Updated : 04 Jun 2022 07:15 IST

ప్రేమికుడనుకుంటే.. తండ్రిలా చూశాడు

ఉద్యోగంలో చేరిన మొదటిరోజు. ఎలా రిసీవ్‌ చేసుకుంటారోనని టెన్షన్‌గా ఉంది. ఇంతలో నల్ల చొక్కా వేసుకొని ఒకాయన మా దగ్గరికొచ్చాడు. ఎండనపడి వచ్చాడేమో.. చెమటతో చొక్కా తడిసిపోయింది. రాగానే ‘కాసిన్ని మంచి నీళ్లు ఇస్తారా?’ అన్నాడు. నా బాటిల్‌ అందించా. నీళ్లు తాగి ‘థాంక్స్‌’ చెప్పాడు. తనే మా ట్రైనర్‌.

ఆయనది మాకన్నా పైస్థాయి. అయినా ఎక్కడా ఆ దర్పం ఉండదు. పైగా మంచోడు. అందుకే బాగా నచ్చేశాడు. ఆఫీసుకు రాగానే వెళ్లి పలకరించేదాన్ని. తొందర్లోనే మా పరిచయం స్నేహంగా మారింది. మాటల్లో తెలిసింది.. తను భార్యా బాధితుడని.

కొన్నాళ్లకు ఆయన డ్యూటీ నైట్‌ షిఫ్ట్‌కి మారింది. తన కోసమే రోజూ మూడు గంటలు ఆఫీసులో ఎక్కువసేపు ఉండేదాన్ని. మాట కలిపితే పొంగిపోయేదాన్ని. కానీ ఎందుకో.. నేనెంత ఆపేక్ష చూపించినా పెద్దగా పట్టించుకునే వాడు కాదు. ‘అలా సరదాగా ఎక్కడికైనా వెళ్లొద్దామా?’ అడిగానోరోజు.. కాస్త ఏకాంతంగా గడిపే అవకాశం దొరుకుతుందని. కాదనలేదు. కారు తీసుకొచ్చాడు. డ్రైవింగ్‌లో తన పక్కనే కూర్చొని చాలాసేపు ఆరాధనగా చూస్తూనే ఉన్నా. తనేమాత్రం చలించలేదు. తర్వాత ఓచోట కూర్చొని చాలా విషయాలు చెప్పుకున్నాం. ఖాళీగా ఉన్నప్పుడు నేను సెల్‌ఫోన్‌లో వీడియో సాంగ్స్‌ చూస్తుంటే.. తను అందులో హీరోహీరోయిన్ల డాన్స్‌ కన్నార్పకుండా చూసేవాడు. 

తనపై నాకున్న ప్రేమ తెలియజెప్పడానికి చాలా ప్రయత్నాలే చేశా. అసలేమాత్రం స్పందించేవాడు కాదు. లాభం లేదనుకొని ఓసారి నేరుగానే చెప్పాను.. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నా’ అని. ఎప్పట్లాగే అదే మౌనం. పెదాలపై ఓ చిర్నవ్వు. ‘నాకు పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు. ఆ విషయం తెలుసుగా?’ అన్నాడు. ‘నాకనవసరం.. నీకు దగ్గరవ్వకుంటే నా జీవితమే దూరమయ్యేలా ఉంది. నీకు రెండో భార్యగా ఉండటానికైనా ఓకే’ అన్నాను. తను ఒక్కసారిగా కోపం ప్రదర్శించాడు. అంతలోనే కూల్‌ అయ్యి.. ‘నాకు డ్యాన్స్‌ అంటే ప్రాణం. నిజానికి నృత్యమే నాకు మొదటి భార్య. పెద్ద కొరియోగ్రాఫర్‌ కావాలనేది నా కోరిక. ఇంక   నా హృదయంలో నీకెలా చోటివ్వను?’ అంటూ మనసు విప్పాడు. ఎవరికీ తెలియని విషయం ఏంటంటే.. తనిప్పటివరకు ఓ పది సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా చేశాడట. ఫోటోలూ చూపించాడు. ‘నా భార్యతో మనస్పర్థలున్నాయి. ఆ బాధలు ఓర్చుకుంటూనే డ్యాన్స్‌పై దృష్టి పెడుతున్నా. ఈ ఉద్యోగంలోనూ ఎక్కువ రోజులు ఉండలేనేమో! ఈ జన్మలో మరో ఆడపిల్లకు నా జీవితంలో స్థానం లేదు’ అంటుంటే కన్నీళ్లాగలేదు.

ఒక పెళ్లైన మగాణ్ని కోరుకోవడం నా తప్పే కావచ్చు.. కానీ తన క్యారెక్టర్‌ అంతలా నచ్చింది. సాధారణంగా ఒకమ్మాయి తనంత తానుగా వచ్చి ప్రేమిస్తున్నానంటే చాలామంది మగాళ్ళు అవకాశంగా తీసుకొని వాడుకోవాలనుకుంటారు. తనలా కాదు. నేను తనని ఓ ప్రేమికుడిలా భావిస్తే.. తను ఓ తండ్రిలా మంచీచెడు చెప్పాడు. అతడి లక్ష్యం తెలిశాక నేనూ ఇబ్బంది పెట్టదలచుకోలేదు. అక్కణ్నుంచి దూరంగా వచ్చేశాను. అన్నట్టు.. తనని నేను ‘బుచ్చి’ అని పిలుస్తుంటాను. బుచ్చీ.. నువ్వు నీ కలల ప్రపంచానికి రాజు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.                            

 - శ్రీ 


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని