చెత్తకు స్మార్ట్‌ చెక్‌!

చెత్త ఎందుకిలా పేరుకుపోతోందని ఆలోచించాడో కుర్రాడు.. దాన్ని ఆపే దిశగా అడుగులు వేశాడు.. చదివిన టెక్నాలజీని వాడుకున్నాడు. అంతే.. ప్రధానమంత్రి ప్రకటించడానికి ఒకడుగు ముందే ‘స్వచ్ఛ భారత్‌’ పేరుతో యాప్‌ని రూపొందించాడు.

Published : 13 Jul 2019 00:11 IST

అంకురార్పణ

చెత్త ఎందుకిలా పేరుకుపోతోందని ఆలోచించాడో కుర్రాడు.. దాన్ని ఆపే దిశగా అడుగులు వేశాడు.. చదివిన టెక్నాలజీని వాడుకున్నాడు. అంతే.. ప్రధానమంత్రి ప్రకటించడానికి ఒకడుగు ముందే ‘స్వచ్ఛ భారత్‌’ పేరుతో యాప్‌ని రూపొందించాడు. తర్వాత దాన్నే స్టార్టప్‌గా మలచి ‘అంతరిక్ష్’ పేరుతో నడుపుతున్నాడు.. ఆ చిన్నోడు ఎవరంటే? మహేక్‌ ఎం షా. హైదరాబాదీనే. ఇంతకీ ఏంటీ అంతరిక్ష్? అని అడిగితే ‘ఈ-తరం’తో తన జర్నీని పంచుకున్నాడిలా..

మొదట్నుంచీ ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌లంటే ఇష్టం. ప్రతిదాన్నీ నిశితంగా పరిశీలించేవాడిని. ఆ ఆసక్తితోనే ఐఐటీ మద్రాసులో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశా.. తర్వాత హైదరాబాద్‌లోని ఓ ట్రేడింగ్‌ కంపెనీలో మూడేళ్లు పని చేశా. ఆ అనుభవంతో ఈ- కామర్స్‌ రంగంలో అంకుర సంస్థ స్థాపించా. వాస్తవ పరిస్థితులు తెలియక కొద్ది నెలల్లోనే కంపెనీని మూసేయాల్సి వచ్చింది. తర్వాత ఇటలీ వెళ్లి అక్కడ డిజైన్‌, ఎనర్జీ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ పూర్తి చేసి తిరిగి ఇండియా వచ్చా. ఐఐటీ మద్రాసులో నాతో పాటు చదివిన కొందరు మిత్రులు, సీనియర్లు కలిసి స్టార్ట్‌ చేసిన కంపెనీలో ప్రొడక్ట్‌ మేనేజర్‌గా కొత్త బాధ్యత తీసుకుని 30కి పైగా ప్రొడక్ట్స్‌ని తయారు చేశా. అక్కడా ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. అప్పుడే నాదైన ముద్ర వేసేలా ఏదైనా కొత్తగా స్టార్ట్‌ చేయాలనుకున్నా. అదీ సమాజ హితం కోరేదై ఉండాలని అన్వేషించా. మనకున్న ప్రధాన సమస్యల్లో చెత్త కుప్పలుగా పేరుకుపోవడం నాలో ఆలోచనకి పునాది అయ్యింది. పారిశుద్ధ్య కార్మికులు వారానికి ఒకటి రెండు సార్లు వచ్చి చెత్త సేకరిస్తున్నారు. ఒక్కోసారి చెత్త పూర్తిగా నిండిపోయి దుర్వాసన వస్తున్నా పట్టించుకునేవారుండరు. ప్రతిసారీ మున్సిపాలిటీ సిబ్బందికి ఫిర్యాదు చేయాలన్నా కష్టమే. మరేంటి దీనికి పరిష్కారం? అని ఆలోచించా. అలా పుట్టిందే ‘స్వచ్ఛ భారత్‌’ యాప్‌.

నేనే ముందు..
ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడానికి ముందే 2014లో దీన్ని రూపొందించాను. దీంతో మీ ఇంటి పక్కన, మీ వీధిలోని గార్బేజీ బిన్‌లో చెత్త పేరుకుపోతే, ఒక ఫొటో తీసి ఈ యాప్‌లో పోస్ట్‌ చేయాలి.. సంబంధిత ఫొటో నేరుగా ప్రధాని కార్యాలయ ట్విటర్‌ అకౌంట్‌కి చేరుతుంది.. ఇలా పేరుకుపోయిన చెత్తను ఫొటోల రూపంలో పీఎం కార్యాలయానికి చేరవేయడమే ఈ యాప్‌ పని. రోజులో చాలా ఫిర్యాదులు వచ్చేవి. ఇప్పటికి సుమారు లక్షన్నర ఫిర్యాదులు ఈ యాప్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చేరాయి. చాలా సమస్యలు పరిష్కారమయ్యాయి కూడా.. ఇదే అంతరిక్ష్ అనే నూతన అంకుర సంస్థ స్థాపనకి ప్రేరణగా నిలిచింది.

మొదటి పదిలో మేము..
ఏటా నూతన అంకురాలను ప్రోత్సహించేందుకు క్వాల్‌కం కంపెనీ పోటీలు నిర్వహిస్తుంది ఈ ఏడాది పోటీలో వందకు పైగా అంకుర సంస్థలు పాల్గొన్నాయి. ఇందులో మొదటి పది స్థానాల్లో నిలిచిన సంస్థల్లో మా అంతరిక్ష్ ఒకటి.


ఏంటీ అంతరిక్ష్?

ప్రజలు, ఉద్యోగులు, పంచాయతీ కార్యాలయ సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులకి తక్కువ ఖర్చులో ఐఓటీ టెక్నాలజీలతో స్మార్ట్‌ విధానంతో చెత్త నిర్వహించడం ఎలాగో అవగాహన కల్పిస్తున్నాం. గార్బేజ్‌ బిన్స్‌ దగ్గర ఏర్పాటు చేసిన స్తంభాలకు సెన్సర్‌లు అమర్చుతాం. అవి గార్బేజ్‌ బిన్స్‌ నిండగానే మున్సిపాలిటీ ఉద్యోగులు, చెత్తని సేకరించి తీసుకెళ్లే వర్కర్లకు మెసేజ్‌ రూపంలో సమాచారం చేరవేస్తాయి. అంతేకాదు.. గార్బేజ్‌ బిన్స్‌ చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని దీంట్లో భాగస్వాముల్ని చేస్తున్నాం. నిండిన చెత్తని ఎంత సమయంలో సేకరించి తీసుకెళ్తారో తెలుపుతూ అలర్ట్‌ మెసేజ్‌ వెళ్తుంది. ప్రస్తుతం స్మార్ట్‌ సిటీల రూపకల్పనలో భాగంగా పైలెట్‌ ప్రాజెక్టుగా సౌత్‌ చెన్నైలో ప్రయోగిస్తున్నాం. దేశంలోని ఇతర రాష్ట్రాలకూ ఈ ప్రాజెక్టు చేరేలా చేయాలనేది నా ఆలోచన.. ఇప్పటికైతే 11 మంది బృందంగా ఏర్పడి పని చేస్తున్నాం. ‘ఐఓటీ’ టెక్నాలజీ సాయంతో అందర్నీ భాగస్వాముల్ని చేస్తూ క్లీన్‌ ఇండియాని చూడాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం.

- నిఖిల్‌ గెంటిల

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని