఇష్టపడుతున్నా.. తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా’ అని చెప్పింది. నాకేం అర్థం కాలేదు. తేరుకుని తను ప్రేమ సంగతుల్ని విన్నా. ఎలా స్పందించాలో తెలియలేదు. అది మొదలు మునుపటిలా తనతో ఉండలేకపోయా. తనని చూస్తే ఎక్కడ నా ప్రేమ విషయం చెప్పేస్తానేమో అని కలవడమే మానేశా. నేను ఎందుకిలా ప్రవర్తిస్తున్నానో గీతకి అర్థం అయ్యేది కాదు. నాలో కేవలం తనో మంచి స్నేహితుడిని మాత్రమే చూసిందని అర్థం చేసుకోవడానికి పెద్దగా సమయం పట్టలేదు. మనసులో ప్రేమని పెట్టుకుని తనతో ఫ్రెండులా ఉండలేకపోయా. దూరం పెంచుకుని బీటెక్‌ పూర్తి చేశా. ఉన్నత చదువులకి తను హైదరాబాద్‌ వెళ్లిపోతే నేనోమో ఇక్కడే జాబ్‌ వేటలో పడ్ఢా కాలం గడుస్తోంది..

ఓ రోజు ఫోన్‌ కాల్‌. ‘హ్యాపీ బర్త్‌డే రా..’ అని.. తన గొంతే. వినగానే ఏదో తెలియని ఉల్లాసం. మాట్లాడుతూ తన లవ్‌ బ్రేకప్‌ గురించి చెప్పింది. గీత ఆలోచనల్లో ఎంతో పరిపక్వత కనిపించింది. జాబ్‌ అన్వేషణలో ఉన్నానని చెప్పింది. దాటొచ్చిన జర్నీ గురించి ఎన్నో మాట్లాడింది. అది మొదలు మళ్లీ.. తను ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నా సలహాతోనే. ఇన్నేళ్లూ తనకి ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందో చెప్పాల్సిన సమయం ఇదే అనిపించింది. నేను తనని ప్రేమించిన విషయం చెప్పాను. అప్పుడు తన ఇలా హుందాగా స్పందించింది. ‘అప్పట్లో నువ్వు చెప్పకపోవడమే మంచిది అయ్యింది. అప్పటి పరిస్థితుల ప్రభావంతో మనం దూరమయ్యేవారిమేమో.. నీ లాంటి ఓ మంచి స్నేహితుడిని కోల్పోయేదాన్ని.. శ్రీను ఇకపై నా లైఫ్‌లో ప్రేమకి చోటు లేదు. చిరకాలం ఓ మంచి స్నేహితుడిగా తోడుంటావా?’ అని. నాకు చాలా స్పష్టంగా అర్థమయ్యింది. ప్రేమకీ, స్నేహానికీ ఉన్న తేడా ఏంటో. తను ఎప్పటికీ నాలో కోరింది స్నేహమే అని! అలాంటి ఓ మంచి స్నేహితురాలిని వదులుకోవాలనిపించలేదు. అందుకే తనకి మాటిచ్ఛా జీవితాంతం మంచి స్నేహితునిగా ఉంటా అని. తనకి పెళ్లి అయ్యింది. తీరిక లేని బాధ్యతలు. మా మధ్య మాటలు తగ్గాయి. జ్ఞాపకాలు మిగిలాయి. తనతో స్నేహగీతం ఎప్పటికీ మరువలేను.

- శ్రీనివాస్‌, విశాఖపట్నం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని